నోరు జారిన నేరానికి...!
posted on Mar 17, 2025 11:37AM

కాలు జారితే, వెనక్కి తీసుకోవచ్చును, కానీ, నోరు జారితే వెనక్కి తీసుకోలేము. ఒక్కొక్క సారి, నోరు జారిన నేరానికి, భారీ మూల్యమే చెల్లించుకోవలసివస్తుంది, ఉత్తరాఖండ్’ ఆర్ధిక, శాసనసభ వ్యవహారాల మంత్రి, ప్రేమ్ చంద్ అగ్రవాల్ విషయంలో అదే జరగింది. అవును. రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో,ఆయన,రాష్ట్రమంటే కేవలం’ పహాడీలు’ (గిరిజనులు) మాత్రమే కాదు,అంటూ గిరిజనుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఘాటైన వ్యాఖ్యలు చేశారు చిక్కుల్లో ఇరుక్కున్నారు. ఆతర్వాత ఆయన, మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాగా చాలా చాలా వివరణ ఇచ్చుకున్నారు. అయినా కొంచెం ఆలస్యంగానే అయినా, రాజీనామా చేయక తప్పలేదు. ఆదివారం (మార్చి 16) ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు.
ఇలా తెలిసీ, తెలియకో, కొండకచో నోటి తీటతో నోరు జారి, చిక్కుల్లో చిక్కుకున్న పెద్దలు, చిన్నలు చాలామందే ఉన్నారు. ఆ మధ్యన శ్యాం పిట్రోడా అనే కాంగ్రెస్ పెద్దాయన, లోక్ సభ ఎన్నికల ప్రచారం జోరు మీదున్న సమయంలో, చేసిన జాతి వివక్ష వ్యాఖ్యలు కాంగ్రెస్ నాయకత్వాన్ని ఇరకాటంలోకి నెట్టేశాయి. శ్యాం పిట్రోడా ఏ ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేశారో ఏమో కానీ.. దేశం తూర్పున ఉన్న ప్రజలు చైనీయుల్లా, పశ్చిమ వాసులు అరబ్బుల్లా, ఉత్తరాది వారు శ్వేత జాతీయులుగా, చివరగా దక్షిణాది ప్రజలు అఫ్రికన్స్’లా ఉంటారని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. అప్పటికే వారసత్వ సంపద గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అందుకు ఆయన మూల్యం చెల్లించారు. ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది. ఎన్నికల క్రతువు ముగిసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆయన్ని మళ్ళీ అదే పదవిలో కుర్చోపెట్టిందనుకోండి అది వేరే విషయం.
అలాగే, 2019 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి కాయిన్’ చేసిన చోకీదార్ చోర్ నినాదం ఆయన్ను రాజకీయంగానే కాదు, చట్టపరంగానూ చిక్కుల్లోకి నెట్టింది. రాహుల్ గాంధీ ప్రధాని మోదీని దేశం ముందు దొంగగా చూపించేందుకు తమ ఆరోపణను, అభిప్రయాన్ని కోర్టుకు అపాందించారు. కోర్టు చేయని వ్యాఖ్యలను చేసినట్లు ప్రచారం సాగించారు. న్యాయస్థానం ఆగ్రహానికి గురయ్యారు. ఒకసారి కాదు రెండు సార్లు సుప్రీం కోర్టుకు క్షమాపణలు చెప్పారు. రాహుల్ గాంధీ ఇలా నోరు జారిన నేరానికి, ఆయన చెల్లించిన మూల్యం గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వరసగా రెండవసారి రెండు అంకెలకు పరిమితం అయింది. పార్టీ ఓటమికి నైతిక బాద్యత వహిస్తూ, రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.
ఇలా ఒకరిద్దరు కాదు, నోటి తీటా రాజకీయ నేతల చిట్టా చాలా వుంది. ఎక్కడి దాకానో ఎందుకు, మొన్నటి 2024 ఎన్నికలకు ముందు బీజేపీ అధ్యక్షుడు, జేపీ నడ్డా బీజేపీ మాతృ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్,(ఆర్ఎస్ఎస్) అవసరం తమకు లేదంటూ చేసిన వ్యాఖ్యలు, ఎన్నికల ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపాయో, చెప్ప నక్కర లేదు. సరే ఆ తర్వాత బీజేపీ దిద్దుబాటు చర్యలు తీసుకుని,ఇటీవల జరిగిన, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ సహా మూడు రాష్ట్రాల్లో విజయం సాధించింది. అలాగే, హర్యానా, గుజరాత్ సహా ఐదారు రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో క్లీన్ స్వీప్ చేసింది.
అలాగే కేంద్ర హోం మంత్రి అమిత షా రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్’ గురించి రాజస్య సభలోచేసిన వివాదస్పద వ్యాఖ్యలు ఎంత దుమారాన్ని రేపాయో చెప్పనవసరం లేదు. రాజ్యాంగ వజ్రోత్సవాలను పురస్కరించుకుని రాజ్య సభలో చేపట్టిన ప్రత్యేక చర్చకు సమాధానం ఇస్తూ అమిత్ షా ప్రతిపక్ష పార్టీలను ఉద్దేశించి, అంబేద్కర్, అంబేద్కర అనడం వాళ్ళకు ఒక ఫాషన్ అయి పోయింది. అంబేద్కర్ పేరు ఉచ్చరించినన్ని సార్లు భగవత్ నామ స్మరణ చేస్తే కనీసం ఏడు జన్మల పాటు స్వర్గమైనా దక్కేది అంటూ చేసిన వ్యాఖ్యలు, పార్లమెంట్ లోపలా వెలుపలా ప్రకంపనలు సృష్టించాయి. ఎంతో దుమారాన్ని రేపాయి. విపక్షాలు హోం మంత్రి రాజీనామాకు డిమాండ్ చేశాయి. ఆయన్ని బర్తరఫ్ చేయాలని పట్టు పట్టాయి. పార్లమెంట్ ప్రాంగణంలో ఇంతవరకు ఎప్పుడూ చూడని నిరంతర నిరసన ప్రదర్శనలు, తోపులాటలు, తొక్కిసలాటలు, గౌరవ ఎంపీలు గాయాలతో ఆసుపత్రుల పాలుగావడం వంటి తతంగం చాలా చాలా జరిగింది. ఇంచుమించుగా వారం రోజులకు పైగానే, పార్లమెంట్ సమావేశాలు, ఆ దుమారంలో కొట్టుకు పోయాయి. అమిత షా రాజీనామా చేయలేదు, ప్రధానమంత్రి ఆయనని బర్త్ రఫ్ చేయలేదు కానీ రాజ్యాంగ వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించి క్రెడిట్ కొట్టాయాలని చూసిన బీజేపీ లక్ష్యం మాత్రం నెరవేర లేదు. పార్టీ ఇమేజ్ పక్కకు వాలింది. దేశీయంగానే కాదు అంతర్జాతీయంగానూ భారత ప్రజాస్వామ్య వ్యవస్థ బోనులో నిలబడింది. ఇక మన దగ్గరకు వస్తే, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నేతల దురుసు తనానికి హద్దులే లేవు. అది రుజువైన వాస్తవం. ఆంధ్ర ప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళ పాలనలో ముఖ్యమంత్రి సహా మంత్రులు, భాష విషయంలో ఎంతగా దిగ జారారో,ఎంతగా నోటిని పారేసుకున్నారో, ఎన్నెన్ని బూతు నిఘంటువులు సృష్టించారో వేరే చెప్ప నక్కరలేదు. అలాగే అందుకు వైసీపీ చెల్లించిన మూల్యం గురించి కూడా చెప్ప నవసరం లేదు.
ఇక ఇప్పడుతాజాగ , ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నేతలు నోరు జారి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నే రేపుతున్నాయి. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్’ గురించి చేసిన, స్టేచర్ - స్ట్రెచర్ - మార్చురీ వ్యాఖ్యలు.. దానికి అనుబంధంగా ఇచ్చిన వివరణ, కొనసాగింపుగా సోషల్ మీడియా విశృంఘలత్వం పై విరుచుకు పడుతూ, బట్టలు ఊడదీసి... అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఈ నేపధ్యంలో గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇతర బీఆర్ఎస్ నాయకులు, నోరు జారిన రోత మాటలు,మళ్ళీ మళ్ళీ తెర మీదకు వస్తున్నాయి.
దీంతో ఇప్పటికే ఓ వంక అంతర్గత రాజకీయ సంక్షోభం, మరో వంక ఆర్థిక సంక్షోభంతో పీకల లోతు కష్టాల్లో కూరుకుపోయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరిన్ని కష్టాలను ఎదుర్కొంటోంది. ఈ రోజు కాక పోయినా రేపు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్లస్ అండ్ మైనస్ లెక్కల బాలన్స్ షీట్ స్క్రూటినీకి వచ్చినప్పడు, ఆయన ఖాయంగా మూల్యం చెల్లించవలసి రావచ్చును.
అలాగే ఆంధ్ర అప్రదేశ్ లోనూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జన సేన అధినేత పవన్ కళ్యాణ్’, ఆయన సోదరుడు ఎమ్మెల్సీ నాగ బాబు పిఠాపురం వేదికగా జరిగిన జనసేన ఆవిర్భావ సభలో చేసిన వివాదస్పద వ్యాఖ్యలు కూటమిలో కుంపట్లు పెట్టాయి. అనుభవ రాహిత్యంతో పాటు అజ్ఞానం తోడైన అహంకారంతో అన్నదమ్ములు చేసిన వ్యాఖ్యలు కూటమిలో కుంపట్లు రాజేసాయి. ఇంతవరకు సజావుగా సాగుతున్న కుటుంబంలో చిచ్చు పెట్టాయి. సినిమాల్లో డూప్ లు చేసిన ఫైట్లు చూసి హీరోలే ఫైట్ చేశారని అభిమానులు ఈలలు వేస్తారు. చప్పట్లు కొడతారు. హీరోలకు తాము జీరోలమని తెలుసు. అయినా విజయోత్సవ వేడుకల్లో వేదికలు ఎక్కి చేతులు ఊపుతారు. సక్సెస్ సొంతం చేసుకుంటారు. అలా తమను తాము మోసం చేసుకుంటూ, అభిమానులను మోసం చేస్తారు. రాజకీయాల్లోనూ అదే హీరోయిజం’ చుపిస్తామంటే కుదరదు.
కానీ కొణిదెల సోదరులు పిఠాపురంలో కూటమి గెలుపును తమ ఖాతాలో వేసుకుని హీరో ఫోజులు ఇచ్చే విఫల ప్రయత్నం చేశారు. బండి కింద నడిచి వెళ్లే కుక్క పిల్ల బండి భారం మొత్తం తానే మోస్తున్నానని ఫీల్ అవుతుందంటే అర్థం చేసుకోవచ్చును, కానీ వారనే కాదు, రాజకీయ నాయకులు ఎవరైనా అదే ఫీలింగ్ లో ఉంటే, ఆ వైభోగం అట్టే కాలం నిలవదు. సంకీర్ణ రాజకీయాల్లో చేయి చేయి కలిస్తేనే చప్పట్లు... లేదంటే చిత్కారాలు చీవాట్లు తప్పవు. అందుకే, నోటి తీట పొట్టకు చేటని అంటారు.