డీకే అరుణ ఇంట్లోకి జొరబడిన అగంతకుడి అరెస్టు.. దొంగేనని నిర్థారణ
posted on Mar 19, 2025 11:21AM
.webp)
జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్56లోని డికె అరుణ నివాసంలోకి ఆదివారం తెల్లవారుజామున ఆగంతకుడు చొరబడిన సంఘటన సంచలనం సృష్ఠించిన సంగతి తెలిసిందే. కిచెన్ వైపు ఉన్న కిటికీ గ్రిల్స్ తొలగించి లోపలికి ప్రవేశించాడు. చేతులకు గ్లాజ్లు, ముఖానికి మాస్క్ వేసుకుని లోపలికి వెళ్లగానే హాల్లో ఉన్న సీసీ కెమెరాల వైర్‌ను కట్ చేశాడు. తర్వాత ఎంపి అరుణ బెడ్రూం వరకు వెళ్లి అక్కడ కూడా సీసీ కెమెరా వైర్‌ను కట్ చేశాడు. గంటన్నర పాటు ఇల్లంతా కలియదిరిగాడు. ఆ సమయంలో డీకే అరుణ మహబూబ్‌నగర్‌లో ఉన్నారు. ఇంట్లో ఆమె కూతురుతో పాటు పని మనుషులు మాత్రమే ఉన్నారు.
ఘటనపై ఎంపీ డీకే అరుణ ఆందోళన వ్యక్తంచేశారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి వెంటనే నిందితుడిని పట్టుకోవాలని పోలీసులను ఆదేశించాడు. దీంతో పోలీసులు విషయాన్ని సీరియస్ గా తీసుకుని గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు జూబ్లీహిల్స్ పోలీసులు ఆ దొంగను మంగళవారం (మార్చి 18) అరెస్టు చేశారు. విచారణలో ఆ దొంగ పేరు అక్రమ్ అనీ, ఉత్తరాఖండ్ కు చెందిన అతడు ఢిల్లీలో పలు చోరీలకు పాల్పడి పలుమార్లు అరెస్టయ్యాడనీ తేలింది. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చి తలాబ్ కట్టలో నివాసం ఉంటున్నాడు. ధనికుల ఇళ్లను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడే అక్రమ్.. నగదు తప్ప బంగారం, ఇతర విలువైన వస్తువల జోలికి వెళ్లడు. ఈ నేపథ్యంలోనే చోరీ కోసం డీకే అరుణ నివాసంలోకి ప్రవేశించిన అక్రమ్ కు అక్కడ నగదు దొరక లేదు. దాదాపు గంటన్నర పాటు ఇంట్లో కలియదిరిగి కూడా ఏమీ చోరీ చేయకుండా వెళ్లిపోవడంతో అసలా అగంతకుడు ఎందుకు వచ్చాడన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. డీకే అరుణ అయితే భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. చివరికి నగదు తప్ప ఏమీ దొంగతనం చేయకపోవడం అతని ప్రత్యేకత అని తేలింది.