కార్బన్ మోనాక్సైడ్ పీల్చి ముగ్గురు హైదరాబాదీల మృత్యువాత 

కార్బన్ మోనాక్సైడ్  అత్యంత హానికరం .ఇది రక్తంలోని హిమోగ్లోబిన్‌తో బంధిస్తుంది, ఆక్సిజన్‌ను తీసుకువెళ్లే రక్తం సామర్థ్యాన్ని తగ్గిస్తుంది . ఇది శరీర అవయవాలకు ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం కలిగిస్తుంది. కార్బన్ మోనాక్సైడ్  ప్రభావం వల్ల  అలసట, తలనొప్పి, గందరగోళం,  తల తిరగడం వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఒక్కోసారి మరణించవచ్చు. సరిగ్గా ఇవే లక్షణాలతో హైదరాబాద్ కు చెందిన ముగ్గురు మృత్యువాత పడ్డారు. 
హైదరాబాద్‌ సనత్‌నగర్‌లోని జెక్ కాలనీలో ఆదివారం ఓ అపార్ట్‌మెంట్ బాత్రూంలో ముగ్గురు అనుమానాస్పద స్థితిలో మరణించిన ఘటనలో మిస్టరీ వీడింది. సిగ్నోడ్ ట్రాన్సిస్ట్ ప్యాకింగ్ సొల్యూషన్స్ సంస్థలో బిజినెస్ హెడ్‌గా పనిచేస్తున్న ఆర్. వెంకటేశ్ (59), ఆయన భార్య మాధవి (52), కుమారుడు హరికృష్ణ (25) ఇక్కడి ఆకృతి ప్రెసిడెన్సీ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు. ఆదివారం వీరు ముగ్గురు బాత్రూములో విగతజీవులుగా కనిపించారు. వీరిలో హరికృష్ణ మానసిక స్థితి సరిగా లేదు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా, వీరి మృతి విషయంలో మిస్టరీ వీడింది. విషవాయువు అయిన కార్బన్ మోనాక్సైడ్‌ను పీల్చడం వల్లే వారు మృతి చెంది ఉంటారని వైద్యుల ప్రాథమిక నిర్థారణలో తేలినట్టు పోలీసులు తెలిపారు. గీజర్ నుంచి విడుదలైన కార్బన్ మోనాక్సైడ్‌ను పీల్చడంతో ముగ్గురూ స్పృహతప్పి, ఆపై క్షణాల్లోనే మరణించినట్టు నిర్ధారణకు వచ్చారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu