తెలుగుదేశం ఆవిర్భావం ఒక సంచలనం.. ఒక ప్రభంజనం!

భారత రాజకీయాలలోనే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఒక సంచలనం. ఒక ప్రభంజనం.  రాజకీయాలలోనే సంక్షేమ పర్వానికి తెరతీసిన సందర్భం. దేశంలోనే ప్రాంతీయ పార్టీలకు ఒక మోడల్. ఒక ఆదర్శం. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ఎకఛత్రాధిపత్యానికి చరమగీతం. సరిగ్గా 43 ఏళ్ల కిందట ఇదే రోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది.  ఆవిర్భావమే ఒక ప్రభంజనం. ఆవిర్భవించిన 9 నెలలకే కాంగ్రెస్ ఆధిపత్యానికి గండి కొట్టి రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకుంది. అంతేనా వెనుకబడిన తరగతుల వారికి రాజకీయ సోపానంగా మారింది. ప్రజల దగ్గరకు రాజకీయాలను నడిపించింది. వారినే రాజకీయ నిర్ణేతలుగా మార్చింది. రాజకీయం అంటే ఆధిపత్యం కాదు.. ప్రజా సేవ అని చాటింది.  
తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావు ఆదర్శం, సందేశం ఆచరణ సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు అన్న సిద్థాంతానికి కట్టుబడి గత నాలుగు దశాబ్దాలకు పైగా రాష్ట్ర, దేశ రాజకీయాలలో అత్యంత క్రియాశీలంగా ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం మాత్రమే. 

అటువంటి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఉభయ తెలుగు రాష్ట్రాలలో  ఘనంగా జరుపుకుంటున్నాయి పార్టీ శ్రేణులు. ఒక తెలుగు రాష్ట్రాలలోనే కాదు.. తెలుగు వాళ్లు ఉన్న ప్రతి రాష్ట్రం, దేశంలో కూడా తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగువాడి ఆత్మగౌరవ నినాదంతో హైదరాబాద్ లో సరిగ్గా 43 ఏళ్ల కిందట ఇదే రోజు అంటే మార్చి 29న నందమూరి తారక రామారావు చేతుల మీదుగా పురుడుపోసుకున్న తెలుగుదేశం.. ఈ 43 ఏళ్లుగా తెలుగువాడి వాడివేడి సత్తా చాటుతూనే ఉంది. తెలుగుదేశం పార్టీతోనే రాజకీయ ప్రవేశం చేసిన ఎందరో నేతలు ప్రజాసేవలో ఒదిగి ఎదిగారు.  

43 ఏళ్ల ప్రస్థానంలో టీడీపీ ఎన్నో ఆటుపోట్లను చవిచూసింది. పార్టీ ఆవిర్భవించిన 9 నెలల వ్యవధిలోనే  ఉమ్మడి ఏపీలో అధికార పీఠాన్ని చేజిక్కించుకున్న టీడీపీ… ఆ వెంటనే  అప్పటికి కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కుటిలత్వం కారణంగా అధికారానికి దూరం అయ్యింది. అయితే ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడటంతో కాంగ్రెస్ దిగివచ్చి మళ్లీ పువ్వుల్లో పెట్టి తెలుగుదేశం కు అధికారం అప్పగించింది. ఆ ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమమే ప్రస్తుత ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు కార్యదక్షత, దీక్షను ప్రపంచానికి చాటింది.  ఆ తర్వాత ఓ ప్రాంతీయ పార్టీ లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కించుకున్న ఏకైక పార్టీగా తెలుగుదేశం అనితర సాధ్యమైన రికార్డును సొంతం చేసుకుంది.  దేశానికి రాష్ట్రపతి నుంచి ప్రధానులుగా ఎవరుండాలో నిర్దేశించింది.  

అటువంటి పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పార్టీ నేతలు, శ్రేణులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజల కష్టాల నుంచి ఆవిర్భవించిన పార్టీకి అండగా నిలుస్తూ వస్తున్న ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలందరూ జరుపుకునే పొండుగ ఒక్క తెలుగుదేశం ఇఆవిర్బావ దినోత్సవం మాత్రమేనని చంద్రబాబు అన్నారు.  43 ఏళ్లుగా కష్టనష్టాలలో ఎన్నో ఆటుపోట్లకు తట్టుకుని పార్టీతో నడుస్తున్న నేతలు, కార్యకర్తలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని చంద్రబాబు  ఈ సందర్బంగా చెప్పారు.  పదవులు, అధికారం కోసం కాకుండా తెలుగుజాతిని అన్ని విధాలా ముందుంచాలన్న లక్ష్యంతో ప్రజలే ముందు అనే విధంగా పని చేస్తున్నామనీ,  ఆత్మగౌరవ నినాదంతో ఎన్టీఆర్ ముందుకెళ్లారు. తానూ అదే  ఆత్మవిశ్వాసంతో ముందుకు నడుస్తున్నానన్నారు.    సామాజిక విప్లవాన్ని తీసుకొచ్చి వెనకబడిన వర్గాలకు అండగా నిలబడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దేశంలో సంక్షేమ యుగాన్ని తీసుకువచ్చింది తెలుగుదేశం పార్టీ. ఎన్టీఆర్ అని చంద్రబాబు చెప్పారు.  

తెలంగాణ ప్రాంతంలో పటేల్ పట్వారీ వ్యవస్థను నిర్మూలించడంతో పాటు మహిళలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, ఆస్తిలో వాటా హక్కు కల్పించింది టీడీపీ. టెక్నాలజీని అందిపుచ్చుకుని అవకాశాలు సృష్టించాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాం. తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీగా ఉండి జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషించింది. ఇది మన తెలుగుజాతికి గర్వకారణం. 43 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు, సవాళ్లను ధీటుగా ఎదుర్కొని నిలబడ్డామంటే దీనికి కార్యకర్తల త్యాగాలు, పోరాటాలే కారణమన్నారు. 

2019 తర్వాత దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు, బెదిరిపుంలు, అరెస్టులు వంటి చర్యలతో భయోత్పాతం సృష్టించినా కార్యకర్తలు జెండా వదల్లేదు. గొంతుపై కత్తిపెట్టి చంపుతామన్నా జై తెలుగుదేశం అని ప్రాణాలు వదిలారంటే... అలాంటి కార్యకర్తలు ఉండటం పార్టీకే గర్వకారణం. 43 ఏళ్ల చరిత్రలో ఎంతో మంది నాయకులను పోగొట్టుకున్నాం. పరిటాల రవి, ఎర్రన్నాయుడు, లాల్ జాన్ బాషా, బాలయోగి, కోడెల శివప్రసాద్ లాంటి గొప్ప నాయకులను కోల్పోయాం. త్యాగాలు, పోరాటాలు టీడీపీకి కొత్తకాదు. ఏం చేసినా రాష్ట్రం కోసం, ప్రజల అభివృద్ధి కోసమే పార్టీ కేడర్ నిలబడ్డారని అన్నారు.