సామాజిక రుగ్మతల నివారణకు బుద్ధుని బోధనలే శరణ్యం.. గుత్తా!

సామాజిక రుగ్మతల నివారణకు బుద్ధుని బోధనలు ఒకటే శరణ్యమని తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. బుద్ధ వనoలో ధమ్మ  విజయం వేడుకలలో భాగంగా ముందుగా బుద్ధ చరిత వనములోని బుద్ధుని పాదాల వద్ద   పుష్పాంజలి ఘటించారు. అనంతరం నాగార్జునసాగర్ లో తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ నిర్మించిన బుద్ధవనం లో సామ్రాట్ అశోక చక్రవర్తి బౌద్ధ ధమ్మాని స్వీకరించిన రోజు, డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ బౌద్ధ ధమ్మ దీక్ష తీసుకున్న రోజు అయిన అక్టోబర్ 14 సోమవారం నాడు నిర్వహించిన ధమ్మ విజయం వేడుకలలో ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ స్వార్థం మితిమీరి అత్యాశ తారా స్థాయికి చేరి అతలాకుతులమైన ప్రస్తుత సమాజంలో బుద్ధుని పంచశీల పాటిస్తే యుద్ధాలకు తావే లేదన్నారు. అనంతరం శాసనమండలి సభ్యులు మంకెన కోటిరెడ్డి మాట్లాడుతూ ఇక్ష్వాకుల కాలంలో నాగార్జున కొండలో విలసిల్లిన బౌద్ధాన్ని ప్రస్తావిస్తూ బుద్ధ వనం రాబోయే రోజులలో అంతర్జాతీయ బౌద్ధ పర్యాటక కేంద్రంగా మారనుందన్నారు. తెలంగాణ రాష్ట్ర పర్యాటక సంస్థ చైర్మన్  పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ అన్ని  హంగులతో సిద్ధమైన బుద్ధవనం రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవతో ఆసియాలోనే అరుదైన బౌద్ధ వారసత్వ థీమ్ పార్కుగా గుర్తింపు పొందనున్నట్లుగా తెలిపారు. మోక్షానందా బుద్ధ విహార అధ్యక్షులు ధర్మ రక్షిత బౌద్ధ దమ్మ విజయాల గురించి వివరించగా, లతా రాజా ఫౌండేషన్ సలహాదారులు పిఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ దమ్మ దీక్ష తీసుకున్న నేపథ్యం గురించి వివరించారు. అటుపిమ్మట మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ మాట్లాడుతూ రాబోయే రోజులలో బుద్ధ వనం ప్రత్యేక పర్యాటక స్థావరం అవుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మరియు బుద్ధ వనం ప్రత్యేక అధికారి ఎన్ ప్రకాష్ రెడ్డి   మాట్లాడుతూ ధమ్మ విజయం, ధమ్మ దీక్షోత్సవాలు పర్యాటక ప్రాధాన్యత కలిగి ఈ తరానికి బౌద్ధం పట్ల అవగాహన కల్పించడానికి తోడ్పడతాయన్నారు. బుద్ధ వనం లోని ధమ్మ విజయం వేడుకలలో ఒగ్గు నృత్య కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి .ఈ కార్యక్రమంలో బుద్ధవనం అధికారులు  సుధన్ రెడ్డి, ఈమని శివనాగిరెడ్డి, సూర్య ప్రకాష్ రావు, శ్యామ్ సుందర్ రావు ,మహేంద్ర హిల్స్ లోని మహాబోధి బుద్ధ విహార, మైసూర్ బైలా కుప్పే లోని మహా బోధి విహార నుండి బద్ద భిక్షువులు, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం, ఇంగ్లీష్ మరియు ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (కంది) 60 మంది దక్షిణ దేశాల విద్యార్థులు, బుద్దిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా సభ్యులు అధిక సంఖ్యలో  పాల్గొన్నారు