టర్కీ, గ్రీస్ దేశాలలో భారీ భూకంపం.. సునామీ 

టర్కీ, గ్రీస్ దేశాలను నిన్న భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.0గా నమోదైంది. దీనికి తోడు 196 సార్లు స్వల్ప ప్రకంపనలు కూడా నమోదయ్యాయి. ఈ భూకంపం ధాటికి ఏజియన్ సముద్రంలో సునామీ కూడా వచ్చింది. భారీ భూకంపం రావడంతో పశ్చిమ టర్కీలోని ఇజ్మీర్‌లో ప్రజలు రోడ్ల మీదకు పరుగులు పెట్టినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అక్కడ పలు భవనాలు నేలకూలాయి. రహదారులు ధ్వంసమయ్యాయి. విద్యుత్, సమాచార వ్యవస్థ దెబ్బతింది. రాకాసి అలలు తీర ప్రాంతాలను ముంచెత్తాయి. భారీ భూకంపం ధాటికి పెద్ద పెద్ద భవనాలు కూడా కుప్పకూలాయి. భారీ ఎత్తున కూలిన శిథిలాల కింద చాలా మంది చిక్కుకుని ఉన్నట్టు తెలుస్తోంది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు స్థానికులు చేస్తున్న ప్రయత్నాలకు సంబంచించిన వీడియోలను టర్కీ మీడియా ప్రసారం చేసింది. భూకంపం కారణంగా టర్కీ, గ్రీస్ దేశాల్లో ఇప్పటి వరకు 22 మంది చనిపోయారు. 419 మంది గాయపడ్డారు. సామోస్ ద్వీపానికి ఉత్తర, ఈశాన్య ఉత్తరంగా 13 కిలోమీటర్ల దూరంలో ఏజియన్ సముద్రంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు యూరోపియన్‌–మెడిటరేనియన్‌ సిస్మోలాజికల్‌ సెంటర్‌ ప్రకటించింది. భూమికి 10 కిలోమీటర్ల లోతున భూకంపం సంభవించడంతో ప్రకంపనలు మరికొన్ని వారాలపాటు కొనసాగే అవకాశం ఉందని గ్రీస్‌కు చెందిన భూకంప నిపుణుడు ఎకిస్ సెలెంటిస్ పేర్కొన్నారు.