అందుబాటులోకి గ్రామ సచివాలయాలు... జగన్‌పై మంత్రుల పొగడ్తల వర్షం...
posted on Oct 3, 2019 11:50AM

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ సచివాలయ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. తూర్పుగోదావరి జిల్లా కరపలో పైలాన్‌ను ఆవిష్కరించిన సీఎం జగన్మోహన్ రెడ్డి.... గ్రామ సచివాలయ వ్యవస్థను లాంఛనంగా ప్రారంభించారు. ఇక, జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు... ఎక్కడికక్కడ విలేజ్ సెక్రటేరియట్స్‌కు ప్రారంభోత్సవాలు చేశారు. అయితే, ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పొగడ్తల వర్షం కురిపించారు. అవినీతిరహిత పాలన అందించాలన్న గొప్ప లక్ష్యం... ఉన్నత ఆశయంతోనే గ్రామ-వార్డు సచివాలయ వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారంటూ కొనియాడారు. పాలనను ప్రజలకు చేరువ చేయడమే జగన్మోహన్ రెడ్డి ఆకాంక్ష అంటూ చెప్పుకొచ్చిన మంత్రులు.... గాంధీజీ కలలుకన్న గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకెళ్తోందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపాలన్న లక్ష్యంతోనే గ్రామ సచివాలయ వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి అమల్లోకి తీసుకొచ్చారని మంత్రులు, ఎమ్మెల్యేలు పొగడ్తల వర్షం కురిపించారు.