విజయవాడ టు శ్రీశైలం.. సీప్లేన్ టికెట్ ధర ఎంతుండొచ్చంటే?

ఏపీలో సీఎం చంద్రబాబు సీ ప్లేన్లో విజయవాడ లోని పున్నమి ఘాట్ నుంచి శ్రీశైలం వెళ్లారు. అసలీ సీ ప్లేన్ అంటే ఏమిటన్న ఆసక్తి రాష్ట్ర ప్రజలలో ఉంది. తీరా చంద్రబాబు ఈ సీప్లేన్ సర్వీసులను లాంఛనంగా ప్రారంభించి.. ఆ సీప్లేన్ లో ప్రయాణించిన తరువాత.. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా సీప్లేన్ పై చర్చ మొదలైంది.

దీని ప్రత్యేకతలు ఏమిటి?  విజయవాడ నుంచి శ్రీశైలానికి అరగంటలో వెళ్లిపోవచ్చా. ఈ సీప్లేన్ టికెట్ ధర ఎంత ఉంటుంది అన్న చర్చ మొదలైంది.  అలాగే ఇది ఎంత ఎత్తులో వెడుతుంది?  నీటిపై విమానం టేకాఫ్ తీసుకోవడానికి ముందు ఎంత దూరం ప్రయాణిస్తుంది వంటి ఆసక్తి వ్యక్తం అవుతోంది.

ఇక వివరాల్లోకి వెడితే  ప్లేన్ లో ప్రయాణించే వారు   ప్రకృతి అందాలు ఆస్వాదించేందుకు వీలుగా ఇది  1,500 అడుగుల ఎత్తులో వెళ్తుంది. టేకాఫ్, ల్యాండింగ్ రెండూ నీటి పైనే జరుగుతాయి. ఇందులో 14 మంది ప్రయాణించవచ్చు. ఇక టికెట్ ధర అయితే  దాదాపు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ఉండొచ్చు. రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుంది. ఇక భవిష్యత్ లో  సీప్లేన్ విమానాశ్రయాల అవసరాన్ని చాలా వరకూ తగ్గించే అవకాశాలు ఉన్నాయి. గగన విహారంతో పాటు.. నీటిపై విమానంలో ప్రయాణం అన్నది పర్యటకులకు ఒక కొత్త అనుభూతిని ఇస్తుందనడంలో సందేహం లేదు.