ఆర్టీసీ సమ్మె వెనుక కుట్ర ఉంది... కఠిన చర్యలకు అనుమతివ్వండి... హైకోర్టును కోరిన ప్రభుత్వం

 

ఆర్టీసీ సమ్మెపై మొదట్నుంచీ తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్న ముఖ్యమంత్రి కేసీఆర్... ప్రభుత్వ అఫిడవిట్ లో స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. ఆర్టీసీ యూనియన్లు-కార్మికులపై విరుచుకుపడ్డారు. పండగలు, ముఖ్య సమయాల్లో సమ్మెకు దిగడం యూనియన్లకు అలవాటుగా మారిందన్న ప్రభుత్వం... ఆర్టీసీ సమ్మె వెనుక కుట్ర ఉందని హైకోర్టుకు నివేదించింది. ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయాలన్న దురుద్దేశంతోనే సమ్మెకు దిగారని సంచలన ఆరోపణలు చేసింది.

ఆర్టీసీ జేఏసీ నిర్వహించిన ఛలో ట్యాంక్-బండ్ కార్యక్రమంపైనా ప్రభుత్వం ఘాటు వ్యాఖ్యలు చేసింది. అయోధ్య తీర్పుపై దేశమంతటా హైఅలర్ట్ ఉండగా, ఆర్టీసీ కార్మికులు ఛలో ట్యాంక్‌బండ్ నిర్వహించారని, దాంతో భద్రతా బలగాలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వచ్చిందని హైకోర్టుకు తెలిపింది. రెండ్రోజుల్లో కోర్టు విచారణ ఉండగా, ఛలో ట్యాంక్-బండ్ నిర్వహించడం వెనుక కుట్ర ఉందని ఆరోపించింది. కేసు విచారణలో ఉండగా, ఆర్టీసీ కార్మికులు ఛలో ట్యాంక్ బండ్ నిర్వహించడం కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని ప్రభుత్వం న్యాయస్థానానికి నివేదించింది ప్రభుత్వం. హైదరాబాద్ లాంటి సున్నిత ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ యంత్రాంగం శ్రమిస్తుంటే... ఆర్టీసీ కార్మికులు ఉద్రిక్తతలు సృష్టించారని హైకోర్టుకు తెలిపింది.

ఆర్టీసీ కార్మికుల సమ్మెలో అసలు చిత్తశుద్దే లేదన్న ప్రభుత్వం... యూనియన్ ఎన్నికలకు ముందు ఇలాంటి ఎత్తులు వేస్తుంటారని హైకోర్టుకు తెలిపింది. ఆర్టీసీ కార్పొరేషన్ ఆర్ధిక స్థితిగతులు బాగాలేనపుడు ప్రజలకు ఇబ్బందులు కలిగించడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని యూనియన్లు ప్రయత్నిస్తున్నాయని  ప్రభుత్వం వివరించింది. కార్పొరేషన్ భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకోకుండా, సమ్మెకు వెళ్లిన ఆర్టీసీ కార్మికులపై పారిశ్రామిక వివాద చట్టానికి అనుగుణంగా తదుపరి చర్యలు  చేపట్టేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును కోరింది తెలంగాణ ప్రభుత్వం. మరి, సర్కారు నివేదికపై హైకోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.