కేసీఆర్ క్యాంపు ఆఫీసుకి టులెట్ బోర్డు
posted on Mar 20, 2025 11:27AM
.webp)
మాజీ సీఎం కేసీఆర్‌కు తన సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో బీజేపీ, కాంగ్రెస్ శ్రేణులు షాకిచ్చాయి. గజ్వేల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి బీజేపీ నాయకులు బుధవారం (మార్చి 19) టులెట్ బోర్డు పెట్టారు. గజ్వేల్ ఎమ్మెల్యే అయిన మాజీ సీఎం కేసీఆర్ నియోజకవర్గానికి రాకపోవడంపై వాంటెడ్ ఎమ్మెల్యే అంటూ నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలిచి 15 నెలలైనా కేసీఆర్ ఒక్కసారి కూడా గజ్వేల్ వైపు చూడలేదని బీజేపీ శ్రేణులు ఈ సందర్భంగా అన్నారు. ప్రజలకు వద్దకు రాని కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
మరోపక్క, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ కనబడటం లేదంటూ గజ్వేల్, గౌరారం పోలీసుస్టేషన్లలో యూత్ కాంగ్రెస్ నేతలు వేర్వేరుగా ఫిర్యాదులు చేశారు. కాగా, బీజేపీ నేతల నిరసనపై గజ్వేల్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి ఫైరయ్యారు. అల్లరిమూకలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం తాళాలు పగలుగొట్టి కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశాయంటూ గజ్వేల్ పోలీస్ స్టేషన్‌లో బీజేపీ నాయకులపై ఫిర్యాదు చేశారు.
గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నలు వేసి ఎక్కడ ఇరుకున పెడతారోనని వారు భయపడేవారు. కానీ నేడు దానికి భిన్నంగా అధికారపక్షమే ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రావాలని కోరుతున్నా కేసీఆర్ ముఖం చాటేస్తున్నారు. ముఖ్యమైన బిల్లులు అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు సైతం కేసీఆర్ అసెంబ్లీకి రావటానికి విముఖత చూపుతున్నారు. గత సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు అసెంబ్లీకి చుట్టపుచూపుగా వచ్చి కాసేపు అసెంబ్లీలో కూర్చొని వెళ్లిపోయారు. అసెంబ్లీకి రావటం లేదు కానీ జీతభత్యాలు మాత్రం ఠంచన్‌గా తీసుకుంటున్నారు.