తెలంగాణ: "ఆదేశిక సూత్రాల''ను అమలు చేయకపోతే..!

 

 

- డా. ఎబికె ప్రసాద్
[సీనియర్ సంపాదకులు]

 

 

అనేక అభ్యుదయకరమైన, కొన్ని విప్లవాత్మకమైన తీర్పులను సాహసంతో ప్రకటించిన ఆత్మీయమిత్రులు, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి బి. సుదర్శన్ రెడ్డి ఒక పుస్తకావిష్కరణ సందర్భంగా [ 11-01-2014] జరిగిన సభలో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన అంశాల్ని వెల్లడించారు. సందర్భం పుస్తకావిష్కరణ సభ అయినప్పటికీ, తలాతోకాలేని, ముక్కూముఖంలేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన బిల్లు (2013) రాష్ట్రశాసనసభలో, శాసనమండలిలో సభ్యుల మల్లగుల్లాల మధ్య చర్చలో/ప్రతిష్టంభనలో ఉన్న సమయంలో జస్టీస్ సుదర్శన్ రెడ్డి భారత రాజ్యాంగంలోని "ఆదేశిక సూత్రాల'' లక్ష్యం గురించి నేటి పాలక శక్తులకు వేర్పాటువాదంతో తెలుగుజాతి చీలికను, కృత్రిమ విభజనను కోరుకుంటున్న పదవీస్వార్థపర రాజకీయులకు గుర్తుంచుకోదగిన పాఠం చెప్పారు! ఒకవేళ రేపు ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పడినప్పటికీ,అలా ఏర్పడే రాష్ట్రంలోని ప్రభుత్వం రాజ్యాంగంలోని అత్యంత ప్రధానమైన "ఆదేశిక సూత్రాల'' [డైరెక్టివ్ ప్రిన్సిపిల్స్]ను అమలు పరచడానికి తగిన యంత్రాంగాన్ని రాష్ట్రప్రభుత్వం సృష్టించుకొనకపోతే "తెలంగాణా రాష్ట్రం'' ఏర్పాటే విఫల ప్రయోగమవుతుందని జస్టీస్ సుదర్శన్ రెడ్డి హెచ్చరించారు.


 

అయితే, సుదర్శన్ రెడ్డి చేసిన హెచ్చరిక ఏ ఒక్క భాగానికో కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్ కే కాదు, దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు, చివరికి మొత్తం కేంద్ర ప్రభుత్వానికీ వర్తిస్తుంది. ఎందుకంటే, రాజ్యాంగంలోని 38 - 39 అధికరణలు ప్రజలకు సామాజిక, ఆర్ధిక, రాజకీయ రంగాలలో సమన్యాయం అందించగల సాంఘిక వ్యవస్థను నెలకొల్పడం ద్వారా ప్రజల సంక్షేమాన్ని ప్రభుత్వం కాపాడగల శక్తిగా ఉండాలని [38 వ అధికరణ] ఆదేశిచింది; కాగా, స్త్రీ, పురుషులతో కూడిన పౌరులందరికీ తగిన జీవనభృతిని, ప్రజలందరి సమష్టి ప్రయోజనాలను కాపాడే విధంగా దేశ, రాష్ట్ర వనరులపైన సమష్టి యాజమాన్యం ఉండాలని, ఆ విధంగానే ప్రకృతివనరుల వినియోగం జరగాలనీ అధికరణ - 39 ఆదేశిస్తోంది. అలాగే, సమిష్టి ప్రయోజనాలకు విఘాతం కల్గించే విధంగా దేశ సంపదపైన, ఉత్పత్తి సాధనాలపైన కొలదిమంది గుత్తాధికారం చెలామణీ అయ్యే విధంగా దేశ ఆర్ధికవ్యవస్థ కేంద్రీకరణ ఉండకూడదని కూడా అదే అధికరణ స్పష్టంగా ఆదేశిస్తోంది! అయినా, ఈ రాజ్యాంగ ఆదేశికసూత్రాలను దేశ/రాష్ట్ర పాలకులు ఎందుకు 65 ఏళ్ళుగా భ్రష్టు పట్టించారో ఏ ఒక్క పాలకుడూ ఇప్పటిదాకా సమాధానం యిచ్చిన పాపాన పోలేదు. ఈ వాస్తవం సుదర్శన్ రెడ్డికి తెలియనిది కాదు! ఎందుకంటే, పాలకపక్షాలు తమ స్వార్థప్రయోజనాలకు. తమ సంపదను 'మేటవేసుకోడానికి' రాజ్యాంగంలోని కంతలను ఉపయోగించుకుంటూ వచ్చినవారేగాని ప్రజాబాహుళ్యపు సమష్టి ప్రయోజనాలను గురించి ఆలోచించగల వాళ్ళు కాదు కాబట్టి!


పైగా ఈ ఆదేశికసూత్రాలను, పౌరుల ప్రాథమిక హక్కుల అధ్యాయం నుంచి విడగొట్టి ఈ రెండు అంశాలకు మధ్య ఉండవలసిన పరస్పర సంబంధాలను ఆచరణలో తెంచివేశారు; పౌరుల ప్రాథమిక హక్కుల[అధికరణ - 19]యిన భావప్రకటనా స్వేచ్ఛ, సమావేశ స్వేచ్ఛ,  సంఘనిర్మాణ స్వేచ్ఛ, దేశవ్యాపిత పర్యటన స్వేచ్ఛ, దేశంలోని ఏ ప్రాంతంలోనైనా సరే జీవించే స్వేచ్ఛను వ్యాపార స్వేచ్ఛను గ్యారంటీ చేస్తూ ఇన్ని రకాల స్వేచ్ఛలకు ఆటంకం ఏర్పడినప్పుడు న్యాయస్థానాల ద్వారా న్యాయం పొందే హక్కును రాజ్యాంగం కల్పించింది. కాని ఈ ప్రాథమిక హక్కులనుంచి అంతే శక్తిమంతంగా జీవనానికి ఆధారమైన ఆదేశికసూత్రాలు నిర్దేశిస్తున్న సాంఘిక, ఆర్ధిక, రాజకీయ రంగాలలో సమన్యాయాన్ని, ఆచరణలో పొందలేనప్పుడు న్యాయస్థానాల్ని ఆశ్రయించే హక్కును పౌరులకు దక్కకుండా చేశారు!


ఈ అంతరాన్ని, ఈ అన్యాయాన్ని రాజ్యంగ నిర్మాతలలో అగ్రగణ్యుడైన డాక్టర్ అంబేడ్కర్ గుర్తించాడు. అయితే మరి ఎందుకు ఈ అంతరాన్ని తొలగించలేకపోయాడు? ఒక దళిత మేథావిగా ఈ దోపిడీవర్గ సమాజంలో నివసించవలసివచ్చిన వ్యక్తిగా, ఆనాటి తాత్కాలిక రాజ్యాంగ నిర్ణయసభలో మెజారిటీ వర్గం సంపన్నులకు ప్రాతినిథ్యం వహిస్తున్న నాయకుల మధ్య అంబేడ్కర్ ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. ఆనాడు అంబేడ్కర్ మేధస్సును రాజ్యాంగ రూపకల్పనకు ఉపయోగించుకున్న 'పెద్దలు' రాజ్యాంగ రచనా సంఘానికి చైర్మన్ గా ఉంచడంలో ఉద్దేశం కూడా స్వార్థబుద్ధితో కూడినదే. ఈ రాజ్యాంగం సక్రమంగా అమలు జరిగితే ఆ 'ప్రతిభ' అంతా తమదిగానూ, విఫలమయ్యే పక్షంలో ఆ తప్పిదాన్ని కాస్తా అంబేడ్కర్ దిగానూ భావించి, ప్రకటించడానికి ధనికవర్గ నాయకులు సిద్ధంగా కూచున్నారని మరవరాదు! ఆ కానరాని వత్తిడి వాతావరణంలోనే ప్రాథమిక హక్కుల అధ్యాయానికి ప్రాధాన్యమిచ్చి, సమాజ శ్రేయస్సుకు శాశ్వత గ్యారంటీ యివ్వగల సాంఘిక, ఆర్ధిక, రాజకీయ వకాలిక ప్రతిపాదనలను, సంపదపై ప్రజల సమష్టి స్వామ్యాన్ని నికరం చేసే ఆదేశికసూత్రాలను అప్రధానంగా మూలకు నెట్టేశారు, న్యాయస్థానాలు విస్పష్టమైన తీర్పులిచ్చే అవకాశం లేకుండా చేశారు! ఈ బాధను అంబేడ్కర్ తర్వాత బాహాటంగానే బహిరంగంగానే అనేక పర్యాయాలు వ్యక్తం చేశాడు!


అందువల్లనే, ఈ అంతరం ఆ రెండు అధ్యాయాలను అమలుపరచడంలో వ్యక్తమవుతోందని, న్యాయస్థానాల చేతులు (ఏ చిన్న చిన్న విషయాలలోనో తప్ప) అచేతనంలో ఉండిపోవలసివస్తోంది. అందుకే, ఈ విషయాలు తెలిసిన జస్టీస్ సుదర్శన్ రెడ్డి 65 ఏళ్ళ తరువాత కూడా 'ఆదేశిక సూత్రాల' (Directive Principles)ను మరోసారి ఏకరువుపెట్టి, గుర్తు చేయాల్సి వచ్చింది - మొద్దు స్వరూపాలుగా మారిన మన పాలకపక్షాలకు! ఇదే సందర్భంగా జస్టీస్ సుదర్శన్ మరొక హెచ్చరిక కూడా చేయక తప్పలేదు - "ఆదేశికసూత్రాలు ఆదేశించిన సాంఘిక, ఆర్ధిక విధానాలను నూతన రాష్ట్రంలో పునర్వ్యవస్థీకరించుకొని అమలు జరపకపోతే తెలంగాణా ప్రజలను వివిధ రూపాలలో ఇకముందు కూడా కొనసాగుతుంద''ని జోస్యం చెప్పారు!


జస్టీస్ సుదర్శన్ ప్రస్తావించిన "తెలంగాణా ప్రజల పీడన''  ఈనాటిది కాదు, సుమారు మూడువేల సంవత్సరాల లిపి, భాషా, శాసన, ప్రాచీన నాణేల, చారిత్రిక నేపథ్యం గల్గిన తెలుగుజాతిని కాలక్రమంలో రెండు పరాయి సామ్రాజ్య పాలనాశక్తులు పంచుకుని, విడగొట్టి ఉన్న చారిత్రిక సన్నివేశాన్ని మనం మరవలేము. అవే నిజాం నిరంకుశ రాచరిక పాలనలో ఉన్న తెలంగాణా తెలుగువారు, మద్రాసు రాజధానిగా నలిగిపోయిన తెలుగువారు. ఒకే భాషా సంస్కృతుల పునాదుల మీద ఎదిగివచ్చిన ఈ తెలుగుజాతి పరాయి పాలనల వల్ల పుట్టకొకరు చెట్టుకొకరుగా చెల్లాచెదరై ఉన్నప్పుడు కాలక్రమంలో 'విశాలాంధ్ర' (ఆంధ్రప్రదేశ్)గా అవతరించడానికి తోడ్పడిన మహత్తర చారిత్రిక పరిణామం - ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో నడిచిన తెలంగాణా రైతాంగ సాయుధపోరాటమూ, ఉభయ ప్రాంతాలలో నడిచిన ఆంధ్రోద్యమాలు, ఆంద్రమహాసభాలూనని మరవరాదు. ఈ సత్యం ఇరుప్రాంతాలలో ఉన్న స్వార్థపరులయిన ప్రజావ్యతిరేకులకు, దోపిడీదారులకు తెలియకపోవచ్చు, తెలిసినా గుర్తించగల మేధోశూన్యులైనా కావొచ్చు!


మరొక మాటలో స్పష్టంగా చెప్పాలంటే - ఏ నిజాం కనుసన్నల్లో, నిజాముల ఆశీస్సులతో గ్రామాలలో, పట్టణాలలో బతుకులీడుస్తూ ప్రజల్ని నానాబాధలకు, 'గడీ'లలో చిత్రహింసలకూ, స్త్రీల మానభంగాలకూ  కారకులయ్యారో, ఆ 'దొర'లూ, ఆ పటేల్ పట్వారీలు, జాగిర్దార్లూ, భూస్వాములూ, దేశ్ ముఖ్ లూ లేదా వారి సంతానమే 60 ఏళ్ళ తర్వాత తిరిగి తమ నిరంకుశ పాలనను తెలంగాణా ప్రజలపై రుద్దడం కోసమే ప్రస్తుత వేర్పాటు ఉద్యమాన్ని తలపెట్టి నిర్వహించారు! అందుకే ఈ 'ఉద్యమం' ప్రజా ఉద్యమంగా రూపుదాల్చలేక పోతోంది; మూడు-నలుగు జిల్లాలకే పరిమితం కావలసి వస్తోంది. అదీ, ప్రజలలో భ్రమలు వ్యాప్తి చేసిన ఫలితంగా, సోదర తెలుగు ప్రజలపైన స్థానికులలో పరమ విద్వేషం వ్యాప్తి చేసినందువల్ల మాత్రమె ఉద్యమం పరిమితం కావలసివచ్చింది. అందుకే అది రెండు సంపన్న వర్గాల మధ్య తెలంగాణాపై రాజకీయాధికారం కోసం కొనసాగుతున్న పెనుగులాటగా కుమ్ములాటగా మారుతూ వచ్చింది! 


దాని ఫలితమే వందలమంది షెడ్యూల్ కులాల, షెడ్యూల్ తరగతుల, బి.సి.వర్గాలకు చెందిన యువతలో నూటికి 90 మంది ఈ పాక్షిక స్వార్థపర సంపన్నవర్గాల ఎత్తుగడలకు ఆహుతైపోయారు. ఆ వాస్తవం తెలుగుప్రజలు గుర్తించకుండా ఉండేందుకుగాను చివరికి ఈ రెండువర్గాలకు చెందిన నాయకులు కొందరు శాసనసభలో కూడా దౌర్జన్యకాండకు దిగారు; లోగడ వేరే శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి అడ్డుతగలడమేగాక, అతని ప్రసంగ పాఠాన్ని చించి, ఆయన మీదికి కాగితాలు విసిరికొట్టి, కొందరు సభ్యులపై చేయి చేసుకోవటమూ జరిగింది; ఈ బాపతుకు చెందిన నాయకుడొకడు ఢిల్లీలోని "ఆంధ్రాభవన్'లో పనిచేసుకుంటున్న దళిత అధికారిని కొట్టడమూ జరిగింది; నిన్నగాక మొన్న ఇదే నాయక 'దొర' దళితుడైన కానిస్టేబుల్ ను రాయదుర్గంలో దుర్భాషలాడి, జారిన తన చెప్పుల్ని చేత్తో పట్టుకొచ్చి తనకు తొడగమని ఆదేశించినందుకు అక్కడి పోలీసు స్టేషన్ లో కేసు నమోదు కావలసి వచ్చింది; అలాగే ఇదే 'దొర'తనానికి చెందిన మరొక 'దొర' సౌమ్యంగా కనిపించే బి.సి. వర్గానికి చెందిన మంత్రి పొన్నాలను అసభ్యపదజాలంతో దూషించినందున బి.సి. సంఘాలన్నీ ఆ 'దొర'ను అరెస్టు చేయాలని నినదిస్తున్నాయి!


ఇన్ని ఘటనలు వరసక్రమంలో యింకా ప్రత్యేక రాష్ట్రమంటూ ఒకటి ఏర్పడక ముందే సాగుతూంటే, రేపటి పరిస్థితి తెలంగాణాలోనే ఎలా ఉండబోతుందో ఊహించుకోవచ్చు! ఎందుకంటే తెలంగాణలో దొరల, భూస్వాముల దాస్టికాలను నిజాముల నిరంకుశపాలనకు తోడుగా ప్రజల అనుభవించివున్న వారే కాబట్టి, మొత్తం తెలుగుజాతి రక్షణలో భాగంగానే విభజన ముసాయిదా బిల్లును తీవ్ర స్థాయిలోనే అడ్డుకొని తీరాలి; తెలంగాణలో రానున్న పరిణామాల గురించి జస్టీస్ సుదర్శన్ వూహిస్తున్నట్టుగానే, తెలంగాణా ప్రజలను మరోసారి 'దొర' స్వామ్యం నుంచి రక్షించే బాధ్యత యావత్తు తెలుగుజాతిదిగానే ఉండాలని కోరుకోవాలి. తద్వారా ఉభయ ప్రాంతాల దోపిడీ వర్గాలను ఉభయ ప్రాంతాల ప్రజలూ దూరంగా ఉంచగల్గుతారు. ఈ ముసాయిదా బిల్లుకు సవరణల అవసరాన్ని సీమాంధ్రులేగాక, తెలంగాణా ప్రజాఫ్రంటు వర్గాలు, వేర్పాటువాదుల వర్గమూ కూడా గుర్తించినందున, బిల్లుకు పూర్తిస్థాయిలో సవరించి, వివరణలతో కూడిన ముసాయిదాను నిర్దోషంగా రూపొందించి శాసనసభకు పంపాలని అందరూ కోరుతున్నందున కూడా విభజన ప్రక్రియ ఎంత తప్పుడుదో ప్రజలకు అర్థమయింది! విభజన వాదులకు, 'బెంగా'తో ఉన్న కెసిఆర్ వర్గానికి మిగిలిందీ మిగిలేదీ కోపమొక్కటే - "కోపం శేషన పూరయేత్''!