ఛత్తీస్ గఢ్ లో మరో భారీ ఎన్ కౌంటర్.. 15 మంది మావోలు హతం

వరుస ఎన్ కౌంటర్లతో ఛత్తీస్ గఢ్ దద్దరిల్లిపోతున్నది. తాజాగా శనివారం (మార్చి 28) ఉదయం చత్తీస్గఢ్ లోని దంతెవాడ, సుక్మా జిల్లాల సరిహద్దులో  జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో 15 మంది మావోయిస్టులు మరణించారు. ఎన్ కౌంటర్ ఇంకా కొనసాగుతుండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.  దండకారణ్యంలో శనివారం (మార్చి 28) ఉదయం కూంబింగ్ చేస్తున్న భద్రతా దళాలకు మావోయిస్టులు ఎదురుపడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్యా ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్ కౌంటర్ లో 15 మంది మావోయిస్టులు మరణించినట్లు పోలీసులు తెలిపారు.

గోగుండా హిల్ పై మావోయిస్టుల కదలికలకు సంబంధించి విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు భద్రతా దళాలు కూంబింగ్ జరిపాయి. ఆ సందర్భంగా కెర్ల పాల్ పోలీసు స్టేషన్ పరిధిలో భద్రతా దళాలకు మావోయిస్టులు తారసపడ్డారు. భద్రతా దళాలను గమనించగానే ముందుగా మావోయిస్టులు కాల్పులు జరిపినట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రతిగా భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపాయి. ఈ ఎదురు కాల్పులలో 15 మంది నక్సలైట్లు హతమయ్యారు.  ఎదురు కాల్పులు ఇంకా జరుగుతున్నాయి. ఈ కూంబింగ్ ఆపరేషన్ లో డిస్ట్రిక్ట్ రిజర్వ గార్డ్, సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్ లు పాల్గొన్నాయి.