బీజేపీలోకి బాబు బినామీలు.. ఇది 100% మ్యాచ్ ఫిక్సింగే!!
posted on Jun 22, 2019 2:15PM
ట్విట్టర్ వేదికగా టీడీపీ మీద, టీడీపీ అధినేత చంద్రబాబు మీద విమర్శలు గుప్పించే వైసీపీ నేత విజయసాయి రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. "చంద్రబాబు విహార యాత్రకు ఏ దేశం వెళ్లారో ఆ పార్టీ నాయకులకూ తెలియదు. స్విట్జర్లాండ్ వెళ్లారో స్వీడన్‌లో ఉన్నారో చెప్పలేనంత రహస్యమా? ఎల్లో మీడియా కూడా యూరప్ నుంచి ముఖ్య నాయకులతో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారని రాసింది. యూరప్ అనేది దేశం కాదు. 44 దేశాలున్న ఖండమని అందరికీ తెలుసు." అని ట్వీట్ లో పేర్కొన్నారు.
"సొంత నిధులతో తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేసింది. 45 లక్షల ఎకరాలకు నీరందుతుంది. కేంద్రం నిధులిచ్చినా ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు సగం కూడా నిర్మించలేక పోయారు. ఎంత సేపు నిధులను దోచుకోవడం తప్ప పూర్తి చేయాలన్నసంకల్పమే లేదు." అని విమర్శించారు.
"బీజేపీలో చేరిన నలుగురు రాజ్యసభ సభ్యుల్లో ముగ్గురు చంద్రబాబు బినామీలే. తనపై అవినీతి కేసులు పెట్టకుండా రక్షణ కోసమే వారిని పంపించారు. తనకు తెలియకుండానే జరిగితే ఫిరాయించిన వారిని అనర్హులుగా ప్రకటించాల్సిందిగా రాజ్యసభ చైర్మన్‌కు లేఖ అయినా రాసి ఉండేవారు. ఇది 100% మ్యాచ్ ఫిక్సింగే." అని మరో ట్వీట్ చేసారు.
"నలుగురు టీడీపీ ఎంపీలు పార్టీ మారితే అనుకూల మీడియా చాలా జాగ్రత్తగా, బీజేపీకి ఆగ్రహం తెప్పించకుండా వార్తలు రాసింది. రెండేళ్ల నుంచి బీజేపీ, మోదీపైన దుమ్మెత్తి పోసిన మీడియా ఇప్పుడు బాబు తీసుకున్న లైన్‌ను అర్థం చేసుకుంది. బీజేపీని ప్రశంసించే వార్తలొస్తాయి ఇక నుంచి." అంటూ బాబు అనుకూల మీడియాను ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేసారు.