ఏపీలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి సరే.. తెలంగాణ మాటేమిటి?

రాష్ట్ర విభజన తరువాత నుంచీ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటి?  అన్న ప్రశ్న ఉత్పన్నమౌతూనే వస్తోంది. రాష్ట్ర విభజన కు ముందు ఒకసారి బీఆర్ఎస్ (అప్పుడు టీఆర్ఎస్)తో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగింది. ఆ తరువాత అంటే రాష్ట్ర విభజన తరువాత 2018 అసెంబ్లీ ఎన్నికలలో  కాంగ్రెస్ తో పొత్తు కుదుర్చుకుని పోటీలో నిలిచింది. రెండు సార్లూ నిరాశాజనకమైన ఫలితాలే వచ్చాయి. అంత మాత్రాన తెలంగాణలో తెలుగుదేశం కనుమరుగైపోయిందని భావించొచ్చా అంటే.. ఆ రాష్ట్రంలో క్యాడర్ మాత్రం లేదు గాక లేదని ముక్తకంఠంతో చెబుతోంది. మరి లోపం ఏమిటి? ఎక్కడ ఉంది?  అన్న ప్రశ్నకు మళ్లీ తెలుగుదేశం క్యాడరే.. రాష్ట్రంలో పార్టీ క్యాడర్ చెక్కుచెదరకుండా అలా ఉండటమే కాదు, మరింత బలపడింది కూడా అని చెబుతోంది. అయితే రాష్ట్రంలో పార్టీని ముందుండి నడిపించి, క్యాడర్ లో సమరోత్సాహాన్ని రగిల్చి ఎన్నికల కదనరంగంలోకి దూకేలా చేయడంలో మాత్రం పార్టీ అగ్రనాయకత్వం విఫలమైందంటోంది.

తెలంగాణలో  తెలుగుదేశం పార్టీకి ప్రాణం పెట్టి బతికించుకునే కార్యకర్తలు ఉన్నారు కానీ నాయకులు లేరన్నది నిష్ఠుర సత్యం.  ఆ విషయం ఇటీవలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో సందేహాలకు అతీతంగా రుజువైంది.  తెలంగాణ ఎన్నికల బరిలో తెలుగుదేశం నిలవకపోయినా, అన్ని పార్టీలూ తెలంగాణ జెండాను మోయడానికి తహతహలాడాయి. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా తెలుగుదేశం క్యాడర్ చాలా వరకూ గత ఎన్నికలలో కాంగ్రెస్ జెండా మోసి ఆ పార్టీ విజయంలో అత్యంత కీలక భూమిక పోషించింది. ఈ విషయాన్ని అందరూ అంగీకరించి తీరాల్సిందే. సరే ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ పాత్ర ఏమిటి? ఇక్కడి క్యాడర్ కు పార్టీ నాయకత్వం చేసే దిశా నిర్దేశం ఏమిటి? అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం దొకరడం లేదు.

అయితే తెలంగాణలోని తెలుగుదేశం క్యాడర్ మాత్రం.. ఏపీలో బీజేపీతో కలిసి నడుస్తున్న తెలుగుదేశం ఇక్కడ మాత్రం ఎందుకు దూరంగా ఉండాలని ప్రశ్నిస్తున్నారు. ఆ పొత్తు పొడుపును తెలంగాణలో కూడా కొనసాగించి, ఇక్కడా తెలుగుదేశం ఒకటి రెండు స్థానాల్లో పోటీకి నిలబడాలని డిమాండ్ చేస్తున్నారు. అలా పార్టీ నిలబెట్టే అభ్యర్థులను గెలిపించుకుంటామని ప్రతిజ్ణ చేస్తున్నారు.