భూమనపై చర్యలకు టీటీడీ సమాయత్తం.. అసత్య ఆరోపణలపై ఎస్పీకి ఫిర్యాదు

మాజీ ఎమ్మెల్యే, టీటీడీ మాజీ చైర్మన్  భూమన కరుణాకరరెడ్డిపై చర్యలు తీసుకునేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం రెడీ అయ్యింది,  ఈ మేరకు ఆయనపై టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి ఎస్పీ  ఎస్పీ హర్షవర్ధనరావుకు ఫిర్యాదు చేశారు. గోశాలను గోవధశాలగా మార్చారంటూ భూమన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.   నిరాధార ఆరోపణలు చేసిన కరుణాకరరెడ్డిపై కేసు నమోదు చేయాలని కోరారు.  ఎస్వీ గోశాలలో 100గోవులు మరణించాయని కరుణాకరరెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. భూమన ఆరోపణలను టీటీడీ ఖండించింది. కాగా భూమనపై ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన భాను ప్రకాష్ రెడ్డి గతంలో వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలను ఆధారాలతో సహా బయటపెట్టామనీ, ఇప్పుడు మాత్రం భూమన అసత్య అబద్ధపు ప్రచారం చేస్తున్నారనీ విమర్శలు గుప్పించారు.

నోరు ఉంది కదా అని ఇష్టారీతిగా మాట్లాడారని దుయ్యబట్టారు. నిరాధార ఆరోపణలు చేసిన భూమనపై ఐటీ యాక్ట్ 74, బీఎన్ఎస్ చట్టం 356 కింద కేసు నమోదు చేయాలని తన ఫిర్యాదులో కోరినట్లు చెప్పారు. టీటీడీ చైర్మన్ గా భూమన ఉన్న సమయంలో పెద్ద సంఖ్యలో గోవులు చనిపోయాననీ, ఆయన హయాంలో ఎస్వీగోశాల గోవులకు పురుగులు పట్టిన ఆహారాన్ని పెట్టారనీ, లాలూ ప్రసాద్ యాదవ్  మాదిరిగా పశువుల దాణలో కోటి రూపాయల అవినీతికి భూమన పాల్పడ్డారని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. గోవిందుడు, గోవులతో ఆటలొద్దని వైసీపీ నేతలను హెచ్చరిస్తున్నానని భాను ప్రకాశ్ రెడ్డి అన్నారు. వైసీపీ హయాంలో టీటీడీలో జరిగిన అన్ని అక్రమాలపైనా చర్యలు తీసుకుంటామని చెప్పిన భాను ప్రకాశ్ రెడ్డి, భూమన మాత్రమే కాదు తానూ లోకలేనన్నారు.  టిటిడి పై ఎలాంటి ఆధారాల లేకుండా అసత్య ప్రచారాలు చేస్తే  ఏ స్దాయి వ్యక్తి అయినా కఠినమైన చర్యలు తీసుకుంటాం‌మని హెచ్చరించారు.