ఖజానాలో చిల్లిగవ్వ లేదు... కానీ పథకం మీద పథకం... ఏపీలో ఆర్ధిక ఎమర్జెన్సీ!

 

ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక పరిస్థితి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్ధిక క్రమశిక్షణ పాటించకపోవడంతో ఖజానాలో చిల్లిగవ్వలేని పరిస్థితి నెలకొందని అంటున్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే నవరత్నాలు, ఎన్నికల హామీలన్నీ అమలు చేసేందుకు ప్రయత్నిస్తోన్న జగన్మోహన్ రెడ్డి... నిధులను మాత్రం సమకూర్చడం లేదని అధికారులు వాపోతున్నారు. నిధుల కేటాయించాలని ఆదేశాలిస్తున్న జగన్... వాటిని ఎలా సమకూర్చుకోవాలో చెప్పకపోవడంతో ఆర్ధికశాఖాధికారులు తలలు పట్టుకుంటున్నారు.

దాంతో, ఒకపక్క సీఎం ఆదేశాలు... మరోపక్క నిధుల్లేక... అధికారులు అల్లాడిపోతున్నారట. అంతేకాదు, ఉద్యోగుల జీతాలు చెల్లించిన తర్వాత ఆయా శాఖల దగ్గర కేవలం లక్షల్లో మాత్రమే డబ్బు మిగిలిందని చెబుతున్నారు. ఆర్ధిక వ్యవహారాల్లో ఇదే ధోరణి కొనసాగితే ఆర్ధిక ఎమర్జెన్సీ విధించాల్సిన పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు. ఆర్ధిక ఇబ్బందులు తీవ్రంగా ఉన్నా.... వాస్తవ పరిస్థితులను వివరించడానికి మాత్రం ఆయా శాఖాధిపతులు జంకుతున్నారట. 

మొత్తానికి ఏపీలో ఆర్ధిక పరిస్థితి చేయి దాటిపోతోందని, ప్రభుత్వం అప్రమత్తం కాకపోతే, ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి తెలిసిన ఓ ఉన్నతాధికారి... ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నిధుల సర్దుబాట్లు చేయలేక సెలవుపై వెళ్లడానికి సిద్ధమైనట్లు సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. ఇక, ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పరిస్థితి కూడా ఇంచుమించూ ఇలాగే ఉందని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి... పథకం మీద పథకం ప్రకటిస్తుంటే.... నిధులు కేటాయించలేక బుగ్గన తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారట.

ఆ ఒత్తిడిని భరించలేక, త్వరలో తాను కేవలం ఎమ్మెల్యేగా మాత్రమే ఉండాలనుకుంటున్నానని తన సన్నిహితుల దగ్గర వ్యాఖ్యానించినట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక పరిస్థితి డేంజర్ బెల్స్ మోగిస్తోందని ప్రభుత్వ వర్గాల మాటలను బట్టి అర్ధమవుతోంది. మరి, ఈ గడ్డు పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి ఎలా గట్టెక్కిస్తారో చూడాలి.