ఏక్ దిన్ కా సెలబ్రిటీ.. దో దిన్ మే దివాళా

కుమారి ఆంటీ నుంచి అఘోరీ మాత వ‌ర‌కూ
రాత్రికి రాత్రి ఫేమ‌స్.. త‌ర్వాత అంతా తుస్

గ‌తంలో ప్ర‌ముఖులు అంటే వారికంటూ ఒక సుదీర్ఘ కాల అనుభ‌వం ఫ‌లానా రంగంలో ఉండేది. వారు వ్యాపారంలోగానీ, క్రీడ‌లు, క‌ళ‌ల్లో విశేషంగా రాణించ‌డం వ‌ల్ల వారికా పేరు ప్ర‌ఖ్యాతులు వ‌చ్చేవి. ప‌ది మందికీ ఆద‌ర్శ‌వంత‌గా మారేవారు. ప‌దికాలాల పాటు వారి వ్యాపార వ్య‌వ‌హారాలు మ‌రింత సుర‌క్షితంగా సుభిక్షంగా న‌డిచేవి. 

అదే ఇప్పుడు ఆ స్టాండర్డ్స్ అంటూ ఏవీ లేవు. ఎవ‌రైతే వాళ్లు.. ఎలా ప‌డితే అలా.. ఫేమ‌స్ అయిపోతున్నారు. ఎందుకు ఫేమ‌స్ అవుతారో.. ఎందుకు వైర‌ల్ అవుతారో.. ఒక లెక్కా ప‌త్రం ఉండ‌టం లేదు. మ‌రీ ముఖ్యంగా సోష‌ల్ మీడియా జ‌మానా వ‌చ్చేస‌రికి.. స‌డెన్ స్టార్ లా రాత్రికి రాత్రి వైర‌ల్ అవుతారు. అదంతా నిజ‌మ‌ని న‌మ్మే లోపు.. అథఃపాతాళానికి ప‌డిపోతుంటారు. 

దీన్ని ఏమ‌నాలి? ఇలా ఎందుకు జ‌రుగుతోంది? కారణాలు ఏమై ఉంటాయ‌ని చూస్తే.. మీకు మాస్ మీడియంలో ఫ‌స్ట్ ప్లేస్ లో నిలిచేది పేప‌ర్. వార్తా ప‌త్రిక‌. వార్తా  ప‌త్రిక‌లో అన్ని వార్త‌ల‌కూ ఒక చోటు ఉంటుంది. కాకుంటే వెన‌కా ముందు.

అదే ఎలెక్ట్రానిక్ మీడియా వ‌చ్చాక.. వార్త వాల్యూ అన్న‌ది తారు మారు అవుతూ వ‌చ్చింది.  విజువ‌ల్ బాగుంటే అది అంత ప్రాధాన్య‌త లేనిదైనా కూడా దానికంటూ టీవీ న్యూస్ లో ఒక చోటు ప్ర‌ధానంగా ల‌భించేది. ఎంద‌రికో సంబంధించిన విషయాల్లో ఎన్నో వార్త‌లు వ‌స్తుంటాయి. కానీ చూడ్డానికి ఇంపుగా ఉండేవారి వార్త‌లు మాత్రం ప‌దే ప‌దే ప్లే చేస్తుంటారు. దీంతో వారికి అంత విలువ లేక పోయినా.. వారికున్న విజువ‌ల్ బ్యూటీ అన్న ఒక కార‌ణం చేత వారిని ఫేమ‌స్ చేసేది ఎలెక్ట్రానిక్ మీడియా.

ఇక సోష‌ల్ మీడియా జ‌మానా వ‌చ్చేస‌రికి.. దీని డెప్త్ డెన్సిటీ మ‌రింత పెరిగింది. కుమారీ ఆంటీనే తీసుకోండి. రాత్రికి రాత్రి ఆమె ఒక సెల‌బ్రిటీ అయిపోయింది. ఒక స‌మ‌యంలో రోడ్డు మీద ఫుడ్డు బిజినెస్ చేసే ఆమె గురించి సీఎంలు ఆరా తీసేవారంటే ప‌రిస్థితి ఏమిటో ఊహించుకోండి. అంత‌గా ఆమె మోస్ట్ పాపులర్ అయిపోయారు.  ఆమె అమ్మే ఆహారంలో నాణ్య‌త నుంచి, ఆమె వ‌సూలు చేసే ధ‌ర వ‌ర‌కూ అంతా డిస్క‌ష‌నే. అంత‌గా ఆమె పాపుల‌ర్ అయిపోయారు. త‌ర్వాత చూస్తే ఆమె ఏం చేస్తున్నారో తెలీదు. ఇప్పుడు కుమారీ ఆంటీ షాపే క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు. 

బ‌ర్రెల‌క్క సంగ‌తే తీసుకోండి. కొంప‌దీసి.. ఆమెగానీ ఎమ్మెల్యేగా గెలిచిపోతుందా అనుకున్నారు. క‌ట్ చేస్తే బ‌ర్రెల‌క్క‌కు ల‌క్ష‌ల్లో వ‌స్తాయ‌నుకున్న ఓట్లు కాస్తా వేల‌కు మాత్ర‌మే ప‌రిమితం అయ్యాయి. ఆ నియోజ‌వ‌ర్గంలో ఆమె గురించి ఎవరికీ తెలీద‌ట‌. క‌నీసం ప‌క్కింటి వాళ్లు కూడా గుర్తు ప‌ట్ట‌లేరని అంటారు. కానీ.. కొన్నాళ్ల గ్యాప్ లో ప్ర‌పంచ‌మంతా తెలిసిపోయారామె. అప్ప‌ట్లో ఆమెకు చందాలే కొన్ని ల‌క్ష‌ల్లో వ‌చ్చాయ‌ని అంటారు.  ఇపుడామె ఊసేదో.. గోసేదో.. ఎవ‌రికీ తెలీడం లేదు. 

ఇక పూస‌ల‌మ్మే మోనాలిసా. క‌ళ్ల‌లో ఒక ర‌క‌మైన కైపును క‌లిగి ఉన్న ఈమె మొహం కుంభ‌మేళా టైంలో ఒక సంచ‌ల‌నం. ఆమెను   వైర‌ల్ చేయ‌డంతో.. ఆమె మోస్ట్ పాపుల‌ర్ సెల‌బ్రిటీ ఆఫ్ కుంభ‌మేళాగా అవ‌త‌రించారు. జాతీయ స్థాయిలోనే కాదు అంత‌ర్జాతీయ స్థాయిలోనూ పేరొచ్చేసింది. ఈమెతో ఒక సినిమా చేస్తాన‌ని ఒక ద‌ర్శ‌కుడు ముందుకొస్తే అత‌డు కాస్తా ఇప్పుడు జైల్లో ఉన్నాడు. క‌ట్ చేస్తే ఏ సినిమా లేదు. మిగిలిన‌దంతా ఒక సోష‌ల్ మీడియా డ్రామా త‌ప్ప‌!!!

తాగి వాగిన రాకేష్ మాస్ట‌ర్ ని కూడా ఇలాగే ఫేమ‌స్  చేసిందీ సోష‌ల్ మీడియా స‌మాజం. నిజంగానే తాను తాగి వాగితే అంత గొప్ప‌గా ఉంటుందా? అన్న మాయ‌లో ప‌డ్డ రాకేష్ మాస్ట‌ర్ త‌న తాగుడ్ని విప‌రీతంగా పెంచేశాడు.  అప్పుడో ఇప్పుడో తాగాల్సిన వాడు కాస్తా.. తాగ‌డం అన్న‌దొక దిన‌చ‌ర్య‌గా మార్చుకున్నాడు.. ఆయ‌న తాగి వాగే వ్య‌వ‌హారాలు మాంచి కిక్ ఇస్తాయ‌ని తెలిసిన కొంద‌రు.. వెబ్ సీరీస్ ప్లాన్ చేశారు. అక్క‌డ మందు మ‌రింత ఫ్రీగా దొరికే స‌రికి.. పూటుగా తాగి బీర్ బాటిల్ త‌న్నేశాడు. అదేమంటే అత‌డు తాగిన బీరులోనే తేడా ఉంద‌న్న టాకొచ్చింది. ఏమైతేనేం.. అతడొక బీరు బ‌లిగా పేరు సాధించాడు. ఏకంగా ఈ లోకంలోనే లేకుండా పోయాడు.

కిరాక్ ఆర్పీ చెప్పిన‌ట్టు ప‌బ్బుల్లో ఏ చీక‌ట్లో ఏ సెల‌బ్రిటీల ర‌హ‌స్యాలు వింటాడో ఏమో వేణుస్వామి.. అత‌డేదైనా అంటే అది కొన్నాళ్ల‌లో జ‌రిగి కూర్చునేది. ఇత‌డి మాట‌ల మ‌హ‌త్యం ఎక్క‌డి వ‌ర‌కూ వెళ్లిందంటే, ఊళ్ల‌ల్లో అమ్మ‌ల‌క్క‌లు కూడా వేణు స్వామి ఈ సారి మ‌ళ్లీ  ఈ ప్ర‌భుత్వమే వ‌స్తుంద‌ని అన్నాడే.. మ‌రి వ‌చ్చేస్తుందేమో అంటూ వాళ్లు నోళ్లు నొక్కుకుని మాట్లాడుకునే వ‌ర‌కూ వెళ్లింది వ్య‌వ‌హారం. ఎప్పుడైతే ఆయ‌న చెప్పిన జోస్యం ఏపీ ఎన్నిక‌ల  ఫ‌లితాల్లో తేడా కొట్టి బోల్తా ప‌డిందో.. త‌ర్వాత ఈ ఫ్లూటు స్వామి కాస్తా ఫాల్తు స్వామి కింద త‌యార‌య్యాడు. ఇప్పుడాయ‌న చెప్పేవి ఎంత జ‌రిగినా స‌రే అత‌నొక వేస్ట్ ఫెలో కింద ముద్ర ప‌డిపోయారు. 

అలేఖ్య చిట్టీ ప‌చ్చ‌ళ్ల వ్య‌వ‌హార‌మే తీసుకోండి.. ఇదే సోష‌ల్ మీడియా స‌మాజం వారిని అంద‌నంత ఎత్తుల‌కు తీసుకు వెళ్లింది. అక్క‌డ ఒక చిన్న క‌స్ట‌మ‌ర్ తో వారు అసభ్యంగా మాట్లాడిన చిన్న ఆడియో క్లిప్ ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఒక వైర‌ల్. క‌ట్ చేస్తే వారికి సంబంధించిన ఎన్నో బాగోతాలు బ‌ట్ట‌బ‌య‌లు కావ‌డంతో.. ఇప్పుడా ప‌చ్చ‌ళ్ల దందానే లేకుండా పోయింది. ఈ ముగ్గురాడ పిల్ల‌లు రోడ్డున ప‌డ్డ సిట్యువేష‌న్. దానికి తోడు ప్ర‌పంచ మాన‌వ చ‌రిత్ర‌లోనే ఒక మ‌గాడి ఉసురు త‌గిలి ఆడ‌వారు దివాళా తీసార‌న్న టాకు.. బీభ‌త్సంగా సౌండ్ చేస్తోంది. 

అటు ఇటు కాని అఘోరీ వ్య‌వ‌హారం. అనూహ్యంగా సెల‌బ్రిటీ అయ్యాడు శ్రీనివాస్ అనే ఈ తేడా మాయగాడు. అత‌డు దిస మొల‌తో దిగిన వీడియోలు సైతం వైర‌లే. ఆమెగా మారిన అత‌డికి పీరియ‌డ్స్ వ‌స్తాయా రావా? అన్న‌ది కూడా ఒక డిబేట‌బుల్ పాయింటే. ఈ తేడాను న‌మ్మి వ‌ర్షిణీ అనే మంగ‌ళ‌గిరి అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకోవ‌డం. ఇప్పుడ‌దో సెన్సేష‌న్. మెయిన్ స్ట్రీమ్ మీడియాకెక్కి లైవుల్లో ఆమె ప్రేక్ష‌కుల మ‌నోభావాల‌తో చెడుగుడు ఆడేసుకునేంత ప్ర‌యారిటీ సొంతం చేసుకుంది. తీరా ఈ అఘోరీ వ్య‌వ‌హారం కేసులు, అరెస్టులు, ఆంక్ష‌లు.  ఇలా ర‌క‌ర‌కాల బాగోతాలు. ఈ అఘోరీ  మాత ప్ర‌స్తుతం పెళ్లి చేసుకుంది స‌రే, ఆ అమ్మాయితో కాపురం ఎలా సాగుతుంద‌నే కొత్త‌ చ‌ర్చ‌. త‌ర్వాత ఏ పోలీసులొచ్చి.. అరెస్టు చేసి.. ఈ తేడా అఘోరీని ఏ జైల్లో పెడ‌తారో తెలియ‌దు.
    
సోష‌ల్ మీడియా జ‌మానాలో పేరు సాధించ‌డం సో ఈజీ. కానీ త‌ర్వాత సిట్యువేష‌నే టూ బ్యాడ్ టూ వ‌రెస్టుగా త‌యార‌వుతోంది. కుమారి ఆంటీ  నుంచి అలేఖ్చ చిట్టీ వ‌ర‌కూ అంద‌రిదీ ఇదే బాప‌తు. ఇలా ఫేమ‌స్ అవుతున్నారు.. అలా వారి వ్యాపారం, వ్య‌వ‌హార‌మంతా తుస్సు మంటోంది. ఆ టైంలో వారిని ట్రోల్ చేసి ఎంజాయ్ చేస్తున్న నెటిజ‌న్లు కూడా త‌ర్వాత వారి ఊసే ప‌ట్టించుకోవ‌డం మానేస్తున్నారు.