‘ఆ నలుగురు’ తల్లులు!

 

 

 

మిగతా విషయాల సంగతి ఏమోగానీ, ఒక్క విషయంలో మాత్రం తెలంగాణ ప్రజలు సీమాంధ్ర ప్రజల కంటే నాలుగు రెట్లు అదృష్టవంతులు. ఏ విషయంలో అంటే, తల్లుల విషయంలో! ఈ లోకంలో ఎవరికైనా ఒక్క తల్లే వుంటుంది. అలాగే మొన్నటి వరకూ తెలుగు జాతి మొత్తానికి ఒక్క తెలుగు తల్లి మాత్రమే వుండేది. కేసీఆర్ లాంటి ఉత్తమ పుత్రుడి పుణ్యమా అని తెలంగాణ ప్రజలకు తెలంగాణ తల్లి పుట్టుకొచ్చింది. ఇప్పుడా తల్లి ప్రస్తుతానికి మొత్తం నాలుగు అంశలతో తెలంగాణ బిడ్డలకు ఆశీస్సులు అందిస్తోంది.

 

ఇంతకీ ఆ నాలుగు అంశలు ఏవంటే... 1. తెలుగు తల్లికి పోటీగా కేసీఆర్ మొట్టమొదట ప్రవేశపెట్టిన ఒరిజినల్ తెలంగాణ తల్లి. 2. కాలక్రమేణా తెలుగు తల్లి రూపురేఖల్ని మార్చి, తెలుగుతల్లి ముఖంలో కేసీఆర్ కుమార్తె కవిత పోలికలు కనిపించేలా ‘జాగ్రత్తలు’ తీసుకుని తెలంగాణ ప్రజల నెత్తిన రుద్దడానికి ప్రయత్నిస్తున్న ‘కవితెలంగాణ తల్లి’. 3. కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు మితిమీరిన ‘మాతృభక్తి’తో తెలంగాణ ఇచ్చేస్తున్నట్టు ప్రకటించిన సోనియాగాంధీనే నిజమైన తెలంగాణ తల్లి అని ప్రకటించి, తన ఫామ్ హౌస్‌లోని సోనియాలయంలో ప్రతిష్టించడానికి ‘విజయవాడ’లో చెక్కిస్తున్న ‘తెలంగాణ సోనియా తల్లి’. 4. కేసీఆర్ ప్రవేశపెట్టిన తెలంగాణ తల్లి ధనిక, భూస్వామ్య వర్గాలకు ప్రతినిధిగా వుందని, హంగూ ఆర్భాటాలతో వుందని తెలంగాణ తల్లి ఉంటే గింటే చాకలి ఐలమ్మ రూపురేఖల్తో వుండాలని ఆ దిశగా కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు.



ఆ ప్రయత్నాలు సక్సెస్ అయితే బడుగు ప్రజలకు ప్రతినిధిలా వుండే తెలంగాణ తల్లి... వెరసి మొత్తం నలుగురు తెలంగాణ తల్లులు. ఒక్క తల్లి ప్రేమకే ఎవరైనా ఉక్కిరిబిక్కిరి అయిపోతారు. ఇక ఏకంగా నలుగురు తల్లులను పొందిన తెలంగాణ ప్రజలు భవిష్యత్తులో ఇంకెంత ఉక్కిరిబిక్కిరి అవుతారో!