పిల్లలతో ఇలాంటి మాటలు మాట్లాడకండి.. వారి ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది..!
posted on Nov 25, 2025 1:51PM

ఆత్మవిశ్వాసం అనేది అన్ని వయసుల వారికి ఎంతో ముఖ్యం. ఇది జీవితం మెరుగ్గా మలుచుకోవడంలో, ఏదైనా ఒక పనిని చేయడానికి ధైర్యాన్ని ఇవ్వడంలో సహాయపడుతుంది. ఆత్మవిశ్వాసం లేకపోతే ఎంత సులువైన పని అయినా సరిగా చేయలేరు. ఎంత తెలివైన వారైనా సరే.. ఆత్మవిశ్వాసం లేకపోతే ఆ తెలివి తేటలు మొత్తం వ్యర్థమే.. ఇక చిన్న పిల్లల విషయంలో ఇది మరీ ముఖ్యం. ఎందుకంటే పిల్లలు చిన్నతనం నుండి మెరుగ్గా ఎదగాలంటే వారిలో ఆత్మవిశ్వాసం కూడా మెండుగా ఉండాలి. పిల్లలో ఆత్మవిశ్వాసం అనేది తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు,స్నేహితులు.. ఇలా అందరి ద్వారా డవలప్ అవుతూ ఉంటుంది. కానీ తల్లిదండ్రులు తమ పిల్లలతో మాట్లాడే కొన్ని మాటల వల్ల వారిలో ఆత్మవిశ్వాసం దెబ్బతినేలా చేస్తుంది. ఇది కాస్తా వారి భవిష్యత్తుకు చాలా పెద్ద సమస్యగా మారుతుంది. ఇంతకీ తల్లిదండ్రులు తమ పిల్లలతో మాట్లాడకూడని విషయాలేంటో తెలుసుకుంటే..
పోలిక..
చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల ప్రతిభను, పిల్లల పనితీరును ఇతర పిల్లలతో పోల్చి చూస్తారు. అలా పోల్చి చూసిన విషయాన్ని నేరుగా తమ పిల్లలతోనే చెబుతారు. నీకు తక్కువ మార్కులు వచ్చాయి. కానీ నీ ఫ్రెండ్ కు బాగా వచ్చాయి, నువ్వు చెప్పిన పని చేయవు, కానీ మీ బాబాయ్ కొడుకు తల్లిదండ్రుల మాట చెప్పినట్టు వెంటాడు.. ఇలా ప్రతి విషయంలో పిల్లలను తమ కంట్రోల్ లో పెట్టుకోవడానికో లేదా పిల్లల ప్రతిభను గుర్తు చేయడానికో ఇతర పిల్లలతో పోల్చి మాట్లాడటం చేస్తుంటారు. కానీ ఇలా చేస్తే పిల్లల ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. తాము అసమర్తులం అనే అపోహలో పడిపోయి తమలో ఉన్న కాసింత ప్రతిభను కూడా మరుగుపరుచుకుంటారు.
పట్టించుకోకపోవడం..
కొందరు తల్లిదండ్రులకు తమ పిల్లలకు ఏం కావాలో తమకే బాగా తెలుసు అని అనుకుంటారు. దీని వల్ల తమ పిల్లలు ఏదైనా అడిగినా, వారు ఏదైనా సమస్య చెప్పుకున్నా.. దాన్ని తమ మనస్తత్వంతో ఆలోచించి పిల్లల బావాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరు. దీనివల్ల పిల్లలు ఏమీ తెలియని వాళ్లలా పెరుగుతారు. ప్రతి దానికి తల్లిదండ్రుల వైపు చూసే పరిస్థితి ఏర్పడుతుంది.
అసంతృప్తి..
పిల్లలు ఏదైనా పని చేసినా, ఏదైనా నేర్చుకోవడానికి లేదా పోటీలలో పాల్గొనడం, లేదా పరీక్షలు, చదువు ఇలా పిల్లలు చేసే ప్రతి విషయంలో తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తుంటారు. వారి నుండి ఏ చిన్న అబినందన కూడా పిల్లలకు లభించకపోవడంతో తాము ఏం చేసినా, ఏం సాధించినా తల్లిదండ్రులు మెచ్చుకోరు అనే అబిప్రాయంలోకి వెళ్లిపోయి తమ ఎదుగుదలను తామే ఆపేసుకుంటారు. అందుకే తల్లిదండ్రులు ప్రతి విషయానికి పిల్లల మీద అసంతృప్తి చూపించకూడదు.
పిల్లల పని..
కొందరు తల్లిదండ్రులకు పిల్లలు కష్టపడుతుంటే చూసి భరించలేనట్టు ఉంటారు. పిల్లలను అతిగా గారాబం, అతి ప్రేమ చూపించడం వల్ల వచ్చే సమస్య ఇది. పిల్లల పనులన్నీ తల్లిదండ్రులే చేసి పెట్టడం వల్ల పిల్లలు చేతకానివాళ్లుగా తయారవుతారు. ఇది వారికి భవిష్యత్తులో పెద్ద ఆటంకంగా మారుతుంది.
*రూపశ్రీ.