వ్యాక్సిన్ బంద్!.. చేతులెత్తేసిన తెలుగు స్టేట్స్..
posted on May 7, 2021 6:36PM
కరోనాకు సరైన మందు లేదు. నివారణ ఒక్కటే మార్గం. అందుకు, వ్యాక్సిన్ ఏకైక మార్గం. ఇంతటి కీలకమైన వ్యాక్సిన్‌కు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర కొరత. ప్రభుత్వాల నిర్లక్ష్యం, పాలకుల ఉదాసీన వైఖరే ఇందుకు కారణమనే విమర్శలు. ఓవైపు దేశంలో నిత్యం 4 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతూ వైరస్ వణికిస్తోంది. మరోవైపు, ఆక్సిజన్ కొరత, బెడ్స్.. మెడిసిన్ షార్టేజ్‌తో ఆందోళన పెరుగుతోంది. ఇంతటి కరోనా కల్లోలంలో వ్యాక్సినేషన్ ఒక్కటే మనముందున్న ఆశాకిరణం. కరోనా బారి నుంచి కాపాడే బ్రహ్మస్త్రం.
కీలకమైన వ్యాక్సినేషన్ విషయంలో అనేక అవరోధాలు, ఆటంకాలు. ప్రభుత్వాలకు సరైన ముందుచూపు లేకపోవడంతో.. తెలుగు రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ అరకొరగా సాగుతోంది. తెలంగాణ సర్కారు శనివారం నుంచి ఏకంగా తొలి డోసు వ్యాక్సినేషన్‌ను ఆపేస్తూ నిర్ణయం తీసుకోవడం కలకలం రేపుతోంది. టీకాల కొరతే ఇందుకు కారణమని చెబుతోంది. ఈ నెల 15 వరకు కరోనా టీకా మొదటి డోసు ఇవ్వడం ఆపేస్తున్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అయితే.. తొలి డోసు ఆపేసినా.. రెండో డోసు టీకా కార్యక్రమం మాత్రం కొనసాగనుంది. తెలంగాణలో సెకండ్ డోస్ వ్యాక్సిన్ తీసుకోవాల్సిన వారు 11 లక్షల మంది ఉన్నారని ఆరోగ్య శాఖ తెలిపింది.
గతంలోనే దాదాపు 30 లక్షల కొవిడ్ వ్యాక్సిన్ డోసులు కావాలని సీఎస్ సోమేశ్‌కుమార్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇప్పటివరకు రాష్ట్రానికి కేవలం 15 నుంచి 16 లక్షల డోసులు మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా డోసుల కొరత కారణంగా ఇప్పటికే మూడు, నాలుగు సార్లు వ్యాక్సినేషన్ ప్రక్రియను ఆరోగ్య శాఖ నిలిపివేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సిన్ కొరత ఏర్పడడంతో రెండో డోసు వేసుకోవాల్సిన వారి సంఖ్య సైతం క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ తొలి డోసు ప్రక్రియను నిలిపివేస్తూ కేవలం రెండో డోసు మాత్రమే వేయాలని తాజాగా ఆరోగ్య శాఖ నిర్ణయం తీసుకుంది.
అటు, మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లోనూ టీకాల కార్యక్రమం నత్తనడకన సాగుతోంది. జగన్‌రెడ్డి సర్కారు ఆలస్యంగా మేలుకోవడంతో ఓపెన్ మార్కెట్లో వ్యాక్సిన్‌లు దొరకని పరిస్థితి నెలకొంది. కోట్లలో వ్యాక్సిన్ డోసుల అవసరం ఉండగా.. కేవలం లక్షల్లో మాత్రమే ఆర్డర్ పెట్టడం అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికే మేలో ప్రారంభం కావాల్సిన 18 ఏళ్లకు పైబడిన వారికి టీకా ఇచ్చే కార్యక్రమాన్ని వాయిదా వేసింది జగన్‌రెడ్డి ప్రభుత్వం. ఎందుకోగానీ, రాష్ట్రం తరఫున వ్యాక్సిన్‌లు కొనుగోళ్లకూ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. సరిపడా టీకాలు ఉంటేనే వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపడతామని తాజాగా ప్రభుత్వం ప్రకటించడం ఆందోళన రేపుతోంది. టీకాల కొనుగోలుకే ఏపీ సర్కారు అరకొర ఆర్డర్లు ఇవ్వగా.. ఇక సరిపడా వ్యాక్సిన్లు ఎక్కడి నుంచి వస్తాయని విపక్షం ప్రశ్నిస్తోంది.
దేశంలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ ఇమ్మని కేంద్రం స్పష్టం చేస్తుంటే.. ఏపీ ప్రభుత్వం సాధ్యం కాదని చెప్పటం తగదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. వ్యాక్సిన్ కోసం రాష్ట్ర నిధులు ఖర్చు పెట్టకుండా కేంద్రం అనుమతులు లేవంటూ ప్రజల ప్రాణాలను పణంగా పెట్టడం ఎంతమాత్రం సబబు కాదన్నారు. ప్రభుత్వ సహకారం లేనిదే కరోనా నియంత్రణ సాధ్యం కాదని తెలిపారు. సమాజ శ్రేయస్సు కోసం ప్రతి ఒక్కరూ తమ గళం గట్టిగా వినిపించి ప్రభుత్వాన్ని మేల్కొల్పాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
కరోనా వైరస్ రెండో దశ 20ఏళ్లు పైబడిన వారిపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మూడో దశలో చిన్నారులపైనా తీవ్ర ప్రభావం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నందున అంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముందుగానే సమగ్ర ప్రణాళికలు చేపడితే భవిష్యత్తు ప్రమాదాలను నివారించగలమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.