పాజిటివ్ థింకింగ్ పవర్ ఇదే..
posted on Sep 13, 2023 11:23AM
సానుకూలంగా ఆలోచించడం చాలామందికి చేతకాదు. ఎంతోమంది పనులు మొదలు పెట్టడం నుండి ఒకటే అనుమానాలు, సందేహాలు వ్యక్తం చేస్తుంటారు. అయితే సానుకూలంగా ఉండటం లేదా పాజిటివ్ ఆలోచనలతో ఉండటం అనేది మనిషిని కొత్తగా ఆవిష్కరిస్తుంది. కౌరవుల సైన్యం చాలా పెద్దది మేము అస్సలు యుద్దం చెయ్యము అని పాండవులు వెనకడుగు వేసి ఉంటే మహాభారత యుద్దమనేది జరిగి ఉండేది కాదు. నాకు కాళ్లు చేతులు చచ్చుబడిపోయాయి, ఇక నేను ఏమీ చెయ్యలేను అనుకుని ఉంటే అంతరిక్షంలో రహస్యంగా ఉన్న కృష్ణబిళాల గురించి స్టీఫెన్ హకింగ్ పరిశోధనలు చేసేవాడు కాదు. ఇలా చరిత్రలో గొప్పగా నిలిచిపోయిన ఎన్నో సంఘటనలు, ఎన్నో విషయాలు అనుమానాలతో, సందేహాలతో అలా గొప్పగా మారలేదు. దీని వెనుక సానుకూల ఆలోచన అని చెప్పబడే పాజిటివ్ థింకింగ్ చాలా ఉంది. పాజిటివ్ థింకింగ్ గురించి, దాని గొప్పదనం గురించి, అది మనుషుల జీవితాల్లో కలిగించే మార్పుల గురించి తెలియజెప్పే ఉద్దేశంతో ప్రతి యేడు సెప్టెంబర్ 13న పాజిటివ్ థింకింగ్ డే జరుపుకుంటారు. ఈ రోజున ఏం చేయవచ్చో, దీన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో, దీని వల్ల కలిగే లాభాలేంటో పూర్తీగా తెలుసుకుంటే..
పాజిటివ్ థింకింగ్..
పాజిటివ్ థింకింగ్ అనే పేరులోనే ఒకానొక సానుకూల భావన ఉంది. ఇది మనిషికి ఎలాంటి ఒత్తిడిని, ఆందోళనను కలిగించదు. చేసేపని ఏదైనా సరే పాజిటివ్ గా ఆలోచించి చేస్తే ఆ ఆలోచనతోనే సగం విజయం సాధించినట్టు. పాజిటివ్ గా ఆలోచిస్తూ మనిషి చేసే ప్రయత్నాలలో మనిషి పనితీరు పరిపూర్ణంగా ఉంటుంది. వ్యక్తి తన పూర్తీ సామర్థ్యాన్ని పనిని పూర్తీ చేయడానికి ఉపయోగిస్తాడు. కాబట్టి చేసేపనులలో పాజిటివ్ థింకింగ్ అనేది చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది.
నిర్ణయాలు అందరూ తీసుకుంటారు. అయితే ఎవరో చెప్పారని కొందరు, ఆ పని వల్ల లాభం ఉంటుంది కాబట్టి చేయడం మంచిదని మరికొందరు, గొప్పలు చెప్పుకోవడానికి అయిష్టంగానే మరికొందరు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నా మనసులో ఏ మూలో ఇష్ఠం ఉండదు కాబట్టి ఆ పనిని అంత సమర్థవంతంగా పూర్తీ చెయ్యలేరు. కాబట్టి నిర్ణయాలు తీసుకునేముందు ఎలాంటి ప్రభావానికి, మరేవిధమైనా ప్రలోభాలకు లోను కాకుండా చూసుకోవాలి.
మానసిక ఆరోగ్యం..
పాజిటివ్ ఆలోచన అనేది గొప్ప ఔషదమే అనుకోవచ్చు. పెద్ద పెద్ద జబ్బులు ఉన్నవారు కూడా పాజిటివ్ థింకింగ్ కారణంగా వాటిని చాలా సులువుగా జయించగలుగుతారు. ఎంతో మంది మృత్యు ఒడి దాకా వెళ్లి తిరిగి బయటపడుతున్నారు అంటే అది వారి సానుకూల ఆలోచన ప్రభావమే. మనిషిని మానసికంగా ఒత్తిడికి లోనుకాకుండా దృఢంగా ఉండేలా చేయడంలో సానుకూల ఆలోచన ఎంతో గొప్పది. పాజిటివ్ గా ఉంటూ మంచినీరు తీసుకున్నా అది గొప్ప ఔషదంలా పనిచేస్తుంది. గొప్ప ఔషదాన్ని అయినా చాలా నెగిటివ్ గా తీసుకుంటే అది అస్సలు శరీరం మీద ప్రభావం చూపించదు. ఇదీ పాజిటివ్ ఆలోచనలో ఉన్న గొప్పదనం.
సానుకూలమే విజయానికి సోపానం..
ఎంత బాగా చదివినా సరే చాలామంది పరీక్ష హాలులో వెళ్లేసరికి అన్నీ మరచిపోయాం అంటుంటారు. మరికొంతమంది నేను చదివినవే వచ్చాయి కానీ అక్కడ సమాధానాలు గుర్తురాలేదు అంటారు. వీటన్నింటికి కారణం ఒకటే.. అదే పరీక్షలలో నేను చదివినవి రావేమో అనే నెగిటివ్ ఆలోచన. మనిషి మెదడు పదే పదే ఏ విషయాన్ని అయినా పదిసార్లు మననం చేసుకుంటే ఆ వలయంలో పడిపోతుంది. పరీక్షలు రాసేవారు ఎంత చదివినా, ఎంతబాగా సన్నద్దం అయినా మనసులో ఏ మూలో నేను చదివినవి రావేమో నా అదృష్ణం ఎలాగుందో అనుకుంటే చివరికి ఆ అదృష్టం ప్రశ్నార్థకమే అవుతుంది.
ఇది కేవలం పరీక్షలకు మాత్రమే కాదు. ఉద్యోగం కోసమయినా, బంధాలలో అయినా, సమాజ పరమైన విషయాలు అయినా పాజిటివ్ గా ఉన్నప్పుడే సానుకూల ఫలితాలు సాధ్యమవుతాయి.
*నిశ్శబ్ద.