ఎరక్కపోయిన ఇరుక్కుపోయిన వైసీపీ ఎంపీలు
posted on Oct 31, 2020 10:05AM
ఎంపీలను ఖాతరు చేయని ఎమ్మెల్యేలు
ఎంపీలను లెక్కచేయని అధికారులు
బదిలీలలో ఎమ్మెల్యేల సిఫార్సులకే పెద్దపీట
ఆ ముగ్గురు ఎంపీల అవస్థలు వర్ణనాతీతం
పార్లమెంటు సభ్యులంటే దేశ రాజధానిలో బోలెడంత గౌరవం. రాజ్యసభ సభ్యులయితే పెద్దమనుషుల కింద లెక్క. లోక్‌సభ సభ్యులకూ ఎనలేని గౌరవం. కానీ సొంత ఇలాకాలో మాత్రం వారివి సినిమా కష్టాలు. ఎవరూ పట్టించుకోరు. వారి లెటర్లకు విలువే ఉండదు. ఏపీలో పాపం అధికార వైసీపీ ఎంపీల కష్టాలు చూస్తున్న ఆ పార్టీ నేతలు.. పగవాడికి సైతం అలాంటి కష్టాలు రాకూడదని జాలి చూపిస్తున్న దయనీయం వారిది. అన్ని కోట్లు ఖర్చు పెడితే వారికి మిగిలింది.. ముందు, వెనుక పోలీసు వాహనాలు, వాటి సైరన్లేనట!
ఏపీలో వైసీపీ ఎంపీల పరిస్థితి దారుణాతిదారుణంగా మారింది. ఎన్నికల్లో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి, హీనపక్షం 15 కోట్ల చొప్పున ఖర్చు చేసి, ఎమ్మెల్యేల గెలుపులో కీలకపాత్ర పోషించారు. కానీ ఇప్పుడు ఏ ఒక్క ఎమ్మెల్యే, వారిని దరిదాపులకే రానీయని దయనీయం. తమ నియోజవర్గాల్లో ఎంపీలు జోక్యం చేసుకుంటే, అక్కడ కొత్తగా వర్గాలు తయారవుతాయన్నది ఎమ్మెల్యేల భయం. అందుకే ఎంపీలను తమ నియోజకవర్గాల్లో అడుగుపెట్టనీయడం లేదట. దానితో.. తమను ఎన్నికల ముందు, ఏటీఎం మిషన్లుగా వాడుకున్న ఎమ్మెల్యేలు, ఇప్పుడు దూరంగా పెడుతుండటాన్ని ఎంపీలు సహించలేకపోతున్నారు.
ఒకవేళ ఎమ్మెల్యేలకు తెలయకుండా వెళితే, ఇక ఎంపీలకు తిప్పలు తప్పవు. మున్సిపల్ కమిషనర్ల నుంచి సీఐల బదిలీల వరకూ ఎంపీలు చేసే సిఫార్సులను, అటు ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదు. ఎమ్మెల్యేలు లెటర్ ఇచ్చిన వారికే పోస్టింగులిస్తున్న పరిస్థితి. కలెక్టర్ల సంగతి దేవుడెరుగు? మున్సిపల్ కమిషనర్లు, ఆర్డీఓలు, ఎమ్మార్వోలే మాట వినే దిక్కులేదు. ఇప్పుడు ఎంపీల విధులేమిటంటే, ఎమ్మెల్యేల సిఫార్సులు ఆమోదించి, దానికి ఎంపీ లాడ్స్ నిధులు మంజూరు చేయడమే.
గుంటూరు-ప్రకాశం-నెల్లూరు జిల్లాల ఎంపీల పరిస్థితి, మరీ దయనీయంగా ఉందన్న వ్యాఖ్యలు, వైసీపీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. నర్సరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలును, దాదాపు ఎమ్మెల్యేంతా దూరంగా పెడుతున్నారట. ఇటీవల చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే రజనీ టెలిఫోన్ కాల్‌లిస్ట్ వ్యవహారం, పార్టీలో చిచ్చురేపింది. ఆమెతో ఎంపీకి పొసగడం లేదు. తనకు వ్యతిరేకంగా ఎంపీ వర్గాన్ని ప్రోత్సహిస్తున్నారన్నది ఆమె ఆరోపణ. దానితో తనను బాగా ప్రోత్సహించే ఓ సలహాదారు సాయంతో, తనపై నిఘా పెట్టేందుకు సహకరించిన పోలీసు అధికారులను, ఆమె శంకరగిరి మాన్యాలు పట్టించారు. దీనిపై ఇప్పటికీ పార్టీలో చర్చ జరుగుతోంది. ఈ పరిణామాలను ఎంపీ నాయకత్వం దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేదట. దీనితో ఎంపీ వర్గీయులు పార్టీపై అసంతృప్తితో రగిలిపోతున్నారట.
ఇక ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిదీ అదే పరిస్థితి. జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలెవరూ, ఆయనను రానీయడం లేదట. పెత్తనమంతా మంత్రి బాలినేనిదే. గతంలో ఆయన చెలాయించిన హవా, ఇప్పుడు పనిచేయడం మానేసిందంటున్నారు. నిజానికి మాగుంట ఏ పార్టీలో ఉన్నా, అధికారులు ఆయనను గౌరవించేవారు. ఎమ్మెల్యేలు కూడా ఆయన మాటకు విలువ ఇచ్చేవారు. ఏ సీఎంలయినా, ఆయన అడిగిన వెంటనే అపాయింట్‌మెంట్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి, పూర్తిగా రివర్సయిపోయిందంటున్నారు. అటు చూస్తే లిక్కర్ తయారీ ఆదాయం పోయింది. ఇటు చూస్తే సొంత ప్రభుత్వంలోనే గౌరవం లేని పరిస్థితి.
వీరందరినీ మించిన విషాదం.. నెల్లూరు వైసీపీ ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డిది. గత టీడీపీ సర్కారులో.. ఆయన ఆర్ధిక ప్రయోజనాలన్నీ పొందారు. ఆ తర్వాత కండువా మార్చి, వైసీపీ నుంచి ఎంపీగా గెలిచారు. అయినా ఆదాల మాట, ఇప్పుడు వినేవారెవరూ లేరట. ఇప్పుడు తమ ఎమ్మెల్యేలను కాదని, ఏ ఒక్క వైసీపీ నేత కూడా ఆదాల ఇంటిక వెళ్లే ధైర్యం చేయడం లేదట. నిజానికి ఆదాల ఏ ప్రభుత్వంలోన యినా, తన పనులు సులభంగా చేయించుకునేవారు.
వైఎస్ హయాంలో 60 కోట్ల మేరకు, కండలేరు ప్రాజెక్టు పనులు నామినేషన్‌తో దక్కించుకున్నారు. అంతకుముందు దక్కించుకున్న మదనపల్లి పనులను, టీడీపీ వచ్చిన తర్వాత రద్దు చేయించుకుని, అంచనాల విలువ పెంచుకుని, అందులో 182 కోట్లు దక్కించుకున్నారు. అదొక్కటే కాదు. అప్పటికి గతంలో ఉన్న బకాయిలు కూడా, టీడీపీ సర్కారు హయాంలో రాబట్టుకున్నారు.
గత ఎన్నికల ముందు.. సోమశిల హైలెవల్ కెనాల్ ఫేజ్-2 పనులను, ఆదాల కంపెనీ 550 కోట్లకు దక్కించుకుంది. దానిపై అప్పట్లో టీడీపీ సీనియర్లే అభ్యంతరం వ్యక్తం చేసినా, చంద్రబాబు పట్టించుకోలేదు. అంటే టీడీపీ కూడా ఆదాలను ‘బాగా చూసుకున్నద’న్నమాట. సరే.. అయినా, పెండింగ్ నిధులు క్లియరయిన మెసేజ్ వచ్చిన తర్వాత, సైలెంటుగా పార్టీ కండువా మార్చి, వైసీపీలోకి జంపయ్యారనుకోండి. అది వేరే విషయం! అలా ఏ పార్టీ అధికారంలో ఉన్నా, చిటికెలో పనులు చేసుకునే అంతలావు ఆదాల.. ఇప్పుడు సొంత పార్టీలో, సినిమా కష్టాలు అనుభవిస్తున్నారంటే ఆశ్చర్యమే మరి!
గతంలో చంద్రబాబు మంజూరు చేసిన, సోమశిల ఫేజ్-2 ప్రాజెక్టు పనులను సీఎం జగన్ రద్దు చేసి, ఆదాలకు షాక్ ఇచ్చారట! దానిని ఖమ్మం జిల్లాకు చెందిన ఓ టీఆర్‌ఎస్ మాజీ ఎంపీ, కడపకు చెందిన మరో కంపెనీకి కట్టబెట్టారట. పార్టీ మారినా ఫలితం ఉంటుందనుకున్న ఆదాల అంచనా ఆ రకంగా తల్లకిందులయిందట. దీనిపై సీఎం జగనన్నను కలిసేందుకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదట. చివరాఖరకు ఓ సలహాదారు వద్దకు వెళ్లి గోడువినిపించుంటే, ఆయన జగన్ వద్దకు వెళ్లి ఆదాల అవస్థలు వివరించారట.
అయితే.. జగన్ మాత్రం.. ‘చంద్రబాబు ఆ ప్రాజెక్టు ఇచ్చిన తర్వాతనే కదా ఆదాల మన పార్టీలో చేరింది’ అని నర్మగర్భ వ్యాఖ్య చేసినట్లు ప్రచారం జరుగుతోంది. చివరాఖరకు ఫాఫం.. బాగుండదని, దయదలచి, ఓ 150 కోట్ల పనులేవో సర్దుబాటు చేసినట్లు చెబుతున్నారు. అది కూడా ఆ ప్రాజెక్టులో మిగులు ప్రాతిపదికనట. చివరకు ఎంపీ ఆదాలకు దక్కాల్సిన.. సర్వేపల్లి కెనాల్ 200 కోట్ల రూపాయల పనులు కూడా ఆయనకు దక్కలేదట! నిజానికి ఈ ప్రాజెక్టు కోసం ఆదాల కొన్నేళ్ల నుంచి తన ప్రత్యర్థులతో యుద్ధం చేస్తున్నారు.
కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో.. ఈ పనులను దక్కించుకునేందుకు, నాటి ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డితో, ఆదాల యుద్ధం చేశారు. ఇద్దరూ ఆ పనులు తమకు కావాలని పట్టుపట్టారు. కిరణ్ చేసిన సయోధ్య కూడా ఫలించలేదు. ఆ తర్వాత టీడీపీ సర్కారులో, సోమిరెడ్డి-ఆదాల మధ్య పోరు నడిచింది. ఆ ఐదేళ్లు అలా గడిచింది. ఇప్పుడు వైసీపీలో చేరి ఎంపి అయినప్పటికీ, ఆదాలకు ఉపయోగం లేకుండా పోయింది. ఆ పనులను నెలూర్లు టౌన్-రూరల్ ఎమ్మెల్యేలు, సిఫార్సు చేసిన వారికి ఇచ్చేశారట. అలా ఎవరి వల్లా కాని ఈ పనులను జగన్, కొన్ని నెలలలోనే క్లియర్ చేశారన్న మాట. ఫాఫం.. వైసీపీ ఎంపీలు!
-మార్తి సుబ్రహ్మణ్యం