డబ్బులు కడతారా.. పింఛన్, రేషన్ ఆపేయాలా?.. ‘జగనన్న సంపూర్ణ గృహ దోపిడీ’
posted on Dec 1, 2021 11:18AM
నవరత్నాలు కాదు నవరంధ్రాలుగా మారుతోంది. జగనన్న పాలన దోపిడీ రాజ్యంగా నిలుస్తోంది. పేరుకే కొత్త పథకాలు.. లబ్దిదారుల సంఖ్యకు భారీగా కోతలు. ఇక ఆదాయం కోసం పన్నుల బాదుడు. అయినా, ప్రభుత్వం నడవడం కష్టంగా మారింది. దమ్మిడి రాబడి లేక, కొత్తగా అప్పు ముట్టక నానా తిప్పలు పడుతోంది. సర్కారు నావను కష్టాల కడలి దాటించేందుకు.. జగన్‌రెడ్డి ప్రభుత్వం కొత్తగా.. పాత పథకం నుంచి కాసులు పిండుకునే పనికిమాలిన పనికి పూనుకుంది. వన్‌టైమ్ సెటిల్మెంట్- ఓటీఎస్ పేరుతో పాత ఇళ్ల నుంచి కొత్తగా డబ్బులు వసూలు చేస్తోంది. ‘డబ్బులు కడతారా... పింఛను ఆపేయమంటారా’ అంటూ వాలంటీర్లు, సచివాలయ సిబ్బందితో పేదలను టార్చర్ చేస్తోంది. ఉద్యోగులకు టార్గెట్లు పెట్టి మరీ.. పైసా వసూల్‌కు పాల్పడుతోంది.
చంద్రబాబు మీద కోపంతో ఆయన సీఎంగా ఉన్నప్పుడు కట్టించిన టిడ్కో ఇళ్లను అర్థాంతరంగా ఆపేసి.. పేదల గూడు చెదరగొట్టారు. ఇక, జగనన్న హయాంలో కొత్తగా ఒక్క ఇల్లు కూడా కట్టించలేదు. ఇది చాలదన్నట్టు.. గత ప్రభుత్వాల హయాంలో పేదలకు కట్టించిన ఇళ్ల బకాయిలను ఇప్పుడు బలవంతంగా వసూలు చేస్తోంది వైసీపీ సర్కారు. ‘జగనన్న సంపూర్ణ గృహ హక్కు’ పేరుతో.. వన్‌టైమ్ సెటిల్మెంట్- ఓటీఎస్ కింద 10వేల నుంచి 15వేలు పేదల నుంచి రాబడుతోంది. ఓటీఎస్ కింద డబ్బులు కడితేనే సామాజిక పింఛను చెల్లించాలని, లేకపోతే డిసెంబరు పెన్షన్ ఇవ్వొద్దని.. రేషన్ కట్ చేయాలని.. అనేక ప్రాంతాల్లో గ్రామ పంచాయతీ కార్యదర్శులు, వలంటీర్లను ప్రభుత్వం ఆదేశించింది. లబ్దిదారుల దగ్గర డబ్బులు లేవంటే.. డ్వాక్రా సంఘాల నుంచి రుణం ఇప్పించైనా.. ఓటీఎస్ వసూలు చేయాలని.. లేదంటే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని.. ఆ మొత్తాన్ని సిబ్బంది నుంచి రాబడతామని హెచ్చరిస్తున్నారు ఉన్నతాధికారులు. ప్రతి డివిజన్‌కు రోజుకు రూ.కోటి చొప్పున రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేయాలని టార్గెట్లు పెట్టారు.
జగనన్న సంపూర్ణ గృహ హక్కు ద్వారా వారి ఇళ్లకున్న బకాయిలను మాఫీ చేసి... రిజిస్ట్రేషన్ చేయిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఇందుకోసం గ్రామాల్లో ఒక్కో ఇంటికి రూ.10 వేలు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో రూ.15 వేలు, కార్పొరేషన్లలో రూ.20 వేలు వన్‌టైమ్ సెటిల్మెంట్ కింద చెల్లించాలని ఆదేశించింది. ప్రభుత్వం ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలు, వడ్డీ వ్యాపారస్తుల తరహాలో బెదిరిస్తుండటంతో లబ్ధిదారులు బెంబేలెత్తుతున్నారు. ‘మాకు ఓటీఎస్ వద్దు’ అంటూ మహిళలు తిరగబడుతున్నారు. అయినా, జగనన్న పైసా వసూల్ కార్యక్రమాన్ని ఆపడం లేదు.