సెల్ఫీ తీసుకున్నందుకు మూడురోజుల జైలు…
posted on Feb 5, 2016 8:53AM
.jpg)
సెల్ఫీ కోసం ఏమైనా చేస్తాం అంటారు కొంతమంది కుర్రాళ్లు. అదే ఊపులో ఎలాంటి ప్రమాదాన్నైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్ నగరంలో ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది. ఫరాజ్ అహ్మద్ అనే 18 ఏళ్ల కుర్రవాడు సాక్షాత్తూ జిల్లా మెజిస్ట్రేటుతోనే సెల్పీ దిగాలనుకున్నాడు. ఏదో పని మీద చుట్టాలతో కలిసి ఆమె కార్యాలయానికి చేరుకున్న అహ్మద్, మంచి సెల్ఫీని దిగేందుకు ఆమె దగ్గర దగ్గరే తచ్చాడటం మొదలుపెట్టాడు. జిల్లా మెజిస్ట్రేట్ అయిన చంద్రకళ ఎంతగా వారించేందుకు ప్రయత్నించినా అహ్మద్ ఊరుకోలేదు సరికదా ఇంకో సెల్ఫీ మరో సెల్పీ అంటూ పదే పదే తన ప్రయత్నాన్ని కొనసాగించాడు. చంద్రకళ చుట్టూ ఉన్న అధికారులు అతన్ని ఆపేందుకు, అప్పటివరకూ ఉన్న ఫొటోలను డిలీట్ చేసేందుకు ఎంతగా ప్రయత్నించినా అహ్మద్ ఊరుకోలేదు. దాంతో చిర్రెత్తుకు వచ్చిన జిల్లా మెజిస్ట్రేట్ అతనికి మూడు రోజుల జైలు శిక్షను విధించారు. ఒక జిల్లా మెజిస్ట్రేట్‌తో, పైగా ఒక స్త్రీతో అసభ్యంగా ప్రవర్తించినందుకు అతనికి ఈ శిక్ష విధిస్తున్నట్లు చెప్పారు చంద్రకళ.