విజేతగా నిలవాలని అనుకునేవారు తెలుసుకోవలసిన విషయమిది!!
posted on Sep 22, 2023 2:41PM
మనిషి జీవితంలో విజయం సాధించాలంటే చాలా కష్టాలు ఎదుర్కోవాలి. కానీ విజయం సాధించి మళ్ళీ కింద పడి, ఎమ్మల్లి లేచి నిలదొక్కుకోవాలంటే మాత్రం కష్టం, తెలివి, ఆత్మవిశ్వాసం, తన మీద తనకు నమ్మకం.. ఇవ్ణనే ఉండాలి. దేనికి ఒక కథ ఉదాహరణగా నిలుస్తుంది. విదేశంలోని ఒక వ్యాపారవేత్త అనుకోని పరిస్థితుల్లో ఘోరంగా దివాళా తీశాడు. ఫలితంగా అప్పుల్లో కూరుకుపోయాడు. మరోవైపు ఆయనకు డబ్బులు ఇవ్వాల్సిన వ్యక్తులు కూడా ముఖం చాటేస్తూ ఉన్నారు. ఈ విషయం తెలిసిన అప్పుల వాళ్ళు తీవ్రంగా ఒత్తిడి తెస్తూ ఉన్నారు. పరిస్థితి అగమ్యగోచరమైపోయింది.
ఎంతో ఆందోళనతో ఆ వ్యాపారి ఒక రోజు తన ఇంటికి సమీపంలోని ఓ పార్క్ కు వెళ్ళి, తలపై చేతులు పెట్టుకొని విషాదంగా కూర్చున్నాడు. ఇంతలో హుందాగా వస్త్రధారణ చేసుకున్న ఓ అరవై ఏళ్ళ వృద్ధుడు ఆయన వద్దకు వచ్చాడు. "ఏదో కోల్పోయిన వాడిలా ఉన్నావు. జీవితంలో ఏమైనా నష్టం వాటిల్లిందా?" అని అడిగాడు. ఎంతో ఆత్మీయంగా పలకరించే సరికి, కదలిపోయిన ఆ వ్యాపారి తన కష్టనష్టాల్ని ఆ పెద్దాయనకు వివరించాడు. వెంటనే ఆ వృద్ధుడు స్పందించి "నేను నీకు ఏదైనా సహాయం చేద్దామనుకుంటున్నాను" అంటూ, "నీ పేరేంట"ని అడిగాడు. ఆ వ్యాపారి తన పేరు చెప్పగానే వెంటనే తన చెక్ బుక్ జేబులో నుంచి తీసి, ఆ పేరుతో చెక్ రాసి, సంతకం చేసి వ్యాపారి చేతిలో పెట్టాడు. "ఈ చెక్కు తీసుకో. నేను దీన్ని నీకు అప్పుగా ఇస్తున్నాను. సరిగ్గా సంవత్సరం తరువాత నేను నిన్ను ఇక్కడే కలుస్తాను. అప్పుడు నా అప్పు తీర్చేయ్" అన్నాడు. అయిదు లక్షల డాలర్ల చెక్కు అది. పైగా ఇచ్చిన వ్యక్తి ఎవరో కాదు - ప్రపంచంలోనే అత్యంత శ్రీమంతుల్లో ఒకరైన రాక్ఫెల్లర్ అని తెలిసి వ్యాపారికి నోట మాట రాలేదు.
ఆ చెక్కు తీసుకొని ఇంటికి చేరుకున్నాడు ఆ వ్యాపారి. కానీ దాన్ని నగదుగా మార్చుకొని అప్పులు తీర్చుకోలేదు. దాన్ని బీరువా అరలో పెట్టుకొని, అది ఉందన్న నమ్మకంతో ముందు తన వ్యాపారాన్ని చక్కదిద్దుకోవడం మొదలుపెట్టాడు. ఆ అయిదు లక్షల డాలర్లు తన వెనుక ఉన్నాయన్న విశ్వాసంతో ధైర్యంగా ముందడుగు వేశాడు. అప్పుల వాళ్ళ వద్దకు వెళ్ళి, కొద్దిరోజులు గడువు ఇవ్వమని అడిగాడు. తనకు రావలసిన మొత్తాన్ని చాకచక్యంతో రాబట్టుకున్నాడు. తిరిగి కొంత పెట్టుబడితో కొత్త వ్యాపారం ప్రారంభించాడు. కొన్నాళ్ళకు మళ్ళీ తన పూర్వవైభవానికి చేరుకున్నాడు. సరిగ్గా సంవత్సరం తరువాత అదే చెక్కు తీసుకొని, కృతజ్ఞతలు చెప్పుకొని ఇచ్చేసేందుకు అదే పార్క్ కు వెళ్ళాడు. సాయంత్రానికి ఆ వృద్ధుడు మళ్ళీ అక్కడకు వచ్చాడు. ఎంతో ఆనందంతో ఈ వ్యాపారి ఆయన వద్దకు వెళ్ళబోతుండగా, దూరంగా ఉన్న ఓ మొబైల్ వ్యాన్ నుంచి నర్సు దిగి పరుగెత్తుకుంటూ వచ్చింది. ఆ వృద్ధుడిని పట్టుకొని "హమ్మయ్య! ఇప్పటికి దొరికాడు. పిచ్చాసుపత్రి నుంచి పారిపోయి వచ్చి, కనిపించిన వారికల్లా. 'నేను రాక్ఫెల్లర్ని' అంటూ చెక్కులు రాసి ఇచ్చేస్తున్నాడు" అంటూ డ్రైవర్ సహాయంతో ఆ వాహనంలోకి అతణ్ణి ఎక్కించుకొని తీసుకువెళ్ళి పోయింది. వ్యాపారి ఆనందాశ్చర్యాలకు గురయ్యాడు. ఇన్నాళ్ళూ తన దగ్గర ఉన్నది ఓ చెల్లని చెక్కనీ, దానిపై భరోసా పెట్టుకొని ఇంత సాధించానా అనీ ఆత్మశోధన చేసుకొని పులకరించి పోయాడు.
నిజానికి ఆ వ్యాపారికి బయట నుంచి ఏ సహాయమూ అందలేదు. కానీ తనలో అచేతనంగా ఉన్న ఆత్మవిశ్వాసాన్ని తట్టి లేపేందుకు ఆ చెల్లనిచెక్కు ఉపయోగపడింది అంతే! అదే విధంగా చాలాసార్లు మనం బయట నుంచి ఏదో ఒక ఆలంబన కావాలని తపించిపోతూ ఉంటాం. కానీ అది కొంత వరకే మనకు సహకరిస్తుంది. ఎప్పుడైనా మనకు వాటిల్లిన ఉపద్రవం నుంచి బయటపడడానికి పూర్తిగా బాధ్యత వహించాల్సింది మనమే! బాహ్యప్రపంచం నుంచి ఎవరికీ, ఎప్పుడూ ఏ సహాయమూ అందదు. ఎవరికి వారే ఆలంబనగా నిలిచి, నిలదొక్కుకోవాలి. అలాంటివారే గొప్ప విజయాలను సాధించగలరు. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి.
*నిశ్శబ్ద.