తెలంగాణ ఆర్టీసీలో సమ్మె మేఘాలు... ఉక్కిరిబిక్కిరవుతోన్న కేసీఆర్ ప్రభుత్వం

 

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె మేఘాలు కమ్ముకుంటున్నాయి. సోమేష్ కుమార్ కమిటీతో కార్మిక సంఘాల చర్చలు విఫలం కావడంతో.... సమ్మె యథాతథంగా ఉంటుందని ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. అయితే, సమ్మె ఆలోచన విరమించుకోకపోతే... తమ దగ్గర ప్లాన్‌-బి రెడీగా ఉందంటూ సోమేష్ కమిటీ హెచ్చరికలు పంపింది. దాంతో అంతే దీటుగా రియాక్టయిన ఆర్టీసీ కార్మిక సంఘాలు.... తమ సమస్యలు పరిష్కారమయ్యేవరకు వెనక్కితగ్గేది లేదని కౌంటరిచ్చాయి.

దసరా పండగవేళ ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునివ్వడంతో తెలంగాణ ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరవుతోంది. సమస్య పరిష్కారానికి ముగ్గురు ఐఏఎస్‌లతో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం.... ప్రజలకు ఇబ్బంది కలిగించే చర్యలు మానుకోవాలని ఆర్టీసీ జేఏసీకి సూచించింది. అయితే, కమిటీ చర్చల్లో తమకు ఎలాంటి నిర్దిష్టమైన హామీ రాలేదన్న ఆర్టీసీ కార్మిక సంఘాలు.... తమ డిమాండ్లు నెరవేరేవరకు వెనకడుగు వేసేది లేదని తేల్చిచెప్పాయి. సోమేష్ కుమార్ కమిటీ సమయం కావాలని కోరిందని.... కానీ ఎంత టైమ్ కావాలో చెప్పలేదన్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంతోపాటు మొత్తం 26 డిమాండ్లూ నెరవేర్చాల్సిందేనన్న ఆర్టీసీ జేఏసీ.... కార్మికుల కోణంలో ఆలోచించి సమస్య పరిష్కారం దిశగా ప్రభుత్వం, కమిటీ కృషిచేయాలన్నారు.

అయితే, పండుగల సమయంలో సమ్మెకు దిగొద్దని ఆర్టీసీ కార్మిక సంఘాలను సోమేష్ కుమార్ కోరారు. ఆర్టీసీ పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్న సోమేష్‌.... కార్మికుల సమస్యలపై సీఎం కేసీఆర్ కూడా దృష్టిపెట్టారని అన్నారు. ఆర్టీసీ సమస్యను సమూలంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న సోమేష్.... ఒకవేళ కార్మికులు సమ్మెకు దిగితే... ఎలా వ్యవహరించాలో తమ దగ్గర ప్లాన్‌-బి కూడా రెడీగా ఉందంటూ హెచ్చరికలు పంపారు.

సమ్మె ఆలోచన విరమించుకోకపోతే, ప్లాన్‌-బి రెడీగా ఉందంటూ సోమేష్ కుమార్ కమిటీ హెచ్చరికలు పంపడంపై కార్మిక సంఘాలు.... ఘాటుగా రియాక్టయ్యాయి. ప్రభుత్వం దగ్గర ఎలాంటి ప్లాన్‌లున్నా... సమ్మె ఆగదన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎన్ని ఆంక్షలు పెట్టినా, సకల జనుల సమ్మెను విజయవంతం చేశామని, ఇప్పుడు కూడా అదే తరహాలో తమ డిమాండ్లు నెరవేరేవరకు పోరాడతామంటూ ఆర్టీసీ జేఏసీ స్ట్రాంగ్ కౌంటరిచ్చింది. అయితే, ప్రభుత్వం ఎన్నిసార్లు చర్చలకు పిలిచినా వెళ్తామన్న కార్మిక సంఘాలు.... తమ సమస్యలు పరిష్కారమయ్యేవరకు వెనక్కి తగ్గేదే లేదన్నారు.