సాయిబాబా మృతదేహం గాంధీ హాస్పిటల్ కు అప్పగింత 

ప్రొఫెసర్ సాయిబాబా మృత దేహం రీసెర్చి పర్పస్ గాంధీ హాస్పిటల్ కు అప్పగించారు. గత శనివారం చనిపోయిన సాయిబాబా  మృత దేహాన్ని అభిమానుల సందర్శనార్ధం మౌలాలిలోని నివాసంలో  ఉంచారు. సోమవారం ఆయన భౌతికకాయాన్ని గాంధీకి  ఇచ్చేశారు. 
మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో 2014లో సాయిబాబాను పోలీసులు అరెస్టు చేశారు. 2017లో ఆయనకు గడ్చిరోలి సెషన్స్‌ కోర్టు జీవితఖైదు విధించింది. దీంతో దాదాపు తొమ్మిదేళ్లపాటు జైల్లోనే గడపాల్సి వచ్చింది. నేరం రుజువు కానప్పటికీ  జైలులో  కఠిన కారాగార శిక్ష అనుభవించారు. ఆ సమయంలో అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు సాయిబాబా. అయితే ఈ ఏడాది మార్చి 5న బాంబే హైకోర్టు సాయిబాబాను నిర్దోషిగా ప్రకటించింది. దీంతో నాగ్‌పూర్‌ జైలు నుంచి విడుదలయ్యారు. అనారోగ్య సమస్యలు ఆయనను వెంటాడటంతో అంతర్గత రక్త స్రావమై  సాయిబాబా  చనిపోయారు. 
 ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురంకు చెందిన సాయిబాబా తెలంగాణ ఉద్యమం, ఆదివాసుల హక్కుల కోసం శ్రమించారు.   1967లో జన్మించిన సాయిబాబాకు  పోలియో సోకి చిన్న వయసులోనే రెండు కాళ్లు పూర్తిగా చచ్చుపడిపోయాయి. ఢిల్లీ యూనివర్సిటీలో సాయిబాబా ఇంగ్లీష్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. సాయిబాబా అరెస్టు నేపథ్యంలో 2014లో ఆయనను ఢిల్లీ యూనివర్సిటీ సస్పెండ్‌ చేసింది.  సాయిబాబా రెండు కళ్లను ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్ కు అప్పగించిన కుటుంబసభ్యులు వైద్య విద్యార్థుల రీసెర్చిపర్పస్ గాంధీ హాస్పటల్ కు అప్పగించారు.