పొత్తు లేదు.. ప్రచారం చేయరు! విచిత్ర బంధంతో బలవుతున్న అభ్యర్థులు
posted on Nov 21, 2020 12:15PM
'' నేను కొట్టినట్టు చేస్తా.. నువ్వు ఏడ్చినట్టు చేయ్'. ఈ సామెతను బయటికి ప్రత్యర్థులుగా నటిస్తూ లోలోపల స్నేహంగా ఉండేవారి గురించి చెప్పడానికి ఉదాహరణగా చెబుతారు. గ్రేటర్ హైదరాబాద్ లో ఇప్పుడు అధికార టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల పరిస్థితి కూడా ఇలానే ఉంది. ఎంఐఎం మాకు మిత్రపక్షమని చెబుతారు.. కాని పొత్తు లేదంటారు టీఆర్ఎస్ నేతలు. కేసీఆర్ సర్కార్ కు పూర్తి మద్దతిస్తారు.. కాని కలిసి పోటీ చేసేది లేదంటారు పతంగి పార్టీ నేతలు. ఈ అర్థంకాని బంధంతో ఈ పార్టీల తీరుపై గ్రేటర్ ప్రజలకు క్లారిటీ రావడం లేదు.
ఎంఐఎంతో పొత్తు లేదని ఇటీవల జరిగిన మీట్ ద ప్రెస్ లో చెప్పారు మంత్రి కేటీఆర్. పాతబస్తీలోనూ 10 డివిజన్లలో తమ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అయితే ఎంఐఎంతో పొత్తు లేదని చెప్పే కేటీఆర్.. పాతబస్తిలో ప్రచారం చేస్తారా అంటే ఆయన దగ్గర సమాధానం లేదు. పతంగి పార్టీతో పొత్తు లేదంటున్న కారు పార్టీ.. అక్కడ బలమైన అభ్యర్థులను మాత్రం పెట్టడం లేదు. పొత్తు లేదంటూనే ప్రతిసారీ పరోక్షంగా ఎంఐఎం పార్టీకి అధికార పక్షం సహకరిస్తూనే పలువురిని పోటీలో నిలబెడుతోంది. అక్కడ పోటీ చేసే అభ్యర్థులకు అధిష్ఠానం సహకరించదు. పార్టీ ముఖ్య నేతలు పాతబస్తిలో ప్రచారమే చేయరు. పాతబస్తీలో జరిగే ఈ విచిత్ర పోటీతో కొందరు అమాయక అధికార పార్టీ అభ్యర్థులు బలవుతున్నారనే ప్రచారం జరుగుతోంది.
పాతబస్తీలోని చార్మినార్, యాఖుత్ పురా, చాంద్రాయణగుట్ట, బహదూర్ పురా, మలక్ పేట, కార్వాన్, నాంపల్లి నియోజకవర్గాల్లో ఎంఐఎం పార్టీదే హవా. దశాబ్దాలుగా ఇక్కడ మెజార్టీ డివిజన్లలో పతంగి పార్టీ అభ్యర్థులే గెలుస్తున్నారు. అలాంటి ప్రాంతాల్లో అధికార పక్షం నామమాత్రంగా అభ్యర్థులను పోటీకి నిలుపుతోంది. పార్టీ కోసం నిరంతరం పని చేస్తున్న కార్యకర్తలు నామినేషన్లు దాఖలు చేసినా ప్రచారానికి మాత్రం అధిష్ఠానం రావడం లేదని పాతబస్తి గులాబీ లీడర్లే చెబుతున్నారు. గతంలో ఏనాడూ మంత్రుల స్థాయిలో ఎవరూ ప్రచారానికి వెళ్లలేదు. అక్కడక్కడా టీఆర్ఎస్ ప్రచారాన్ని ఎంఐఎం పార్టీ కార్యకర్తలు అడ్డుకున్న సందర్భాలు ఉన్నాయి. గత గ్రేటర్ ఎన్నికల సందర్భంగా మలక్పేట నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రిపైనే కొందరు దాడికి యత్నించారు. అంత పెద్ద ఘటన జరిగినా ఆ పార్టీ వైఖరిని అధికార పార్టీ నెతలేవరూ ఖండించలేదు.
2016 బల్దియా ఎన్నికలకు అన్ని డివిజన్లకు ఇంచార్జ్ లను నియమించింది టీఆర్ఎస్. ఇంచార్జులుగా నియమించిన వారిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలు కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ మేయర్లు, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు ఉన్నారు. అయితే వారెవరు పాతబస్తిలో సీరియస్ గా ప్రచారం చేయలేదు. చేశామంటే చేశామన్నట్లుగా కొన్ని ప్రాంతాల్లో తిరిగి సైలెంట్ అయ్యారు. పార్టీ పెద్దల నుంచి అలాంటి ఆదేశాలు వచ్చాయనే కొందరు గులాబీ నేతలు ఓపెన్ గానే చెప్పేశారు. గ్రేటర్ ప్రచార బాధ్యతలు తీసుకున్న కేటీఆర్ 2016లో నగరంలో భారీగా రోడ్ షోలు, సభలు నిర్వహించారు. పాతబస్తీని మాత్రం ఆయన పట్టించుకోలేదు. ప్రజలకు అనుమానం రాకుండా ఉండేందుకని రెండు, మూడు డివిజన్లలో సభ పెట్టారు కేటీఆర్. ఈ సారి కూడా ఓల్డ్ సిటిలోని అన్ని డివిజన్లకు ఇంచార్జులను ప్రకటించింది అధికార టీఆర్ఎస్ పార్టీ. అయితే వారు ప్రచారం చేస్తారా అంటే డౌటే.
ప్రతీసారి ఉత్తుత్తిగా నిలబడడం, ప్రచారం చేయడం ఆనవాయితీగా ఓల్డ్ సిటీలో ఆనవాయితీగా మారిందనే ఆరోపణలు వస్తున్నాయి. టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల మధ్యనున్న కనిపించని పొత్తు బంధంతో నాయకులు నష్టపోతున్నారనే చర్చ టీఆర్ఎస్ లో జరుగుతోంది. పార్టీ పెద్దల వ్యూహం తెలియక బరిలో ఉంటున్న అభ్యర్థులు.. లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకుని బలవుతున్నారని చెబుతున్నారు. పార్టీ సహకరిస్తే పాతబస్తిలోనూ గెలిచే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. 2016 ఎన్నికల్లో ముఖ్య నేతలెవరు ప్రచారం చేయకున్నా టీఆర్ఎస్ కు నాలుగు సీట్లు వచ్చాయి. కొన్ని డివిజన్లలో ఎంఐఎం, టీఆర్ఎస్ మధ్య హోరాహోరీగా పోరు జరిగింది. జాంబాగ్ లో కారు పార్టీ అభ్యర్థి కేవలం ఐదు ఓట్ల తేడాతో ఎంఐఎం క్యాండిడేట్ చేతిలో ఓడిపోయారు. దీంతో టీఆర్ఎస్ పెద్దలు కొంత సీరియస్ గా ప్రచారం చేస్తే పాతబస్తిలో మరికొన్ని డివిజన్లు గెలిచే అవకాశం ఉండేదనే చర్చ అప్పుడు జరిగింది. ఈ అర్థంకాని బంధంతో గులాబీ పార్టీ అభ్యర్థులు, కిందిస్థాయి నాయకులు, కార్యకర్తలు కష్టాల పాలవుతున్నారనే చర్చ ప్రస్తుతం గ్రేటర్ ఎన్నికల సందర్భంగా మరోసారి జోరందుకుంది.