మావోయిస్ట్ అజెండా అమలు చేసే తెరాస నేతలనే మావోయిస్టులు ఎత్తుకుపోతే

 

తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే మావోయిష్టుల సమస్య పెరుగుతుందని కేంద్ర నిఘావర్గాలు యూపిఏ ప్రభుత్వాన్ని హెచ్చరించినట్లు విభజన సమయంలో వార్తలు వినిపించాయి. కానీ గత ఎడాదిన్నర సమయంలో అటువంటి పరిస్థితులు కనబడకపోవడంతో అందరూ తేలికగా ఊపిరి తీసుకొన్నారు. తెరాస అధ్యక్షుడు కేసీఆర్ సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో తమ పార్టీ అధికారంలోకి వచ్చినట్లయితే తమ ప్రభుత్వం మావోయిష్టుల అజెండానే అమలు చేస్తుందని ప్రకటించారు. కానీ ఆయన పాలనలోనే మావోయిష్టులపై ఎన్కౌంటర్ జరిగింది. అప్పటి నుండే మళ్ళీ మావోయిష్టులు తమ ఉనికి చాటుకొంటున్నారు.

 

వరంగల్ ఉప ఎన్నికలలో తెరాసను ఓడించి దానికి గుణపాఠం చెప్పాలని మావోయిష్టు అధికార ప్రతినిధి జగన్ కూడా వరంగల్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈసారి తెరాస పార్టీకి చెందిన మానె రామకృష్ణ, పటేల్ వేంకటేశ్వరులు,సత్యనారయణ, జనార్ధన్, సురేష్, రామకృష్ణలని మావోయిష్టులు బుదవారం సాయంత్రం ఎత్తుకుపోయారు. మావోయిష్టు అజెండాను అమలు చేస్తున్నామని చెప్పుకొనే తెరాస పార్టీ నేతలనే మావోయిస్టులు ఎత్తుకుపోవడం చాలా సంచలనం సృష్టిస్తోంది.

 

ముఖ్యమంత్రి కేసీఆర్ పేరిట మావోయిష్టు అధికార ప్రతినిధి జగన్ వ్రాసిన బహిరంగ లేఖలో బూటకపు ఎన్కౌంటర్లు చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని, ఖమ్మం జిల్లా నుండి ఆదిలాబాద్ వరకు నిర్వహిస్తున్న పోలీసుల కూంబింగ్ ఆపరేషన్స్ తక్షణమే నిలిపివేయాలని లేకుంటే తెరాస నేతలపై భౌతిక దాడులు చేస్తామని హెచ్చరించారు.

 

భూటకపు ఎన్కౌంటర్లను ప్రజలు కూడా సమర్ధించరు..హర్షించరు. కానీ ప్రజాస్వామ్యంలో నిరంకుశపోకడలను అందరూ తీవ్రంగా వ్యతిరేకిస్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపక్ష పార్టీలు, మీడియా పట్ల ప్రదర్శిస్తున్న కటినమయిన వైఖరిని, ఇప్పుడు మవోయిష్టులను ఎదుర్కోవడంలో కూడా చూపించగలిగితే ప్రజలు హర్షిస్తారు. ప్రభుత్వానికి మావోయిష్టులు సవాలు విసురుతున్నపుడు చాలా కటినంగా వ్యవహరించడం అవసరమని చెప్పకతప్పదు. లేకుంటే రాష్ట్రంలో మావోయిష్టులు సమాంతర ప్రభుత్వం నడిపే ప్రమాదం ఉంది. కానీ అదే సమయంలో గత ఏడాదిన్నర కాలంగా నిద్రాణ స్థితిలో ఉన్న మావోయిస్టులు ఇంత అకస్మాత్తుగా తమ ప్రభుత్వానికి ఎందుకు ఈవిధంగా సవాళ్ళు విసురుతున్నారు? అని కూడా తెరాస ప్రభుత్వం ఆలోచించవలసి ఉంది.

 

సమర్ధంగా పరిపాలన చేయడానికి ముఖ్యమంత్రి కొన్ని విషయాలలో కటువుగా ఉండటం చాలా అవసరమే కానీ తనను ఎవరూ ప్రశ్నించకూడదు...తప్పులను ఎత్తి చూపించి విమర్శించకూడదనే ధోరణి వ్యక్తపరిస్తే ప్రజాస్వామ్య వ్యవస్థలో అది నిరంకుశత్వంగా పరిగణించబడుతుంది. తమకు రహస్య మిత్రపక్షంగా కొనసాగుతున్న జగన్మోహన్ రెడ్డితో సహా ప్రతిపక్షాలన్నీ, చివరికి మావోయిష్టులు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంకుశత్వ ధోరణిని, ప్రజా వ్యతిరేక నిర్ణయాలని, రైతుల ఆత్మహత్యలు వంటి తీవ్ర సమస్యల విషయంలో ఆయన ప్రభుత్వం చూపిన తీవ్ర అలసత్వాన్ని ఈ ఉప ఎన్నికల సందర్భంగా గట్టిగా ప్రశ్నించాయి. కనుక తన ప్రభుత్వంలో ప్రతిపక్షాలు ఎత్తి చూపిస్తున్న ఇటువంటి లోపాలను ముఖ్యమంత్రి కేసీఆర్ సవరించుకొని ముందుకు వెళ్ళగలిగితే, సమస్యలు వాటంతట అవే సమసిపోతుంటాయి.