ఉప ముఖ్యమంత్రిగా కడియం

 

తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజయ్యను మంత్రి పదవి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ బర్తరఫ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వరంగల్ టీఆర్ఎస్ ఎంపీ కడియం శ్రీహరి రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆదివారం నాడు రాజ్‌భవన్‌‌లో ఆయన చేత గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, జోగు రామన్న, ఎంపీ కె.కేశవరావు తదితరులు పాల్గొన్నారు. అలాగే తెలంగాణ మంత్రివర్గం శాఖలలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. బర్తరఫ్‌కి గురైన రాజయ్య స్థానంలో ఉప ముఖ్యమంత్రిగా కడియం శ్రీహరికి బాధ్యతలు అప్పగించారు. అలాగే విద్యాశాఖ మంత్రిగా కూడా ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఇప్పటి వరకూ విద్యాశాఖ మంత్రిగా వున్న జగదీష్ రెడ్డికి విద్యుత్ శాఖ అప్పగించారు. లక్ష్మారెడ్డికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి బాధ్యతలను అప్పగించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వామినవుతానని, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సైనికుడిలా కష్టపడి పనిచేస్తానని కడియం శ్రీహరి అన్నారు.