వైయస్సార్ సెంటిమెంటుతో తెలంగాణాలో విజయం సాధ్యమేనా
posted on Jun 28, 2013 1:40PM
తెలంగాణా సెంటిమెంటు బలంగా ఉన్నతెలంగాణా జిల్లాలలో, తెలంగాణా ప్రసక్తి ఎత్తలేని వైయస్సార్ కాంగ్రెస్స్ పార్టీ అక్కడ నిలదొక్కుకోవడానికి వైయస్సార్ సెంటిమెంటుపైనే ముఖ్యంగా ఆధారపడి ఉంది. ఆయితే, దానిని కూడా చిరకాలం కొనసాగించడం కష్టమే. ఒకవైపు తెరాస అధినేత కేసీఆర్, వైయస్సార్ తమని ఏవిధంగా మోసం చేసింది ప్రజలకి విడమరిచి చెపుతుంటే, వైయస్సార్ చాలా మంచోడని వారికి నచ్చజెప్పడం అంత తేలికయిన విషయం కాదు. అయితే, త్వరలో జరగనున్న పంచాయితీ, మునిసిపల్ ఎన్నికలలో గెలవాలంటే ప్రజలకి ఏదో ఒక విధంగా నచ్చజెప్పుకోక తప్పదు.
ప్రస్తుతం తెలంగాణాలోపర్యటిస్తున్న ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, వైయస్సార్ పేరు ప్రస్తావిస్తూనే, జగన్ మోహన్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయంగా జైలులో పెట్టిందని, వచ్చే సాధారణ ఎన్నికలు కూడా పూర్తయ్యేవరకు జగన్నిఇంకా జైలులోనే ఉంచాలనే ప్రయత్నంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని ఆమె ఆరోపించారు. తద్వారా, ఆమె ఇప్పుడు సానుభూతి సెంటిమెంటుని ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తునట్లున్నారు.ఇక, ఆ తరువాత వరుసగా చంద్రబాబుని, కిరణ్ కుమార్ రెడ్డిని విమర్శించడంతో ఆమె ప్రసంగాలు ముగుస్తుంటాయి.
ప్రజలు ఆమె నుండి తెలంగాణ అంశంపై పార్టీ అభిప్రాయం ఆశిస్తుంటే, ఆమె చనిపోయిన తన భర్త గురించి, జైల్లో మ్రగ్గుతున్న తన కొడుకు గురించి మాత్రమే మాట్లాడుతుండటంతో, ఆమె సభలలో కొత్తగా చెప్పేదేమీ లేదనే సంగతి ప్రజలకి అర్ధం అయ్యింది. దానివల్ల నేతల ప్రోదబలంతో, జన సమీకరణ వల్ల వచ్చే ప్రజలే తప్ప స్వచ్చందంగా ఆమె సభలకి వచ్చే ప్రజలు కరువయ్యారు. అయినప్పటికీ, విజయమ్మ యధాశక్తిన తన పార్టీ నేతలని ఉత్సాహపరుస్తూ, పంచాయితీ ఎన్నికలలో విజయం సాధించాలని నూరిపోస్తున్నారు.
పార్టీ తరపున ప్రజలకి చెప్పుకోవడానికి బలమయిన పాయింటు ఒక్కటి కూడా లేకపోవడంతో, నేతలు మీడియా ముందు పడికట్టు పదాలను పేర్చుకొని ఉపన్యాసాలు చేస్తూ ఎలాగో నెగ్గుకొస్తున్నా, అంతిమంగా ఫలితాలు మాత్రం సానుకూలంగా రాకపోవచ్చునని ఆ పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు.