అమెరికా జగనన్నపై మరోసారి హత్యాయత్నం!

మన ఆంధ్రాలో జగనన్న తరహాలోనే అమెరికాలో కూడా ఒక పెద్దమనిషి వున్నాడు. ఆయన పేరు అమెరికా జగనన్న అలియాస్ డొనాల్డ్ ట్రంప్. ఈయన గతంలో ఒకసారి అమెరికా అధ్యక్షుడిగా పనిచేశాడు. రెండోసారి కూడా అమెరికా అధ్యక్షుడు అవ్వాలని అనుకున్నాడు. అయితే ఫెయిలయ్యాడు. ఇప్పుడు మరోసారి అధ్యక్షుడు అవ్వాలన్న ఉద్దేశంతో ఎన్నికల బరిలో నిలిచాడు. అయితే వెరైటీ ఏంటంటే, డోనాల్డ్ ట్రంప్ మీద కూడా మన జగనన్న మీద జరిగినట్టే హత్యాయత్నాల మీద హత్యాయత్నాలు జరుగుతున్నాయి. ఆమధ్య ఆయన ఎన్నికల ప్రచారంలో వున్నప్పుడు థామస్ మాథ్యూ క్రూక్ అనే ఒక వ్యక్తి ట్రంప్ మీద హత్యాయత్నం చేశాడు. ఆ మిస్టర్ క్రూక్ షార్ప్ షూటర్ కానట్టుంది.. బుల్లెట్ ట్రంప్ చెవిని రాసుకుంటూ వెళ్ళింది. ఆ షూట్ చేసిన వ్యక్తిని పోలీసులు కాల్చి చంపేశారు. తన మీద ఈ హత్యాయత్నం అధికార పార్టీయే చేయించింది అని ట్రంప్ గగ్గోలు పెట్టారు. అయితే, ఆయన గగ్గోలుని ఎవరూ పట్టించుకోలేదు. ఇదంతా ఎలక్షన్లలో సానుభూతి పొందడం కోసం ట్రంప్ ఆడుతున్న డ్రామాగా చాలామంది అమెరికన్లు బాహాటంగానే విమర్శించారు. 

మొన్నామధ్య ట్రంప్ ఫ్లోరిడాలో గోల్ఫ్ ఆడుతూ వుండగా ఒక వ్యక్తి ట్రంప్‌ని  హత్య చేయడానికి ఒక వ్యక్తి ప్రయత్నించాడని, తుపాకీ తీసుకుని ట్రప్ దగ్గరకి రాబోతూ వుండగా భద్రతాదళాలు అతన్ని పట్టుకున్నాయని వార్తలు వచ్చాయి. దీన్ని కూడా అమెరికా జనం లైట్‌గా తీసుకున్నారు. బుల్లెట్ చెవిని రాసుకుని వెళ్ళినప్పుడే జనం పట్టించుకోలేదు. ఇప్పుడు రెక్కీ జరిగిందని అంటే పట్టించుకుంటారా? ఇప్పుడు మరోసారి అంటే, ముచ్చటగా మూడోసారి ట్రంప్‌ని హత్యచేసే ప్రయత్నం జరిగిందని వార్తలు వస్తున్నాయి. ఇటీవల కాలిఫోర్నియాలోని కోచెల్లా ప్రాంతంలో ట్రంప్ ర్యాలీ నిర్వహించిన సమయంలో వేం మిల్లర్ అనే వ్యక్తి రెండు తుపాకులు జేబుల్లో పెట్టుకుని తిరిగాడని, దీనికి సంబంధించిన సమాచారం అందుకున్న వెంటనే అతన్ని అరెస్టు చేశామని పోలీసులు చెబుతున్నారు. ఏంటో... ఇలా ఎలక్షన్‌ టైమ్‌లో వరుసగా జరుగుతున్న ఈ హత్యాయత్నాలు చూస్తుంటే మనకి మన జగనన్నే గుర్తొస్తూ వుంటాడు.