వైసీపీ ఎంపీ ఎమ్మెల్యేల మధ్య తీవ్ర ఘర్షణ.. మధ్యలో బలైన పోలీసు అధికారులు 

గుంటూరు జిల్లా పల్నాడు పౌరుషాలకు పెట్టింది పేరు. అటువంటి చోట ఇద్దరు అధికార వైసీపీ ముఖ్య నేతల మధ్య ఆధిపత్య పోరు సర్కార్ కు తలనొప్పిగా మారింది. గత కొంత కాలంగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు, చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు తలెత్తి వివాదాలు నడుస్తున్న సంగతి తెలిసిందే. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోకి అదే ప్రాంతం నుంచి ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయులును అడుగు పెట్టనివ్వకుండా చేయాలని ఎమ్మెల్యే రజనీ, ఆమె అనుచరులు రెండుమూడు సార్లు ప్రయత్నించారని సమాచారం. దీనికి కారణం.. ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా పనిచేసిన వారివద్దకు ఎంపీ వెళుతున్నారనీ, వారితో ఎక్కువగా సఖ్యతతో మెలగుతున్నారనీ ఎమ్మెల్యే కోపమట. ఈ ప్రయత్నంలో భాగంగా తన అనుచరులతో ఎంపీ కారును అడ్డుకునేలా ఎమ్మెల్యే చేయడంతో ఈ వివాదం తీవ్రరూపం దాల్చినట్లు తెలుస్తోంది.

 

ఇది ఇలా ఉండగా ఎమ్మెల్యే విడదల రజనీ అనుచరులు తమ నియోజకవర్గంలో భూసేకరణ సమయంలో రైతుల వద్ద లక్షల్లో కమీషన్లు దండుకుంటున్నారని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ వ్యవహారంతో తనకేమీ సంబంధం లేదని ఎమ్మెల్యే రజనీ పార్టీ అధిష్టానానికి తెలియచేసారు. ఆ ఎమ్మెల్యే నియోజకవర్గం పరిధిలో జరిగిన అక్రమ తవ్వకాలపై కూడా ఎంపీ విజిలెన్స్‌ అధికారులకు ఫిర్యాదు చేశారని ఎమ్మెల్యే వర్గం ఆరోపిస్తోంది. అంతేకాకుండా ఆ అక్రమ తవ్వకాలు ఎమ్మెల్యే రజనీ ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయని కూడా ఎంపీ ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.

 

ఇది ఇలా ఉండగా.. గత కొద్దిరోజులుగా తనతోపాటు తన పీఏ, మరో ముఖ్య అనుచరుడి ఫోన్లపై పోలీసులు నిఘా పెట్టి.. తాము ఎవరెవరితో మాట్లాడుతున్నామనే కాల్‌ డేటాను గురజాల డీఎస్పీ, సీఐలు సేకరించారని ఎమ్మెల్యే రజనికి తెలిసింది. ఇంటెలిజెన్స్ పోలీసుల ద్వారా ఎంపీ తమ ఫోన్ల పై నిఘా పెట్టిన విషయాన్ని సీరియస్‌గా తీసుకుని.. ఈ విషయాన్ని ప్రభుత్వంలోని ఓ ముఖ్యనేత దృష్టికి ఆమె తీసుకెళ్లారట. దీంతో ఆ ఇద్దరు అధికారులపై రాత్రికిరాత్రే వేటు పడింది. ఎమ్మెల్యే కాల్‌డేటా సేకరించిన పల్నాడు ప్రాంతానికి చెందిన ఓ డీఎస్పీ, సీఐలను వీఆర్‌కు పంపుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే తమకు ఆ ఫోన్ నంబర్లు ఎవరివో తెలియవనీ, ఎంపీ సూచన మేరకే అలా చేశామనీ ఆ ఇద్దరు పోలీసు అధికారులు ఉన్నతాధికారులతో మొర పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది.

 

అయితే ఈ మొత్త్తం వ్యవహారాన్ని సీక్రెట్ గా ఉంచేందుకు ప్రభుత్వంలోని కొందరు పెద్దలు ప్రయత్నించారని తెలుస్తోంది. అంతేకాకుండా అధికార పార్టీ ఎమ్మెల్యే ఫోన్‌ పై ఎంపీ నిఘా పెట్టించిన విషయం బయటకు పొక్కితే అటు పార్టీ.. ఇటు ప్రభుత్వం పరువు పోతుందని భావించిన పెద్దలు.. అసలు విషయం బయటకు రాకుండా ఉండేందుకు ప్రయత్నం చేశారు. ఇద్దరు పోలీసు అధికారులు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వ్యవహరించినందుకే వారిపై చర్యలు తీసుకున్నామని ఉన్నతాధికారులు చెప్పడం ఇక్కడ విశేషం.