హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో సి.పి.ఎం దారెటు..?
posted on Oct 3, 2019 10:26AM

హుజూర్ నగర్ ఉప ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. హుజూర్ నగర్ లో ఎలాగైనా గులాబీ జెండాను పాతేందుకు అధికార టి.ఆర్.ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా సీపీఐ తో జతకట్టింది. సిపిఐ మద్దతుతో గులాబీ జెండాను రెపరెపలాడించాలని గులాబీ దళపతి కేసీఆర్ ఉవ్విళ్లూరుతున్నారు. కాంగ్రెస్ కంచుకోటను బద్ధలు కొట్టి హుజూర్ నగర్ లో సత్తా చాటాలని కేసీఆర్ పట్టుదలతో ఉన్నారు. కాంగ్రెస్ ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ హస్తం పార్టీని చిత్తుగా ఓడించాలని కేసీఆర్ రాజకీయ వ్యూహాలకి పదును పెడుతున్నారు. అందులో భాగంగానే హుజూర్ నగర్ లో పట్టున్న సిపిఐ ని మద్దతివ్వాలని కోరారు.
అందుకు సీపీఐ కూడా అంగీకారం తెలిపింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా హుజూర్ నగర్ లో గెలిచి తమ సత్తా చాటాలనుకుంటోంది. హుజూర్ నగర్ లో గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ టి.జె.ఎస్ మద్దతు కోరింది. అందుకు టీ.జే.ఎస్ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపింది. టి.జె.ఎస్ చైర్మన్ కోదండరాం తో జరిపిన చర్చలు ఫలించడంతో కాంగ్రెస్ పార్టీ ఫుల్ జోష్ లో ఉంది. టి.జె.ఎస్ మద్దతుతో హుజూర్ నగర్ లో కాంగ్రెస్ జెండా రెపరెపలాడడం ఖాయమని హస్తం నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
అయితే టి.ఆర్.ఎస్ కు సిపిఐ మద్దతు ఇవ్వటం చారిత్రక తప్పిదమని టి.జె.ఎస్ చైర్మన్ కోదండరాం మండిపడుతున్నారు. హుజూర్ నగర్ లో ప్రధానంగా పోటీ కాంగ్రెస్, టి.ఆర్.ఎస్ మధ్యే కన్పిస్తోంది. కాంగ్రెస్ కి టీ.జే.ఎస్ మద్దతిస్తే అలాగే టి.ఆర్.ఎస్ సిపిఐ మద్దతిచ్చింది. అయితే సిపిఎం దారెటో తెలియాల్సి ఉంది. హుజూర్ నగర్ ఉప ఎన్నికల బరిలోకి దిగిన సిపిఎం పార్టీకి నిరాశే మిగిలింది. పార్టీ అభ్యర్థి దాఖలు చేసిన నామినేషన్ ను తిరస్కరించారు.
అయితే దీనిపై న్యాయపరంగా పోరాటం చేయాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఈ నెల ఆరున రాష్ట్ర కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. మరోవైపు ఇదే అదునుగా భావించిన టీడీపీ తమ పార్టీ అభ్యర్థికి మద్దతివ్వాలని సిపిఎం ని కోరింది. టిడిపి అధ్యక్షుడు ఎల్ రమణ సిపిఎం నేతలను కలిసి విజ్ఞప్తి చేశారు. అయితే టిడిపికి మద్దతిచ్చే అంశంపై త్వరలోనే స్పష్టత ఇస్తామన్నారు తమ్మినేని వీరభద్రం.