కేంద్ర సహాయం కోరేందుకు బేషజాలెందుకు

 

 

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ డిల్లీ పర్యటన విజయవంతమయిందని తెరాస నేతలతో సహా అందరూ సంతృప్తి వ్యక్తం చేసారు. అంటే మోడీ ప్రభుత్వం కేసీఆర్ అభ్యర్ధనలకు సానుకూలంగా స్పందించినట్లు వారు కూడా ద్రువీకరించినట్లేననుకోవచ్చును. ఇంతకాలంగా వివిద అంశాలపై తెలంగాణా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ వైఖరి అవలంభిస్తూ దానిని కలిసేందుకు విముఖత ప్రదర్శిస్తూ వచ్చింది. దానిని తెలంగాణా ప్రభుత్వం సమర్ధించుకోవచ్చును. కానీ ఆ తరువాత అవే అంశాలపై తెలంగాణా ప్రభుత్వం పట్టువిడుపులు ప్రదర్శించినందునే కేంద్రం కూడా సానుకూలంగా స్పందించిందని భావించవచ్చును. అదేవిధంగా గవర్నరు చొరవతో కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో కూడా సమావేశమయిన తరువాత నుండే రెండు రాష్ట్రాల మధ్య కొంత సహృద్భావ వాతావరణం ఏర్పడిన సంగతి అందరికీ స్పష్టంగా కనబడుతూనే ఉంది.

 

ప్రధానితో సహా కేంద్ర మంత్రులు కేసీఆర్ బృందానికి ఇచ్చిన హామీల గురించి ఇప్పటికే పత్రికలలో, న్యూస్ చానళ్ళలో వార్తలు వచ్చాయి గనుక మళ్ళీ దానిపై ఇప్పుడు వాటిని ఇక్కడ సమీక్షించనవసరం లేదు కనుక కేసీఆర్ డిల్లీ పర్యటన గురించి మాత్రమే చెప్పుకొంటే సరిపోతుంది.

 

“కేసీఆర్ ఈ పని మొదటే చేసి ఉంటే బాగుండేదని, కనీసం ఇప్పుడయినా డిల్లీ వెళ్ళి మంచి పనిచేసారని, ఆయన అభ్యర్ధనలకు కేంద్రం సానుకూలంగా స్పందించడం బట్టి కేంద్రం తెలంగాణా ప్రభుత్వం పట్ల ఎటువంటి వివక్ష చూపడం లేదని స్పష్టమయిందని” తెలంగాణా బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆలోచింపదగ్గవే. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ విధానాలు, ప్రాధాన్యతలు, సమస్యలు, ఒత్తిళ్ళు దానివి దానికి ఉంటాయి. అందువలన రాష్ట్ర ప్రభుత్వాల అధినేతలో కనీసం వారి ప్రతినిధులో కేంద్రాన్ని తరచూ కలుస్తూ తమ రాష్ట్రాలకు రావలసినవి రాబట్టుకోక తప్పదు. చంద్రబాబు నాయుడు ఆపని ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చెప్పట్టక ముందు నుండే చేస్తున్నారు. అయినప్పటికీ కేంద్రం ఏవో కొన్ని విద్యుత్ కేటాయింపులు వంటివి తప్ప ఇంతవరకు రాష్ట్రానికి పెద్దగా ఇచ్చిందేమీ కనబడటం లేదు. అందుకే ఆయన తరచూ డిల్లీ పర్యటనలు చేస్తూ కేంద్రం సహాయం కోసం నిరంతరం ఒత్తిడి చేస్తున్నారు.

 

“కేసీఆర్ ఇంతవరకు తమ సహాయం కోరలేదని, కోరి ఉంటే కేంద్రం తప్పక సహాయం చేసేందుకు సిద్దంగా ఉందని” కేంద్ర విద్యుత్ మంత్రి పీయూష్ గోయల్ కొద్ది రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు ‘అడగందే అమ్మయినా అన్నం పెట్టదనే’ నానుడిని జ్ఞప్తికి తెచ్చేవిగా ఉన్నాయి. ఇప్పుడు కేసీఆర్ కేంద్రాన్ని నోరు తెరిచి అడిగారు కనుక కేంద్రం కూడా అనేక హామీలు ఇచ్చింది. అయితే ఆ హామీలు కార్యరూపం దాల్చాలంటే కేసీఆర్ బృందం బహుశః మరికొన్నిసార్లు డిల్లీ పర్యటించవలసి ఉంటుందేమో.

 

గతంలో యూపీయే ప్రభుత్వం ఏనాడు కూడా తమ స్వంత పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల పట్ల కూడా ఇంత సానుకూలంగా స్పందించిన దాఖలాలు లేవు. ఎందువలన అప్పుడు కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కర్ర పెత్తనం చేస్తుండేవారు. అందువలన అప్పటి ముఖ్యమంత్రులందరూ ప్రధానిని కలవకుండా సోనియా ప్రాపకం కోసం ఆమె ఇంటి చుట్టూ ప్రదక్షిణాలు చేసేవారు. వారి పర్యటనలు, అధినేత్రితో చర్చలు తమ స్వంత, తమ పార్టీ రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికే ప్రధానంగా పరిమితమయ్యేవి కనుక రాష్ట్రాల, రాష్ట్ర ప్రభుత్వాల పరిస్థితి కూడా ‘ఎక్కడి గొంగళి అక్కడే’ అన్నట్లుండేది.

 

కానీ మోడీ ప్రభుత్వం అందుకు పూర్తి భిన్నంగా దేశంలో అన్ని రాష్ట్రాలు సమానంగా అబివృద్ధి చెందాలనే తన విధానానికి అనుగుణంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సహాయపడేందుకు సంసిద్దత వ్యక్తం చేస్తోంది. కనుక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని చెప్పక తప్పదు. కనుక రాష్ట్రాభివృద్ధి కోరుకొనే ముఖ్యమంత్రులు తమ అహాన్ని, బేషజాలను, రాజకీయ వైరాలను, తమ వ్యతిరేకతను అన్నిటినీ పక్కన పెట్టి, డిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూ రాష్ట్రానికి రావలసినవన్నీ రాబట్టుకోక తప్పదు.