రాహుల్ గాంధీ సమావేశానికి టీఆర్ఎస్.. రేవంత్ రెడ్డి పరేషాన్? 

తెలంగాణలో రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ లీడర్ గా రేవంత్ రెడ్డికి పేరు. మొదటి నుంచి అగ్రెసివ్ పాలిటిక్స్ చేసే రేవంత్ రెడ్డి.. పీసీసీ చీఫ్ అయ్యాకా మరింత  స్పీడ్ పెంచారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ సర్కార్ టార్గెట్ గా వరుస కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. దళిత గిరిజన దండోరా, నిరుద్యోగ గర్జనలకు మంచి స్పందన వచ్చింది. రేవంత్ రెడ్డి దూకుడుతో రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. రోజురోజుకు అది మరింతగా పెరుగుతూనే ఉంది. కేసీఆర్ పై రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు, ఆయన విసురుతున్న సవాళ్లు జనాల్లోకి వెళుతున్నాయి. టీఆర్ఎస్ సర్కార్ పై వ్యతిరేకతకను భారీగా పెంచేస్తున్నాయి. 

రేవంత్ రెడ్డితో తమకు ఇబ్బంది వస్తుందనే ఆందోళనలో గులాబీ లీడర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ముఖ్యంగా రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టేలా ఢిల్లీలో టీఆర్ఎస్ నిర్ణయాలు తీసుకుంటోంది. కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాల కూటమి భేటీకి టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు హాజరయ్యారు. రాజ్యసభ నుంచి పన్నెండు మంది ఎంపీల్ని బహిష్కరించడంపై తదుపరి కార్యాచరణను ఖరారు చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ విపక్ష నేతల భేటీని నిర్వహించింది. దీనికి టీఆర్ఎస్ నుంచి కేశవరావు హాజరయ్యారు. ఆయన రాహుల్ గాంధీ పక్కనే కూర్చుని ముచ్చట్లు చెబుతూ కనిపించారు.  తాము బీజేపీకి ఎప్పుడూ దూరమేనని.. దేశానికి ఉపయోగపడే బిల్లులకు మాత్రమే మద్దతిచ్చామని కేకే చెప్పుకొచ్చారు. 

పెద్దల సభకు గులాబీ బాస్? కేసీఆర్ ఢిల్లీకి మకాం మారుస్తారా?

తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితుల్లో కేశవరావు సమావేశం టీ కాంగ్రెస్ నేతల్ని  ఆందోళనకు గురి చేసింది. బీజేపీతో కలిసి డ్రామాలు ఆడుతూ.. తమ మధ్యనే పోటీ ఉందని టీఆర్ఎస్, బీజేపీ ఓ సీన్ క్రియేట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఇప్పటికే కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ కాంగ్రెస్‌కే దగ్గర అన్నట్లుగా ఓ ఫోటో రిలీజ్ కావడం టీ కాంగ్రెస్‌ను గందరగోళానికి గురి చేసింది. అందుకే రేవంత్ రెడ్డి వెంటనే మీడియాతో మాట్లాడి.. టీఆర్ఎస్ డబుల్ గేమ్ ఆడుతోందని విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ తో తమ పోరాటం కొనసాగుతుందనే సంకేతం ఇచ్చారు. అయితే కేడర్ లో మాత్రం కాంగ్రెస్ తో టీఆర్ఎస్ దగ్గరయితే తమ పరిస్థితి ఏంటీ అన్న ఆందోళన కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి వర్గీయుల్లో ఈ టెన్షన్ ఎక్కువగా ఉంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకవేళ కలిస్తే.. తన పరిస్థితి ఏంటి అన్న టెన్షన్ రేవంత్ రెడ్డిలోనూ ఉందని అంటున్నారు. ఇదే జరిగితే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో ఉండకపోవచ్చనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో సాగుతోంది.

నిజానికి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరుతున్నప్పుడే కొందరికి ఈ డౌట్ వచ్చింది. తెలంగాణలో ప్రస్తుతం కేసీఆర్ కు ధీటుగా ఎదుర్కొనే నేతగా రేవంత్ రెడ్డి ఉన్నారు. అలాంటిది రాజకీయ సమీకరణల్లోభాగంగా టీఆర్ఎస్ తో కాంగ్రెస్ కలిసి పని చేయాల్సి వస్తే రేవంత్ రెడ్డి ఏం చేస్తారన్న చర్చ రాజకీయ వర్గాల్లో నడిచింది. అయితే తెలంగాణలో కారుకు కాంగ్రెసే ప్రత్యామ్నాయమని, ఆ రెండు పార్టీలు కలిసే అవకాశం ఉండదని రేవంత్ రెడ్డి చెబుతూ వస్తున్నారు. కానీ ప్రస్తుతం తెలంగాణ పాలిటిక్స్ మారిపోయాయి, బీజేపీ బలపడింది. టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమని, వచ్చే ఎన్నికల్లో తమదే అధికారమని కమలనాధులు ధీమాగా ఉన్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులు, బీజేపీ కేంద్రంలో మరోసారి అధికారంలోకి రాకుండా చూడాలంటే టీఆర్ఎస్ తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. 

ఇటీవల కాలంలో మోడీ సర్కార్ పై నిప్పులు చెరుగుతున్నారు కేసీఆర్. ఇంతటి దరిద్రతపు ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడు చూడలేదన్నారు. బీజేపీతో దేశానికి నష్టమని, ఆ పార్టీని బొంద పెట్టాలని అన్నారు. ఇది  జరిగిన తర్వాత రోజే రాహుల్ గాంధీ సమావేశానికి టీఆర్ఎస్ ఎల్పీ కేశవరావు హాజరయ్యారు. ఈ పరిణామాలతో బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ కు టీఆర్ఎస్ దగ్గరవుతుందనే అభిప్రాయం వస్తోంది. అదే జరిగితే రాష్రంలో కాంగ్రెస్ కు గడ్డు కాలమేనని,  ముఖ్యంగా రేవంత్ రెడ్డికి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.