ఏకంగా 87 మంది వైసీపీ ఎమ్మెల్యేల పై ప్రజల్లో ఆగ్రహం.. తాజా సర్వేలో షాకింగ్ రిపోర్ట్
posted on Nov 21, 2020 2:14PM
ఏపీలో 2019 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ 151 సీట్లు సాధించి ఘన విజయం సాధించిన సంగతి తెల్సిందే. అయితే ఈ విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ కష్టం కూడా చాలా ఉంది. దాదాపు మూడు వేల కిలోమీటర్లకు పైగా జగన్ చేసిన పాదయాత్రలో అటు సామాన్యుల సాధకబాధకాలు వింటూ వారికి భరోసా ఇస్తూ.. మరో పక్క ప్రశాంత్ కిషోర్ టీమ్ తో కలిసి పని చేసిన అయన తన కష్టానికి తగ్గ ఫలితం పొంది సీఎం గా బాధ్యతలు చేపట్టారు.
అయితే ఆ ఎన్నికలలో ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరు అనేది కూడా చూడకుండా కేవలం జగన్ ను చూసి జనం ఓట్లు వేశారని ప్రచారం జరిగింది. దీంతో ఎమ్మెల్యే పోస్టుకు అర్హత ఉన్నా లేకపోయినా జగన్ గాలిలో చాలామంది గెలిచారని కూడా వైసిపి వర్గాలు చెపుతాయి. ఇలా గెలిచిన ఎమ్మెల్యేలు మాత్రం ప్రజలకు అందుబాటులో ఉండకుండా.. కేవలం తమ పనులు చక్కబెట్టుకోవడంలో బిజీ అయిపోయారని విమర్శలు వస్తున్నాయి. ఎన్నికలలో తాము ఖర్చు చేసిన సొమ్ము తిరిగి సంపాదించుకునే పనులలో మునిగిపోయి కొంతమంది ప్రజలను పట్టించుకోవడం లేదని.. మరి కొంత మంది సొంత పార్టీ లోకల్ నాయకులను కూడా పట్టించుకొకుండా పూర్తిగా దందాలలో మునిగి తేలుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తాజాగా ఒక సర్వే సంస్థ ఏపీలో ఒక సర్వేను కండక్ట్ చేసిందని.. అమరావతిలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ సర్వేలో దాదాపు 87మంది వైసీపీ ఎమ్మెల్యేల మీద ప్రజలలో పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉందని సమాచారం. ఈ సర్వే ప్రకారం కొన్ని నియోజకవర్గాల్లో మీ ఎమ్మెల్యే ఎవరు అంటే కూడా జనం గుర్తు పట్టే పరిష్టితి లేదని సమాచారం. ఇక ఈ ఎమ్మెల్యేల తోపాటు చాలా మంది మంత్రుల మీద కూడా ప్రజలలో వ్యతిరేకత బాగానే ఉందని.. ఆ సర్వే సంస్థ తేల్చిందని వార్తలు వస్తున్నాయి. దీంతో సీఎం ఎంత కష్టపడ్డా.. ప్రతిపక్షాలతో పనిలేకుండా.. వైసీపీ పుట్టి ముంచేది మాత్రం ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులే అని ఆ సర్వేలో తేలిందట. ఈ సర్వే నేపథ్యంలో.. సీఎం జగన్ తన పార్టీని ఎలా కాపాడుకుంటారో చూడాలి.