మనిషికి తృప్తి కావాలంటే ఇలా జీవించాలి..

ప్రతి మనిషి తన జీవితం ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటాడు. అయితే కోరుకున్నంత సులభంగా అలాంటి జీవితం లభించదు. నిజానికి ప్రశాంతమైన జీవితం వేరు, సుఖాల మయమైన జీవితం వేరు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి ముందు. ప్రశాంతమయమైన జీవితం కావాలి అంటే…  ప్రతి నిముషంలోని ఆనందాన్నీ, సంతృప్తినీ వెలికి తీయగల గని కార్మికుడి లాగా పని చేయాలి. మనం ఎంత సాధించినా, ఎంత డబ్బునూ, ఆస్తుల్నీ సంపాదించినా చివరికి మన వెనకున్న ఎవరికో ఒకరికి సర్వం సమర్పించి అంతా వదలి వెళ్ళాలన్న సాధారణ సత్యాన్ని ఆకళింపు చేసుకోవాలి. అదే విషయాన్ని పదే పదే గుర్తు చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు నిజంగా మనం సంతృప్తికరంగా జీవించగలమా అంటే అవును  జీవించగలం. 

కొంతమంది ఏమి చేస్తారంటే… ఎదుటి వాళ్ళు కార్లు, బంగాళాలు కొంటూ విలాసవంతంగా బ్రతుకుతూ ఉంటే వాళ్ళు ఎంత గొప్పగా బ్రతుకుతున్నారు అని అంటారు. కానీ ఎలాంటి గొడవలు, చింతలు లేకుండా హాయిగా ఉన్నవారే నిజమైన గొప్ప జీవితం కలిగి ఉన్నవారు అనే విషయాన్ని గ్రహించాలి.  మరికొందరు గొప్పగా బ్రతకడం అంటే అది అదృష్టం వలన లభించేది అని అనుకుంటారు. కానీ అది అదృష్టం వల్ల దొరికేది కాదు. అది మనకు మనంగా ఎంచుకొనే తెలివైన ఎంపిక. 

ఇలాంటి ఎంపిక ఎలా సాధ్యం అని ప్రశ్నించుకుంటే.. మనం ఆలోచించడం మొదలు పెట్టాలి ముందు.  ఈ రోజున మనకు తెల్సిన పరిస్థితుల మధ్య, మనం అనుభవిస్తున్న పరిస్థితుల మధ్య, మనం సిద్ధంగా ఉన్న అవకాశం లభించినప్పుడు ఆనందంగా గడపగలమో..... లేక మనకు తెలియని రేపటి పరిస్థితుల మధ్య, మనం చూడలేని పరిస్థితులలో ఆనందంగా గడపగలమో నిర్ణయించుకోవాలి. 

 భవిష్యత్తు అనేది కేవలం మనం మన ఊహల్లో నిర్మించుకొనే ఒక సామ్రాజ్యం. ఈ వాస్తవమైన ఈ రోజుని ఆనందంగా జీవించలేనపుడు.. రేపటి రోజున ఎలా ఆనందంగా జీవించగలం? కాలం మన మృత్యువునీ ఎన్నటికీ వాయిదా వెయ్యదు, అది దానికి సమయం వచ్చినప్పుడు అట్లా మనల్ని తీసుకుని వెళ్లిపోతుంది. అలాంటప్పుడు మన ఆనందపు సమయాన్ని మాత్రం మనం ఎందుకు వాయిదా వెయ్యడం. మనకు దొరికిన గొప్పవరం ఏదైనా ఉందంటే అది ఈరోజే.., ఇది మళ్ళీరాని అవకాశం, ఈ రోజున మనం అనుభవించిన సంతోషాలూ, గడిపిన క్షణాలు మళ్ళీ అదే విధంగా మరో రోజు ఉండకపోవచ్చు. 

 ఒక వేళ మన ఆయుష్షు లక్ష రోజులైతే... అది ఖచ్చితంగా ప్రతి రోజూ ఓ విలక్షణమైన పుస్తకం లాంటింది.  ఏ పుస్తకమూ మరో పుస్తకంలా ఉండదు. అలాగే  మన అద్భుతమైన రోజు భవిష్యత్తులో మరో రోజు పునరావృతం కాదు. ప్రతి రోజు ఓ సరిక్రొత్త అనుభవం. అందుకే ఏ సరిక్రొత్త అనుభవాన్ని వదులుకోకూడదు. బోటన వ్రేలి గుర్తులు ప్రపంచంలో ఏ ఇద్దరికీ ఒకేలా ఉండవో అలాగే మన జీవితకాలంలోని ఏ రెండు రోజులూ ఒకేలా వుండవు. సరిక్రొత్త విశేష విజయాలను, అవకాశాలను ఈ రోజే సృష్టించుకోవాలి.  మరో రోజును వేరొక అవకాశాన్ని సృష్టించుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. మనం గతంలో జరిగిన సంఘటనలనీ, భవిష్యత్తులో ఎలా ఉండాలి అనే ఆలోచనలతో, నిన్నటినీ, రేపటినీ కలిపి ఈ రోజు జీవించడానికి ప్రయత్నిస్తుంటాం. నిన్నటి పాత జీవితాన్ని మళ్ళీ నేడు బ్రతకడం ఎందుకు, వస్తుందో రాదో తెలియని రేపటిని ఈ రోజే జీవించాలన్న తపన ఎందుకు కేవలం నేటిని ప్రశాంతంగా జీవిస్తేచాలాదా!

                                    ◆నిశ్శబ్ద.