పుట్ట మ‌ధు ఎక్కడ? ఈట‌ల కేసుతో లింకుందా?  

మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌. పెద్ద‌ప‌ల్లి జిల్లా ప‌రిష‌త్ ఛైర్మ‌న్ పుట్ట మ‌ధు. ఇద్దరు వేరు వేరు జిల్లాల‌ నేత‌లు. కానీ తాజా ఈట‌ల ఎపిసోడ్‌లో పుట్ట మ‌ధు పేరు సైతం తెర‌పైకి వ‌స్తోంది. మాజీ మంత్రి ఈట‌ల‌పై భూక‌బ్జా కేసు ఫైల్ కాగానే.. పుట్ట మ‌ధు ఎస్కేప్‌. అప్ప‌టి నుంచీ ఇప్ప‌టి వ‌ర‌కూ ఆయ‌న అజ్ఞాతంలో ఉన్నారు. ఫోన్లు స్విచ్ఛాఫ్‌. ఫ్యామిలీకీ కాంటాక్ట్‌లో లేడు. అస‌లాయ‌న ఎక్క‌డున్నాడో పోలీసులూ స‌రిగ్గా చెప్ప‌లేక‌పోతున్నారు. ఇంత‌కీ, ఈట‌ల వ్య‌వ‌హారంతో పుట్ట మ‌ధుకు ఏం సంబంధం? ఈట‌ల రాజేంద‌ర్‌పై కేసు న‌మోదైన‌ప్ప‌టి నుంచీ పుట్ట మ‌ధు ఎందుకు ప‌రారీలో ఉన్నారు?  వాళ్లిద్ద‌రి మ‌ధ్య మిలాఖ‌త్ ఏంటి?  తెర‌వెనుక జ‌రుగుతున్న రాజ‌కీయ కుట్ర ఏంటి? ఇవే ఇప్పుడు తెలంగాణ రాజ‌కీయాల్లో కాక రేపుతున్నాయి. 

పుట్ట మ‌ధు. కొన్ని నెల‌ల క్రితం న‌డిరోడ్డు మీద జ‌రిగిన‌ లాయ‌ర్ వామ‌న‌రావు దంప‌తుల హ‌త్య‌లో.. పుట్ట మ‌ధు పేరు ప్ర‌ముఖంగా వినిపించింది. పుట్ట మ‌ధు నేర చ‌రిత్ర‌పై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రిగింది. ఈ కేసులో పట్ట మధు మేనల్లుడు కీలక సూత్రదారిగా తేల్చారు పోలీసులు. ఆ త‌ర్వాత అంతా సైలెంట్‌. ఇటీవ‌ల స‌డెన్‌గా ఈట‌లపై భూక‌బ్జా కేసు న‌మోద‌వ‌డం.. మంత్రి ప‌ద‌వి నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేయ‌డం జరిగిపోయాయి. మాజీ మంత్రిపై మ‌రింత ఉచ్చు బిగించేందుకు ఆయ‌న గ‌తాన్ని త‌వ్వి పోస్తున్నారు పోలీసులు. ఈ విష‌యం తెలిసి పుట్ట మ‌ధు ఉలిక్కిప‌డ్డాడని అంటున్నారు. ఎందుకంటే, ఈట‌ల‌తో ప‌లు వ్య‌వ‌హారాల్లో, దందాల్లో ఆయ‌న‌కూ ప్ర‌ధాన భాగ‌స్వామ్యం ఉంద‌ని అంటున్నారు. ఇప్పుడు ఈట‌ల‌ను ఆ కేసుల్లో ఇరికించాలంటే.. పుట్ట మ‌ధును కార్న‌ర్ చేయాల‌ని ప్ర‌భుత్వం భావిస్తోంద‌ని తెలుస్తోంది. ఈ విష‌యం ప‌సిగ‌ట్టిన మ‌ధు.. రాత్రికి రాత్రే  ప‌త్తా లేకుండా పోయారనే చర్చ జరుగుతోంది.     

మ‌ధు ఎక్క‌డు ఉన్నాడ‌నేది ఇప్పుడు మిస్ట‌రీగా మారింది. హైద‌రాబాద్ వెళ్తున్నానంటూ మంథ‌ని నుంచి బ‌య‌లుదేరిన మ‌ధు.. న‌గ‌రానికి చేరుకోలేద‌ని తెలుస్తోంది. మంథ‌ని నుంచి నేరుగా మ‌హారాష్ట్ర‌కు వెళ్లిన‌ట్టు స‌మాచారం. ఆయన సెల్ ఫోన్ సిగ్నిల్ చివరగా మహారాష్ట్రలోని సెల్ టవర్ క్యాచ్ చేసినట్లు పోలీసుల విచార‌ణ‌లో తేలింది. అక్కడి నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చారనే ప్రచారమూ జ‌రుగుతోంది. మంత్రులు కొప్పుల ఈశ్వ‌ర్‌, వేముల ప్ర‌శాంత్‌ల స‌హాయంతో సీఎం కేసీఆర్‌తో మాట్లాడి వివ‌ర‌ణ ఇచ్చుకునేందుకు.. త‌న కుటుంబ స‌భ్యుల ద్వారా పుట్ట మ‌ధు ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఈట‌ల‌తో ఇన్నేళ్లూ స్నేహం చేసిన మాట వాస్త‌వ‌మే అయినా.. ప్ర‌స్తుతం ఇక ఆయ‌న‌తో ఎలాంటి సంబంధాలు పెట్టుకోబోనంటూ సీఎం ముందు స‌రెండ‌ర్ అయ్యేందుకు మ‌ధు ట్రై చేస్తున్నార‌ని అంటున్నారు. 

అయితే, పుట్ట మ‌ధు.. సీఎం కేసీఆర్‌ను క‌లిసేందుకు అపాయింట్‌మెంట్ కోసం తెగ ప్ర‌య‌త్నిస్తున్నా.. దొర‌క‌డం లేద‌ట‌. ఆ లోగా ఏ పోలీసులో త‌న‌ను ఏదో ఓ కేసులో క‌స్ట‌డీకి తీసుకోక‌ముందే.. కేసీఆర్‌ను క‌లిసి కాంప్ర‌మైజ్ కావాల‌ని త‌న గాడ్‌ఫాద‌ర్స్‌తో అన్ని విధాలుగా లాబీయింగ్ చేస్తున్నాడ‌ట‌. ఈట‌ల విష‌యంలో కేసీఆర్ నుంచి అభ‌యం వ‌చ్చే వ‌ర‌కూ..  అజ్ఞాతం వీడేది లేదంటున్నాడ‌ట పుట్ట మ‌ధు. మాజీ మంత్రి ఈట‌ల డొంక క‌దిలించ‌డానికి.. పుట్ట మ‌ధు తీగ‌ను లాగుతుండ‌టం.. తెలంగాణ రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశ‌మైంది.