సోషల్ మీడియా ని దుర్వినియోగం చేస్తే, దండన తప్పదు
posted on Apr 25, 2020 8:36PM
లాక్‌డౌన్‌లో విధులు నిర్వర్తిస్తూ కరోనా తో మృతి చెందిన పరిగి ఏఎస్ఐ కుటుంబానికి 50 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఏపీ డీజీపీ గౌతమ్‌సవాంగ్ కృతజ్ఞతలు తెలిపారు. శనివారం విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ బాధిత కుటుంబానికి చెక్ అందజేసినట్లు చెప్పారు. దేశంలోనే యాభై లక్షల పరిహారం ప్రకటించిన ఘనత జగన్ ప్రభుత్వానిదే అని గౌతమ్‌సవాంగ్ కొనియాడారు.
దేశంలోనే అత్యధిక మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న ఘనత ఏపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. కరోనాపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలు తగవని హితవు పలికారు. వ్యవసాయ కార్యకలాపాలు, పరిశ్రమలకు అనుమతిచ్చినట్లు తెలిపారు. అన్ని శాఖలతో పోలీసుల వారు సమన్వయం చేసుకుంటున్నారని, పోలీసులకి పీపీఈ కిట్లకోసం 2.89 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. ఇక ఏపీకి విదేశాల నుంచి 28000 మంది, ఢిల్లీ జమాత్ నుంచి 1185 మంది వచ్చారని తెలిపారు. వారందరిని క్వారంటైన్‌లో ఉంచినట్లు చెప్పారు.