సిరివెన్నెలకు నివాళి.. జగనన్న ఓటీఎస్ రచ్చ.. ఉద్యోగుల నోటీస్.. టాప్ న్యూస్@ 1PM

ప్రముఖ సినీ గేయ రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రికి ఘనంగా నివాళులు అర్పించారు. సీతారామశాస్త్రి భౌతికకాయన్ని బుధవారం ఉదయం అభిమానుల సందర్శనార్థం ఫిల్మ్ ఛాంబర్‌కు తీసుకొచ్చారు. ఈ క్రమంలో సినీ ప్రముఖులు ఫిల్మ్ ఛాంబర్‌కు చేరుకుని ఆయన పార్థివదేహానికి కన్నీటి నివాళులు అర్పించారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌, పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీయార్, జగపతిబాబు, నాగబాబు, శ్రీకాంత్, రాజశేఖర్‌, అల్లు అర్జున్, నాని, రానా దగ్గుబాటి, శర్వానంద్ తదితరులు సిరివెన్నెలకు నివాళులర్పించారు
------
ఒక్కఛాన్స్ అంటే ఒక్కసారి జగన్‌కు ఓటు వేసినందుకు.. ఓటీఏస్ అంటూ రూ. 10 వేల నుంచి రూ. 20 వేల మధ్య ఇంటింటికి తిరిగి మరి రాబందుల్లా పీక్కు తింటున్నారని బీజేపీ నేత లంకా దినకర్ విమర్శించారు. ఎన్నికల ముందు పేదల ఇళ్లపై ఉన్న బకాయిలు రద్దు చేస్తామన్న జగన్.. ముఖ్యమంత్రి అయ్యాక ఓటీఏస్ కట్టని పేదల పథకాలు రద్దు అంటున్నారన్నారు. జగన్ పాలన మొదటి అర్థ భాగం అస్తవ్యస్థం, అగమ్యగోచరం, అయోమయం జగన్నాథంలా ఉందని ఎద్దేవా చేశారు
---
ఏపీ ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలు అల్టిమేటం జారీ చేశాయి. ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి ఐక్య వేదిక నేతలు బొప్పారాజు, బండి శ్రీనివాసులు.. సీఎస్ సమీర్ శర్మకు ఉద్యమ కార్యచరణ నోటీసు ఇచ్చారు. 
11 పీఆర్సీ అమలు, డిఏ బకాయిల చెల్లింపు, సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు గ్రామ సచివాలయ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఉద్యోగుల లోన్స్, అడ్వాన్స్‌ల చెల్లింపు అందులో ఉన్నాయి.డిసెంబర్ 7 నుండి ఉద్యమ కార్యాచరణను అమలులోకి తీసుకురానున్నారు. 
------
ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి అక్రమాస్తులకు సంబంధించిన మొత్తం వ్యవహారాన్ని విడివిడిగా చూడరాదని సీబీఐ పేర్కొంది. విడివిడిగా చూస్తే నేరం జరిగినట్లు కనిపించదని తెలంగాణ హైకోర్టుకు నివేదించింది. అక్రమాస్తుల వ్యవహారంలో భాగం గా తమపై సీబీఐ నమోదు చేసిన కేసులను కొట్టేయాలని కోరుతూ వాన్‌పిక్‌ ప్రాజెక్టు, ఆ సంస్థ నిర్వాహకుడు నిమ్మగడ్డ ప్రసాద్‌ దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్లపై జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ ధర్మాసనం మంగళవారం విచారణ కొనసాగించింది. 
-----
నెల్లూరు జిల్లా మరుపూరులో బుధవారం ఉదయం రైతుల మహాపాదయాత్ర ప్రారంభమైంది. అయితే అన్ని వాహనాలను పోలీసులు అనుమతించడంలేదు. దీంతో రాజధాని రైతులు ధర్నాకు దిగారు. మహాపాదయాత్రకు వైసీపీ శ్రేణులు, పోలీసులు అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్నారు. పొదలకూరులో భోజనాల తయారీకి స్థలాలు ఇవ్వకుండా వైసీపీ శ్రేణులు అడ్డుకున్నారు. భస చేసేందుకు వీలులేక రాత్రి వేళ లారీలు, ట్రాక్టర్లలో రైతులు నెల్లూరుకి వెళ్లారు. 
---
ధాన్యం కొనుగోలుపై పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి స్పష్టత ఇచ్చే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని రాజ్యసభ ఎంపీ కే.కేశవరావు స్పష్టం చేశారు. పార్లమెంటు వేదికగా ధాన్యం కొనుగోళ్లపై గందరగోళానికి తెరపడాలన్నారు. తాము ప్రతిపక్షంతో ఉన్నామని తెలిపారు. 12 మంది రాజ్యసభ ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేయాలని ఎంపీ కేకే డిమాండ్ చేశారు. 
--------
ఎయిడ్స్ రోగుల పట్ల చిన్న చూపు చూడొద్దని మంత్రి హరీష్‌రావు అన్నారు. ఎర్రగడ్డ చెస్ట్ ఆస్పత్రిలో ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ఎయిడ్స్ మరణాల సంఖ్య తగ్గించగలిగామని తెలిపారు. గాలి ద్వారా, తాకడం ద్వారా ఎయిడ్స్ రాదన్నారు. ఎయిడ్స్ రాకుండా అవగాహన పెంచుదామని పిలుపునిచ్చారు. ఎయిడ్స్ రోగులకు ఉచితంగా వైద్యం అందిస్తున్నామని మంత్రి తెలిపారు.
-----
విజయనగరం జిల్లా సీతానగరం మండలంలో గల ఎన్‌సీఎస్ షుగర్ ఫ్యాక్టరీ వివాదం కొనసాగుతోంది. కర్మాగారానికి యాజమాన్యం లాకౌట్ ప్రకటించడంతో అందుకు నిరసనగా కార్మకులు ఆందోళనకు దిగారు. జీతాల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేసినందుకే లాకౌట్‌ ప్రకటించారంటూ నిరసన చేపట్టారు. రూ.6 కోట్ల మేర జీతాల బకాయిలు చెల్లించాలని కార్మికులు ఇటీవలే నిరసన తెలిపారు. 
---
సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో జరిగిన నిరసన కార్యక్రమాల సందర్భంగా రైతుల మరణాలకు సంబంధించిన రికార్డు లేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పార్లమెంటుకు తెలిపారు. సుమారు ఓ సంవత్సరం నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పోరాడుతున్నారని, వీరిలో కొందరు రైతులు మరణించారని, వారి కుటుంబాలకు ఆర్థిక సాయం చేసే ఆలోచన ఉందా? అని ప్రభుత్వాన్ని ప్రతిపక్షం ప్రశ్నించింది. దీనిపై నరేంద్ర సింగ్ తోమర్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
-----
కోరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఆందోళనల నేపథ్యంలో.. ఆఫ్రికా దేశాల నుంచి భారత్ కు వచ్చిన వారి ఆచూకీ తెలియకుండా పోయింది. ప్రస్తుతం దేశంలో ఒమిక్రాన్ కేసులు నమోదు కాకపోయినా.. వారి జాడ తెలియకపోవడం ఆందోళన కలిగిస్తోంది. 15 రోజుల్లో వందలాది మంది దేశంలో దిగినా.. దాంట్లో సగం మంది వారివారి పాస్ పోర్టుల్లో పేర్కొన్న చిరునామాల్లో మాత్రం లేరు. దీంతో వారి ద్వారా కొత్త వేరియంట్ దేశంలో విస్తరించే ముప్పుంటుందని అధికారులు తలలు పట్టుకుంటున్నారు.