సెక్షన్ 8 అమలుకు ఆదేశాలివ్వండి
posted on Jun 26, 2015 12:26PM
.jpg)
ఇప్పటికే ఓటుకు నోటు కేసులో సెక్షన్ 8 అమలుపై పలు రకాల వివాదాలు జరుగుతున్నాయి. ఒక వైపు తెలంగాణ ప్రభుత్వం సెక్షన్ 8 అమలును వ్యతిరేకిస్తుండగా.. ఏపీ ప్రభుత్వం సెక్షన్ 8 అమలు చేయాలని డిమాండ్ చేస్తోంది. ఈ విషయంపై చర్చించేందుకు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఇప్పటికే ఢిల్లీ వెళ్లారు. అయితే సెక్షన్ 8 అమలు చేయాలా? వద్దా అనే విషయం పై ఈరోజు ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పిల్ దాఖలైంది. సీమాంధ్ర గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు కె.వి.కృష్ణయ్య హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని, తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించాలని హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. రాష్ట్రవిభజన చేసేపుడు కనీసం ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిప్రాయాలను తీసుకోలేదని.. తీసుకోకుండానే ఒత్తిళ్ల కారణంగా అన్యాయంగా రాష్ట్రాన్ని విడదీశారని పేర్కొన్నారు. అంతేకాక ఆయన దాఖలు చేసిన పిల్ లో కేంద్ర హోంశాఖ కార్యదర్శి, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెండు రాష్ట్రాల హోంశాక ముఖ్య కార్యదర్శకులను ప్రతివాదులుగా పేర్కొన్నారు.