చంద్రబాబు బాటలోనే రేవంత్ రెడ్డి.. కేసీఆర్ తో రేవంత్ భేటీ?
posted on Nov 2, 2015 9:50AM
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలా మాట్లాడతారో అందరికి తెలిసిన విషయమే. వాళ్లు వీళ్లు అని చూడరు ఎవరినైనా తిట్టడంలో.. తను చెప్పాలనుకున్నది కుండబద్దలు కొట్టినట్టు చెప్పడంలో తనకు తానే సాటి. అలాంటి కేసీఆర్ కు ధీటుగా మాటల తూటాలు పేల్చాలన్నా.. సరైన సమాధానం చెప్పాలన్నా అది ఒకరికే సాధ్యం అది ఎవరో కాదు.. తెలంగాణ టీడీపీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి. మరి వీరిద్దరూ ఒకరిని ఒకరు దూషించుకుంటే ఎలా ఉంటుందో వేరే చెప్పనవసరంలేదు. మాములుగానే ఒకరంటే ఒకరికి పడదు.. ఇంక ఓటుకు నోటు కేసు తర్వాత వీరిద్దరి మధ్య మాటల యుద్దం ఒక రేంజ్ లో జరిగింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకూ ఒకరిని ఒకరు తిట్టుకున్న రేవంత్ రెడ్డి, కేసీఆర్ లు కలవనున్నట్టు కనిపిస్తుంది. దీనిలో భాగంగానే కేసీఆర్.. రేవంత్ రెడ్డి భేటీ కానున్నట్టు రాజకీయ విశ్లేషకులు గుసగుసలాడుకుంటున్నారు.
అయితే ఏపీ శంకుస్థాపన వల్ల ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య విభేధాలు కొంత వరకూ తొలగిపోయినట్టే కనిపిస్తున్నాయి. సాక్షాత్తు చంద్రబాబే కేసీఆర్ ఇంటికి వెళ్లి మరీ కేసీఆర్ ను ఆహ్వానించారు. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా తన అధినేతే కేసీఆర్ ను కలుపుకుంటూ పోతుంటే తనకు మాత్రం వైరం ఎందుకని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈనేపథ్యంలో త్వరలో జరగబోయే తన కూతురి వివాహానికి కేసీఆర్ ను ఆహ్వానించనున్నారంట. అంతేకాదు కేసీఆర్ కూడా ఈ వివాహానికి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నాయి రాజకీయ వర్గాలు. మొత్తానికి రెండు రాష్ట్రాల మధ్య ఉన్న వైరం నెమ్మదిగా తొలగిపోవడం ఆనందాన్నిచ్చే అంశమే.