ఇంకా ఎన్నాళ్ళు తెలంగాణా సాధన పేరిట ఓట్లు అడుగుతారో?

 

తెలంగాణాలో ఎన్నికలు వచ్చినపుడల్లా కాంగ్రెస్, తెరాస పార్టీలు మరిచిపోకుండా మాట్లాడే విషయం తెలంగాణా రాష్ట్రం సాధన గురించి. ప్రజా సమస్యలు, అభివృద్ధివంటి అనేక ఇతర అంశాలతో పాటు ఇది కూడా ఒక శాశ్విత అంశంగా మారిపోయింది వాటికి. వరంగల్ ఉప ఎన్నికలలో కూడా ఆ రెండు పార్టీలు తెలంగాణా సాధనలో తాము పోషించిన పాత్ర గురించి చెప్పుకొంటూనే కేవలం ఎదుటపార్టీ ఒక్కటే ఆ క్రెడిట్ తీసుకోవడానికి వీల్లేదని వాదిస్తున్నాయి. తెలంగాణా రాష్ట్రం ఏర్పడి సుమారు 16నెలలు అయినా కాంగ్రెస్, తెరాసలు ఆ క్రెడిట్ కోసం ఇంకా కోట్లాడుకోవడం చూస్తుంటే చాలా కొంచెం ఆశ్చర్యం కలిగిస్తోంది. కానీ ముందే చెప్పుకొన్నట్లు అది కూడా ఎన్నికలలో ప్రస్తావించుకోవలసిన ఒక అంశంగా మారిపోయింది కనుకనే తాము ప్రస్తావించకపోతే ఆ క్రెడిట్ ని ఎదుట పార్టీ క్లెయిం చేసుకొంటుందనే భయంతోనో లేకపోతే ప్రజలను ఆకట్టుకోవడానికి ప్రయోగిస్తున్న అన్ని అస్త్రాలలో దీనిని కూడా ఒకటిగా భావిస్తున్నందుననో ప్రతీ ఎన్నికలలో మరిచిపోకుండా “తెలంగాణా మావల్లే వచ్చిందంటే...కాదు మా వల్లే వచ్చిందని” కాంగ్రెస్, తెరాసలు చెప్పుకొంటుంటాయి.

 

కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది కనుక అది తనకున్న ఈ ఆఖరి అస్త్రాన్ని కూడా ఉపయోగించుకొంటోందని అర్ధం చేసుకోవచ్చును. కానీ అధికారంలో ఉన్న తెరాస తన 16 నెలల పరిపాలనలో సాధించిన అభివృద్ధి కార్యక్రమాల గురించి గట్టిగా ప్రచారం చేసుకొని ప్రజలను ఓట్లు అడిగే బదులు, అది కూడా ఇంకా తెలంగాణా సెంటిమెంటు, తెలంగాణా సాధన క్రెడిట్ గురించి చెప్పుకొని ఓట్లు కోరవలసి రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

 

ఈ ఎన్నికలలో తాము ఎంత మెజార్టీ సాధిస్తామని మాత్రమే ఆలోచిస్తున్నాము తప్ప గెలుస్తామా లేదా? అని ఎన్నడూ ఆలోచించలేదని తెరాస నేతలు చెప్పుకొంటూనే, మళ్ళీ ప్రతిపక్షాల ఓట్లు చీల్చడానికి వైకాపాను దాని అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని మధ్యలోకి రప్పించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. కాంగ్రెస్, తెదేపా, బీజేపీలు చేస్తున్న ఈ ఆరోపణలను ఆ రెండు పార్టీలు అంగీకరించనప్పటికీ, వాటి మధ్య ఉన్న రహస్య అవగాహన గురించి తెలిసినవారు అందరూ కూడా ఎన్నడూ తెలంగాణా సమస్యల గురించి మాట్లాడని, ఎన్నడూ తెలంగాణా గడ్డపై అడుగుపెట్టని జగన్మోహన్ రెడ్డి, కేవలం తెరాసను గెలిపించడం కోసమే స్వయంగా నడుం బిగించి వరంగల్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారని భావిస్తున్నారు. తమ అభివృద్దే తమకు ఘన విజయం అందిస్తుందని నమ్మకంగా చెపుతున్న తెరాస, చివరికి జగన్మోహన్ రెడ్డి సహాయం కూడా తీసుకోవడం చూస్తుంటే, తెరాస ఎంత మెజార్టీ వస్తుందని కాక ఈ ఉప ఎన్నికలో ఏదో విధంగా గట్టెక్కితే చాలానే భావనతో ఉన్నట్లు అనిపిస్తోంది.

 

ఒకవేళ ఈ ఉప ఎన్నికలలో తెరాస పార్టీ ఓడిపోయినా దానికి ఏమీ నష్టం ఉండదు. తెరాస పట్ల ప్రజలలో వ్యతిరేకత పెరిగిందని ప్రతిపక్ష పార్టీలు ప్రచారం చేసుకోవడానికి మాత్రమే అది ఉపయోగపడుతుంది. అధికారంలో ఉన్న ఏ పార్టీకయినా ఎన్నికలలో ఇటువంటి భయాందోళనలు ఎదుర్కోకూడదు...ఎవరి సహకారం లేకుండా ధీమాగా ఎన్నికలకు వెళ్ళాలంటే దానికి ఒకే ఒక మార్గం ఉంది. అదే ప్రజాభీష్టానికి అనుగుణంగా పారదర్శకమయిన పాలన సాగిస్తూ రాష్ట్రాన్ని అన్నివిధాల అభివృద్ధి చేయడమే.

 

ఈ రహస్యం అన్ని రాజకీయ పార్టీలకి కూడా తెలుసు. కానీ నిత్యం అంత కష్టం పడటం కంటే ఎన్నికలు వచ్చినప్పుడు ఏదో ఒకటి చేసి ఎలాగో ఒకలాగ గెలిచేద్దామనుకొంటుంటాయి. అందుకే ఈ సెంటిమెంటులు, క్రెడిట్లు, పరోక్ష సహాయ సహకారాలు అవసరం పడుతుంటాయి. కానీ ప్రజలు ఇప్పుడు రాజకీయంగా చాలా చైతన్యంగ ఉన్నారనే సంగతి గ్రహించలేకపోతున్నాయి..లేదా గ్రహించనట్లు ఆత్మవంచన చేసుకొంటూ ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నిస్తున్నాయి. కానీ దాని వలన చివరికి తామే నష్టపోతాయని గ్రహిస్తే చాలు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu