విజయసాయి మౌనం సజ్జలపై పై చేయి కోసమేనా?
posted on May 29, 2023 11:48AM
విజయసాయి రెడ్డి.. వైసీపీతో ఈ పేరును విడదీసి చూడటం సాధ్యం కాదన్న బావన ఇటీవలి వరకూ అందరిలోనూ ఉండేది. అంతగా విజయసాయి వైసీపీతో మమేకమై ఉండేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే పార్టీ ఆవిర్భావం నుంచి జగన్ కు కుడి, ఎడమ, ముందు, వెనుక కూడా విజయసాయే అన్నట్లుగా ఆయన హవా కొనసాగింది. జగన్ అక్రమాస్తుల కేసులో కూడా ఏ2గా జగన్ కు తోడుగానే ఉన్నారు విజయసాయి. అందుకే విజయసాయికి వైసీపీలో తిరుగుండదనే అంతా భావించారు. అయితే ఇటీవలి కాలంలో ఆ పరిస్థితి పూర్తి రివర్స్ అయ్యింది. పార్టీ కార్యక్రమాలలో విజయసాయి నీడ కూడా కనిపించడం లేదు. ఢిల్లీలో వైసీపీ ఎంపీలందరిదీ ఒక దారీ అయితే విజయసాయి రెడ్డి ఒక్కడిదీ ఒక దారి అన్నట్లుగా ఆయన ఒంటరి అయిపోయారు. కేంద్ర మంత్రిని కలిసినా, ఏపీ కొత్త గవర్నర్ ను ప్రమాణ స్వీకారం ముందు కలిసినా విజయసాయి ఒక్కరే వెళుతున్నారు.
ఇక అన్నిటికీ మించి ఏపీ సర్కార్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఏపీ గ్లోబల్ సమ్మిట్ పేరుతో నిర్వహించిన ఇన్వెస్ట్ మెంట్ సదస్సు లో కూడా ఎక్కడా విజయసాయి కనిపించలేదు. విజయసాయి కేవలం వైసీపీ ఎంపీ మాత్రమే కాదు.. పార్టీ ఆవిర్భావం నుంచీ ఆయన వైసీపీకి పబ్లిక్ రిలేషన్స్ విషయంలో ఏకైక ప్రతినిథి కూడా. ఇక ఇటీవలి కాలం వరకూ ఆయన ఉత్తరాంధ్రకు ఇన్ చార్జ్ కూడా. అంతేనా.. దేశ వ్యాప్తంగా ఇన్వెస్టర్లతో ఆయనకు బోలెడు సంబంధాలు ఉన్నాయి.
అయినా సరే వివిధ రాష్ట్రాలలో విశాఖ సదస్సు ప్రమోషన్ల కోసం నిర్వహించిన రోడ్ షోలలో ఆయన ఎక్కడా కనిపించలేదు. పారిశ్రామిక వేత్తల ఆహ్వానం కోసం ఏర్పాటైన బృందంలోనూ విజయసాయికి ప్రాతినిథ్యం లేదు. నిన్న మొన్నటి వరకూ పార్టీ ఎంపీలలో వెలివేతకు గురైన వ్యక్తి రఘురామకృష్ణం రాజు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు ఆయనకు తోడుగా విజయసాయి కూడా చేరారా అన్న అనుమానాలు పొలిటికల్ సర్కిల్స్ లో వ్యక్తం అయ్యాయి కూడా. తారకరత్న మరణం, ఆ తరువాత అంత్యక్రియల సందర్భంగా విజయసాయి బాలకృష్ణతో కలిసి అన్ని ఏర్పాట్లలోనూ పాల్గొనడం వల్లే విజయసాయిని దూరం పెట్టారా అన్న చర్చ అప్పట్లో జోరుగా సాగింది. విజయసాయి పార్టీకి దూరం అయ్యారా అన్న అనుమానాలు కలిగే విధంగానే ఆయన తీరు కూడా ఇటీవలి కాలంలో ఉంది. జగన్ మెచ్చేలా ఈ మధ్య కాలంలో ఆయన ఎన్నడూ విపక్షంపై విమర్శలతో విరుచుకుడలేదు.
అంతే కాదు.. విపక్ష నేత చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా ఆయన మర్యాదపూర్వకంగా విషెస్ కూడా తెలిపారు. ఆ విషెస్ గతానికి భిన్నంగా ఎక్కడా వ్యగ్యం లేకుండా అత్యంత గౌరవ ప్రదంగా ఉన్నాయి. అలాగే పార్టీ వ్యవహారాలలో కూడా విజయసాయి అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తూ వస్తున్నారు. కొండొకచో ఆయన ట్వీట్లు పార్టీకి నష్టం చేకూర్చేవిగా కూడా ఉంటున్నాయి. తెనాలిలో జగన్ రైతు భరోసా కింద మీట నొక్కి రైతుల ఖాతాలలో నిధులు జమ చేసే సమయంలో పీఎం కిసాన్ పథకం కింద రైతులకు ఆర్థిక సహాయం అందజేసిన సందర్భాన్ని పురస్కరించుకుని విజయసాయి మోడీకి ధన్యవాదాలు తెలుపుతూ చేసిన ట్వీట్ ఇటు పార్టీలోనే కాదు.. అన్ని వర్గాలనూ ఆశ్చర్యంలో ముంచెత్తింది. పీఎం ఒక రోజు ముందే రైతుల ఖాతాలలోకి విడుదల చేసిన నిధులకు జగన్ ఉత్తుత్తి మీట నొక్కారన్న విపక్షాల విమర్శలకు ఊతం ఇచ్చేదిగా విజయసాయి ట్వీట్ ఉంది.
ఆ ట్వీట్ కు ముందు వరకూ వైసీపీ అధినేత జగన్ విజయసాయిని దూరం పెడుతున్నారని అంతా భావించారు. అయితే విజయసాయి మోడీకి కృతజ్ణతలు చెబుతూ చేసిన ట్వీట్ తరువాత విజయసాయి రెడ్డే పార్టీకి దూరం జరుగుతున్నారా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అన్నిటికీ మించి పార్టీ ఇబ్బందుల్లో ఉన్నా మౌనం వీడి పార్టీకి మద్దతుగా విజయసాయి మాట్లాడకపోవడంతో ఆయన దాదాపుగా వైసీపీతో తెగతెంపులు చేసేసుకున్నారా లేక వైసీపీయే ఆయనను వదిలించుకుందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే హఠాత్తుగా ఉరుములేని పిడుగులా... ఆయన తెలుగుదేశం పార్టిని విమర్శిస్తూ తాజాగా చేసిన ట్వీట్ విజయసాయి ఇంత కాలం మౌనం వెనుక ఏదైనా వ్యూహం ఉందా? పార్టీలో కోల్పోయిన తన స్థానాన్ని తిరిగి సంపాదించుకునే ఎత్తుగడ ఉందా అన్న చర్చ మొదలైంది. ఇంతకీ ఆయన తాజాగా మహానాడులో చంద్రబాబు నాయుడు ప్రకటించిన మినీ మేనిఫెస్టోను మాయా ఫెస్టోగా అభివర్ణిస్తూ ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ లో గతంలో ఉన్న వ్యంగ్య వైభవం మళ్లీ కనిపించింది. 2014 ఎన్నికలలో విజయం సాధించిన తరువాత మేనిఫెస్టోనే మాయం చేసిన బాబు ఈ సారి మాయాఫెస్టోను విడుదల చేశారని ఆ ట్వీట్ లో విజయసాయి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
వైసీపీ ఇటీవలి కాలంలో వరుస ఎదురు దెబ్బలు తింటుండటం, పార్టీలో అంతా తానై వ్యవహరిస్తున్న సజ్జల పరిస్థితిని చక్కదిద్దడంలో విఫలం కావడం, సజ్జలపై మెజారిటీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఆగ్రహంగా ఉన్నారన్న వార్తలు, అలాగే పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురైన వారు నేరుగా సజ్జలపైనే విమర్శలు గురిపెట్టడం వంటి సంఘటనల నేపథ్యంలో విజయసాయి మౌనం వీడటం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీపై విజయసాయి మళ్లీ పట్టు సాధించేందుకు ఇంత కాలం వ్యూహాత్మక మౌనం పాటించి, ఇప్పుడు అదును చూసి సజ్జలపై పై చేయి సాధించేందుకు పావులు కదుపుతున్నారా అన్న అనుమానాలను వైసీపీ శ్రేణులే వ్యక్తం చేస్తున్నాయి.