బ్రిటన్ జర్నలిస్ట్ కు సెహ్వాగ్ దిమ్మతిరిగే సమాధానం..
posted on Aug 25, 2016 5:20PM
భారత క్రికెటర్ సెహ్వాగ్ తన ఆటలోనే కాదు.. ఈమధ్య ట్వీట్లలో కూడా తన దూకుడుని ప్రదర్శిస్తున్నాడు. రియో ఒలింపిక్స్ పుణ్యమా అని వీరూ తన చేతికి మళ్లీ పని చెప్పాల్సి వస్తుంది. మొన్నీమధ్యే రియో ఒలింపిక్స్ గురించి ప్రముఖ కాలమిస్ట్ శోభా డే వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో వీరూ శోభాడేకు ఘనమైన ‘సన్మానం’ చేశారు. ఇప్పుడు మరో జర్నలిస్ట్ బుక్కయ్యాడు. బ్రిటన్ కు చెందిన పియర్స్ మోర్గన్ అనే జర్నలిస్ట్ రియో ఒలింపిక్స్ లో భారత్ గెలిచిన పతకాలపై వ్యంగ్యాస్త్రాలు విసిరాడు. 120 కోట్ల జనాభా ఉన్న దేశం కేవలం రెండు ఒలింపిక్స్ మెడల్స్ గెలుచుకున్నందుకు సంబరాలు చేసుకొంటోంది.. అని అన్నాడు. ఇక ఈ వ్యాఖ్యలకు స్పందించిన వీరూ.. ఘాటుగానే అతనికి సమాధానమిచ్చాడు..
‘అవును.. మేం చిన్న సంతోషాలనే సంబరంగా మార్చుకున్నాం. మరి క్రికెట్ ను ఇన్వెంట్ చేసిన దేశం మీది. మరి ఇంత వరకూ ఒక్క ప్రపంచకప్పునూ సాధించలేకపోయిందే మీ దేశం.. ఇప్పటికీ వరల్డ్ కప్ కోసం మీరు సాగిస్తున్న వేట ఎంబరాసింగ్ గా లేదా?’’ అంటూ సెహ్వాగ్ ఘాటైన ట్వీట్ ను పెట్టాడు. దీనికి ఆ జర్నలిస్ట్ కూడా సమాధాన మిచ్చాడు... “మా దేశం టీ 20 వరల్డ్ కప్ నెగ్గింది.. లెజెండ్, ఆ ప్రపంచకప్ లో పీటర్సన్ కు మ్యాన్ ఆఫ్ ద సీరిస్ దక్కింది’’ అంటూ చెప్పుకొచ్చాడు.
మరి దీనికి వీరూ ఎందుకు ఊరుకుంటాడు.. మంచి లాజిక్ తో కొట్టాడు.“టీ 20 ప్రపంచకప్ విజయాన్నే సెలబ్రేట్ చేసుకుంటాం.. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన పీటర్సన్ ను హీరో అనుకొంటే మాకేం అభ్యంతరం లేదు.. అలాగే మా సంబరాలూ మేం చేసుకుంటాం.’’ అంటూ ట్వీటాడు. దీనికి ఆ బ్రిటీషర్ మళ్లీ మారు మాట్లాడలేదు! మొత్తానికి అంత మంది జనాభాలో వీరూ స్పందించి సమాధానం చెప్పడం మంచిదే..