మచిలీపట్నంలో దారుణం.. వైసీపీ నేత కుమారుడి సజీవ దహనం
posted on Oct 30, 2020 10:06PM
కృష్ణాజిల్లా కేంద్రం అయిన మచిలీపట్నం(బందరు)లో ఈరోజు దారుణ ఘటన చోటుచేసుకుంది. వైసీపీ నాయకుడు, మార్కెట్ కమిటీ చైర్మన్ అచ్చాబా కుమారుడు ఖాదర్ బాషా ఇంట్లో ఉన్న సమయంలో అతని ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పు అంటించారు. దీంతో తీవ్రంగా గాయపడిన ఖాదర్ బాషాను మచిలీపట్నం లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయనను హుటాహుటిన విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఖాదర్ బాషా మృతి చెందారు.
అయితే, మార్కెట్ యార్డు చైర్మన్ కుమారుడి మీద హత్యాయత్నం అనగానే అందరు ముందుగా ఇది రాజకీయ ప్రత్యర్థుల పనేనని భావించారు. కానీ, పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణలో అతడి భార్య ఈ పనిచేసినట్టు తెలిసింది. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఖాదర్ బాషాపై అతడి మొదటి భార్య ఇలా పెట్రోల్ పోసి నిప్పంటించినట్టు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఖాదర్ 14 ఏళ్ల క్రితం షేక్ నదియాను వివాహం చేసుకున్నారు. అయితే కొద్ది కాలం క్రితం ఆయన తన భార్య నదియాకు తెలియకుండా ఆమె సొంత చెల్లెల్ని రెండో వివాహం చేసుకున్నాడు. దీంతో రెండో వివాహం విషయంలో నదియా, ఖాదర్ ల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో భార్య నదియా ఈరోజు ఖాదర్ పై పెట్రోల్ పోసి నిప్పంటించిందని భావిస్తున్నారు. అంతేకాకుండా కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ హత్యాయత్నం జరిగినట్లుగా పోలీసులు కూడా భావిస్తున్నారు. దీంతో కుటుంబ సభ్యుల ప్రమేయం మీద పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.