మానసిక స్థితిని మెరుగ్గా ఉంచే అలవాట్లు ఇవి..!
posted on Nov 21, 2025 3:11PM

ప్రతి మనిషి రెండు రకాల ఆరోగ్యాల గురించి ఆలోచించాలి. ఒకటి శారీరక ఆరోగ్యమైతే.. రెండవది మానసిక ఆరోగ్యం. శారీరక ఆరోగ్యం గురించి చాలామంది ఆలోచన చేస్తారు. మంచి శారీక ఆరోగ్యం కోసం చాలా రకాల టిప్స్ ఇంకా మంచి జీవనశైలి పాటించడానికి కూడా ప్రయత్నం చేస్తారు. కానీ మానసిక ఆరోగ్యం గురించి ఆలోచించే వారు చాలా తక్కువ. మరీ ముఖ్యంగా.. ఉద్యోగాలు, వ్యాపారాల కోసం మెదడు మీదే ఎక్కువ ఒత్తిడి పెడుతున్న నేటి కాలంలో మానసిక స్థితి మెరుగ్గా ఉండాలంటే కొన్ని అలవాట్లు చక్కగా సహాయపడతాయి. అవేంటో తెలుసుకుంటే..
మానసిక స్థితిని మెరుగ్గా ఉంచే అలవాట్లు..
కృతజ్ఞత కలిగి ఉండాలి..
కృతజ్ఞత అనేది మనిషిని చాలా పాజిటివ్ గా ఉంచుతుంది. బయట ఏవో విషయాల పట్ల కృతజ్ఞత కలిగి ఉండటం అవసరమే లేదు. కనీసం ప్రతి రోజూ.. రోజు మొత్తంలో జరిగిన విషయాలలో మంచి విషయాలను గుర్తు చేసుకుంటూ, రోజులో మంచి జరిగినందుకు కృతజ్ఞతగా సంతోషంగా, తృప్తిగా ఉండటం నేర్చుకోవాలి. ఈ ఒక్క అలవాటు ప్రతి రోజూ చాలా పాజిటివ్ గా ఉండేలా చేస్తుంది.
వ్యాయామం..
ప్రతిరోజూ 20 నుండి 30 నిమిషాలు పాటు శారీరక వ్యాయామం చేయాలి. వ్యాయామం చేయలేకపోతే కనీసం స్ట్రెచింగ్ వర్కౌట్లు అయినా చేయాలి. శరీరం ఎప్పుడైతే చురుగ్గా ఉంటుందో అప్పుడు మానసికంగా మెరుగ్గా ఉండటం సాధ్యమవుతుంది. వ్యాయామం వల్ల ఎండార్ఫిన్లు విడుదలై ఒత్తిడి తగ్గుతుంది.
శ్వాస వ్యాయామాలు..
శరీరాన్ని చురుగ్గా ఉంచడానికి వ్యాయామాలు ఎలా అవసరమో.. మానసిక స్థితిని చురుగ్గా ఉంచడానికి లోతైన శ్వాస వ్యాయామాలు అంతే అవసరం. ప్రతి రోజూ లోతుగా శ్వాస తీసుకుంటూ కొన్ని నిమిషాలు శ్వాస వ్యాయామాలు చేయడం వల్ల ఒత్తిడి తగ్గి, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.
మైండ్ ఫుల్ నెస్..
మైండ్ ఫుల్ నెస్ అనేది మనసు పెట్టి పని చేయడాన్ని ప్రోత్సహిస్తుంది. ఆహారం తింటున్నా, వ్యాయామం చేస్తున్నా, ధ్యానం చేస్తున్నా, పని చేస్తున్నా.. కేవలం ఆ పని మీద మాత్రమే ఏకాగ్రత పెట్టడం వల్ల మానసికంగా మెరుగ్గా ఉండవచ్చు.
ప్రకృతితో సమయం..
ఎప్పుడూ ఇల్లు, ఆఫీసు అంటూ గడపడం కాదు.. బయట ప్రకృతితో సమయం గడపాలి. చెట్లు, మొక్కలు, పువ్వులు, పక్షులు, జంతులు, సూర్యకాంతి, వాతావరణం.. ఇవన్నీ సెరోటోనిన్ స్థాయిలను పెంచుతుంది. మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.
బంధాలు బలంగా..
మనిషి మానసిక స్థితిని బలంగా ఉంచడంలో సంబంధాలు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. మన వాళ్లు అనుకున్న వాళ్లతో ఏదైనా విభేదాలు వస్తే.. అవి మానసికంగా చాలా దెబ్బతీస్తాయి. కాబట్టి మానసికంగా బలంగా ఉండటానికి ఇష్టమైన వారు, ఆత్మీయులు, కుటుంబ సభ్యులు.. ఇలా అందరితో సమయం గడుపుతూ బంధాన్ని బలంగా ఉంచుకోవాలి.
నచ్చిన పని చేయడం..
నచ్చిన పని చేసినప్పుడు, నచ్చిన ఆహారం తిన్నప్పుడు, నచ్చినట్టు సమయం గడిపినప్పుడు లభించే తృప్తి చాలా మెరుగ్గా ఉంటుంది. అందుకే మానసిక స్థితిని మెరుగ్గా ఉంచుకోవడానికి స్వీయ తృప్తిని ఇచ్చే పనులు చేస్తుండాలి.
*రూపశ్రీ.