భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చే అంశంపై ముమ్మర ప్రయత్నాలు

* కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ.

కరోనా వైరస్ వల్ల తాత్కాలికంగా ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పటీకీ.  ప్రజారోగ్య పరిరక్షణలో ఎంతమాత్రం రాజీపడొద్దని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టం చేశారు. కరోనా వైరస్ పై శనివారం ఆయన ఢిల్లీ నుండి వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా రాజీవ్ గౌబ మాట్లాడుతూ గత నెలరోజులకు పైగా లాక్ డౌన్ ను కట్టుదిట్టంగా అమలు చేస్తూ కరోనా వైరస్ నియంత్రణకు విశేష కృషి చేస్తున్నందుకు అన్ని రాష్ట్రాలను ప్రత్యేకంగా అభినందించారు.లాక్ డౌన్ తో కరోనా నివారణలో గణనీయమైన మార్పులు కనిపిస్తున్నాయని మే3 వరకూ ఈ పరిస్థితి ఇలాగే కోనసాగించాలని కోరారు.

అయితే లాక్ డౌన్ వల్ల ఎదురయ్యే సమస్యలను పూర్తిగా పరిగణనలోకి తీసుకుని ఈనెల 20 గ్రామీణ ప్రాంతాల్లో చాలా వరుకూ లాక్ డౌన్ నుండి మినహాయింపులు ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు.ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ, ఉపాధి హామీ పనులు పూర్తిగా జరిగేలా చర్యలు చేపట్టడం జరిగిందని అన్నారు.అలాగే గ్రామీణ ప్రాంత గ్రీన్ జోన్ల పరిథిలోని పరిశ్రమలు,తయారీ యూనిట్లు, ఎస్ఇజడ్లు, ఎక్స్ పోర్ట్ జోన్లు వంటివి పనిచేసేలా వాటిలో పనిచేసే కార్మికులు భౌతిక దూరం పాటిస్తూ పనులు చేసుకునేలా చూడాలని అన్నారు.అంతేగాక నిత్యావసర, నిత్యావసరేతర సరుకు అంతరాష్ట్ర రవాణాకు కూడా పూర్తిగా అనుమతించామని చెప్పారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో చిన్న చిన్న దుకాణాలన్నీ యధావిధిగా నిర్వహించుకునేందుకు వీలు కల్పించడం జరిగిందన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లోని గ్రీన్ జోన్ లలో పెద్ద ఎత్తున ఆర్థిక కార్యకలాపాలను కొనసాగించేందుకు అవకాశం కల్పించడం ద్వారా లాక్ డౌన్ కష్టాల నుండి గ్రామీణులకు కొంత ఉపశమనం కలిగించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ కోరారు.

అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న వలసకూలీలకు తగిన సౌకర్యాలు కల్పించి ఆదుకోవడమేగాక కేంద్ర హోంశాఖ ఆదేశాలకు లోబడి సంబంధిత రాష్ట్రాలతో మాట్లాడి వారిని స్వంత రాష్ట్రాలకు ఏవిధంగా చేర్చాలో పరస్పరం చర్చించి సాధ్యాసాధ్యాలను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని సూచించారు.అదే విధంగా విదేశాలలో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చే అంశంపై కేంద్ర ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తోందని పేర్కొన్నారు.ఏమైనప్పటికీ మే 3 వరకూ లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేసేందుకు రాష్ట్రాలు తగిన చర్యలు తీసుకోవాలని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ కోరారు.

ఈ వీడియో సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని మాట్లాడుతూ లాక్ డౌన్ తో  ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వంపై పూర్తి నమ్మకంతో ఉన్నారని కావున వారి ఇబ్బందులను అధిగమించేలా చూడాల్సిన అవసరం ఉంది అన్నారు.ప్రస్తుతం గ్రీన్ జోన్ ప్రాంతాలైన గ్రామాల్లో ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభం అయ్యాయని చెప్పారు.దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లు మూసి ఉన్నందున తగిన ఎగుమతులకు అవకాశం లేక ఉద్యానవన, ఆక్వా తదితర రైతులు ఇబ్బంది పడుతున్నారని సిఎస్ నీలం సాహ్ని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ దృష్టికి తెచ్చారు.