చంద్రబాబు అరెస్టుకు ఏడాది.. అదే జగన్ సర్కార్ కు సమాధి!
posted on Sep 9, 2024 4:55PM
ఒక దార్శనికుడిని రాజకీయ వైరంతో మరుగున పడేయడం ఎవరి వల్లా కాదు. ఆ విషయం చంద్రబాబు విషయంలో పదే పదే రుజువు అవుతోంది. రాజకీయంగా చంద్రబాబుకు ఉన్న గుర్తింపు, ప్రతిష్ట ఆయన రాజకీయ ప్రత్యర్థులకు కంటగింపుగా ఉంటే ఉండొచ్చు.. కానీ నిజమైన అభివృద్ధి, ప్రజా ప్రయోజనాలకు సాంకేతికతను ఆయన ఉపయోగించిన తీరు మేధావులూ, ప్రగతి కాముకులు, ప్రజా ప్రయోజనాలే పరమార్ధంగా తమతమ రంగాలలో నిష్ణాతులైన వారూ మాత్రం చంద్రబాబు దార్శనికతపై ప్రశంసలు కురిపిస్తారు. కురిపిస్తూనే ఉంటారు. జనం చంద్రబాబుపై తమ నమ్మకాన్ని చాటుకుంటూనే ఉన్నారు. చాటుతూనే ఉంటారు. అటువంటి దార్శనికుడిని, అటువంటి ప్రజా నేతను కేవలం రాజకీయ కక్ష సాధింపుతో జగన్ సర్కార్ సరిగ్గా ఏడాది కిందట ఇదే రోజు అంటే సెప్టెంబర్ 9న అరెస్టు చేసింది.
రాజకీయ కక్ష సాధింపులతో దేశం గర్వించే రాజనీతిజ్ఞుడి అరెస్టు అది.. దేశాన్ని నివ్వెరపరిచిన అరెస్టు అది. ప్రభుత్వ టెర్రరిజాన్ని పతాకస్థాయికి చేర్చిన అరెస్టు అది. దేశంలో కోట్ల మంది ప్రజల గుండెలను బరువెక్కించిన అరెస్టు అది. ప్రపంచంలో ఎన్నడూ లేని విధంగా ఒక రాజకీయ నాయకుడి కోసం 70 దేశాల్లో ప్రజలు రోడ్డెక్కి నిరసనలు తెలిపేలా చేసిన అరెస్టు అది. భయకంపితులై ఉన్న ప్రజల్లో తిరుగుబాటు తీసుకు వచ్చిన అరెస్టు అది. అరాచకాన్ని ప్రశ్నించేందుకు కుల, మత, ప్రాంత, వర్గం అన్న తేడా లేకుండా తెలుగు జాతి మొత్తం గళమెత్తి నిరసన తెలిపేలా చేసిన అరెస్టు అది. ప్రజాస్వామ్యం కోసం, ప్రజా శ్రేయస్సు కోసం రాజకీయ ప్రయోజనాలు వదులుకునే నేతను అప్రజాస్వామ్యకంగా చేసిన అరెస్టు అది.. విధ్వంస ప్రభుత్వం పతనానికి నిశ్శబ్ద విప్లవంతో నాంది పలికిన అరెస్టు అది.. చరిత్ర క్షమించని తప్పు చేసిన వారిని భూస్థాపితం చేసేందుకు అడుగు పడిన అరెస్టు అది.. అదే తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడి అరెస్టు. జగన్ ప్రభుత్వం చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి ఈ రోజుకు సెప్టెబర్ 9 (సోమవారం) సరిగ్గా ఏడాది.
ఏపీలో అరాచక పాలన సాగిస్తున్న వైసీపీ ప్రభుత్వం పతనానికి బీజం పడింది కూడా ఏడాది కిందట సరిగ్గా ఇదే రోజు. చంద్రబాబు అరెస్టు తరువాత ఏపీ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. జగన్ మోహన్ రెడ్డి అరాచక పాలనతో గొంతెత్తేందుకు భయపడిన జనం.. చంద్రబాబు అక్రమ అరెస్టుతో ఒక్కసారిగా ఆగ్రహానికి లోనై రోడ్లపైకొచ్చి జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పి పోరాటానికి నడుం బిగించారు. ఆ నాడు మొదలైన ప్రజా పోరాటం ఎన్నికల్లో జగన్ పతనం చూసే వరకు కొనసాగింది.
వైసీపీ హయాంలో చంద్రబాబు నాయుడు అరెస్టుకు ముందు ఒక లెక్క.. చంద్రబాబు అరెస్టు తరువాత ఒక లెక్క అని చెప్పొచ్చు. చంద్రబాబు అరెస్టుకు ముందు వరకూ జగన్ మోహన్ రెడ్డి అరాచక పాలన సాగింది. జగన్ ప్రభుత్వానికి కొమ్ము కాసిన కొందరు పోలీసులు ప్రతిపక్ష పార్టీల నేతలపై అక్రమ కేసులు పెట్టి చిత్రహింసలకు గురిచేశారు. అక్రమంగా అరెస్టు చేసి జైళ్లకు పంపించారు. అభివృద్ధి లేదు.. గుంతలు పడిన రోడ్లను బాగుచేసే పరిస్థితి లేదు. ఇదేమని ప్రశ్నించిన సామాన్య ప్రజలపైనా దాడులు, కేసులు. రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలింది. దీంతో ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు భయపడ్డారు. పార్టీ జెండాలను కట్టేందుకు సైతం ప్రతిపక్ష పార్టీల నేతలు వణికిపోయారు. అంతటి స్థాయిలో జగన్ హయాంలో అరాచక, విధ్వంస, వికృత పాలన జరిగింది. ఇదే క్రమంలో అధికార మదంతో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపైనా అక్రమ కేసులుపెట్టి జైలుకు పంపించేందుకు జగన్ పూనుకున్నారు. ఏపీ సీఐడీ ద్వారా నైపుణ్యాభివృద్ధి సంస్థ కేసులో అక్రమంగా ఇరికించి అరెస్టు చేయించింది. 2023 సెప్టెంబర్ 8న నంద్యాలలో జరిగిన ‘బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ’ సభలో చంద్రబాబును పాల్గొన్నారు. ఆ రాత్రి అక్కడే బస్సులో బస చేశారు. తెల్లవారుజామున డీఐజీ కొల్లి రఘురామిరెడ్డి అత్యుత్సాహం ప్రదర్శించి వందల మంది పోలీసులతో చంద్రబాబు బస్సును చుట్టుముట్టారు. బలవంతంగా చంద్రబాబును అరెస్టు చేసి రోడ్డు మార్గంలో విజయవాడ సిట్ కార్యాలయానికి తరలించారు. అక్కడి నుంచి కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు రిమాండు విధించడంతో రాజమహేంద్రవరం జైలుకు చంద్రబాబును తరలించారు.
చంద్రబాబు అరెస్టుతో రాష్ట్ర మొత్తం భగ్గుమంది. ఉవ్వెత్తున ఆందోళనలు ఎగిసిపడ్డాయి. చంద్రబాబుకు సంఘీభావం తెలియజేసేందుకు హైదరాబాద్ నుంచి ఏపీకి వస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను విమానంలో రాకుండా అడ్డుకున్నారు. రోడ్డు మార్గాన వస్తుండగా పోలీసులు రాష్ట్ర సరిహద్దుల్లోనే అడ్డుకున్నారు. ఈ సమయంలో పవన్ రోడ్డుపైనే పడుకొని నిరసన తెలిపాడు. నాలుగు దశాబ్దాలకుపైగా రాజకీయాల్లో ఉంటూ.. మూడు దఫాలు సీఎంగా పనిచేసిన చంద్రబాబు నాయుడుపై ఒక్క అవినీతి మరక లేదు. కానీ, జగన్ మోహన్ రెడ్డి అక్రమ కేసులు బనాయించి చంద్రబాబును జైల్లో పెట్టారు. దీనిని తెలుగు ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. కులాలు, మతాలు అనే తేడా లేకుండా ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. చంద్రబాబు అరెస్టుతో ఐటీ ఉద్యోగులు పెద్ద ఎత్తున రోడ్లుపైకి వచ్చి జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతెత్తారు. హైదరాబాద్, కర్ణాటక, తమిళనాడుతోపాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ఐటీ ఉద్యోగులు చంద్రబాబు అరెస్టుకు నిరసన తెలిపారు. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా సహా సుమారు 70 దేశాల్లో ఐటీ ఉద్యోగులు, వివిధ రంగాలకు చెందిన తెలుగు ప్రజలు ర్యాలీలు చేపట్టారు. తెలుగు రాష్ట్రాల్లోనేకాదు.. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో.. ఇతర దేశాల్లోని తెలుగు వారు చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ 53రోజులుపాటు నిరసన తెలిపారు. చంద్రబాబు తన 40ఏళ్ల రాజకీయంలో ఏ స్థాయిలో ప్రజల మద్దతు కూడగట్టుకున్నారో ఆ సమయంలో దేశ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశం అయింది. చంద్రబాబు నాయుడు అంటే కేవలం ముఖ్యమంత్రి, రాజకీయ పార్టీకి అధినేత కాదు.. ప్రజల మనిషి అని మరోసారి రుజువైంది.
చంద్రబాబు అరెస్టుకు నిరసనగా హైదరాబాద్ గచ్చిబౌలిలో నభూతో అన్న రీతిలో సీబీఎన్ గ్యాటిట్యూడ్ సభ జరిగింది. ఐటీ ప్రొఫెషనల్స్ స్వచ్ఛందంగా చంద్రబాబుకు కృతజ్ణత తెలిపేందుకు నిర్వహించిన ఈ సభ నభూతో. సాధారణంగా ఏ నాయకుడైనా అరెస్టైతే జనం ఆ నేత అవినీతి, అక్రమాలపై చర్చించుకుంటారు. కానీ సీబీఎన్ అరెస్టు సమయంలో మాత్రం రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచ దేశాలలో చంద్రబాబు గొప్పతనం గురించిన చర్చ జరిగింది. హైదరాబాద్ కు మైక్రోసాఫ్ట్ ను తీసుకువచ్చిన ఆయన సమర్థత గురించి జనం చర్చించుకున్నారు. భాగ్యనగరానికి ఐండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ తరలి వచ్చేలా చేసిన ఆయన గొప్పతనం గురించి ప్రజలు చర్చించుకున్నారు.
అటువంటి నేతను జగన్ మోహన్ రెడ్డి అరెస్టు చేయించడమే కాకుండా చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు కూడా సైకోయిజాన్ని చూపించారు. జైల్లో చంద్రబాబుకు కనీస సౌకర్యాలుకూడా కల్పించకుండా ఇబ్బందులకు గురిచేశారు. బాబుతో ములాఖత్ అయ్యి బయటకు వచ్చిన సమయంలో ఆయన సతీమణి భువనేశ్వరి కన్నీరు పెట్టుకున్నారు. చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలోనే పవన్ కల్యాణ్ కలిశారు. జైల్లో ఆయన పరిస్థితిని చూసి ఆవేదనకు గురయ్యారు. ఆ సమయంలోనే జనసేన, పొత్తు పొడిచింది. జైల్లో చంద్రబాబును కలిసి బయటకు వచ్చిన పవన్.. మీడియాతో మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన కలిసి పోటీ చేస్తాయని.. జగన్ పతనం ఖాయమైందని ప్రకటించారు. 2023 సెప్టెంబర్ 8న చంద్రబాబు అరెస్టు కాగా.. 53 రోజులపాటు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లోనే ఉన్నారు. ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో జైలు నుంచి చంద్రబాబు విడుదలయ్యారు. తమ అభిమాన నేత జైలు నుంచి బయటకు రావడంతో జైలు వద్దకు భారీ సంఖ్యలో ప్రజలు చేరుకొని ఘన స్వాగతం పలికారు. జైలు వద్ద నుంచి విజయవాడ వరకు దారిపొడవునా ప్రజలు నీరాజనం పలికారు. మహిళలు రోడ్లుపైకి వచ్చి చంద్రబాబుకు హారతులు పట్టారు. యువత, ముసలి.. ఆడ, మగ అనే తేడాలేకుండా చంద్రబాబును చూసేందుకు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత ఏమాత్రం విశ్రాంతి తీసుకోలేదు.. జైలు నుంచి బయటకు వచ్చిన కొద్దిరోజులకే ప్రజల్లోకి వచ్చారు.. అప్పటి నుంచి ఎన్నికలు పూర్తయ్యే వరకు ప్రజల మధ్యలోనే ఉంటూ జగన్ ప్రభుత్వ అంతానికి ఒక్కో అడుగు వేస్తూ ముందుకు సాగారు. ప్రజలు సైతం చంద్రబాబు అడుగులో అడుగు వేస్తూ ఓటు ద్వారా జగన్ ప్రభుత్వాన్ని నేలకూల్చారు. కేవలం 11 నియోజకవర్గాలకే జగన్ పార్టీని పరిమితం చేసి ప్రతిపక్ష హోదాను కూడా ఇవ్వలేదు. ఒకవేళ జగన్ మోహన్ రెడ్డి చంద్రబాబును అరెస్టు చేసి ఉండకపోతే ఇంత భారీ స్థాయిలో ఓటమి ఉండేది కాదని వైసీపీ నేతలు ఇప్పటికీ చెప్పుకుంటారు. చంద్రబాబు విషయంలో జగన్ చేసిన అతిపెద్ద తప్పుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. చంద్రబాబును టచ్ చేస్తే ఫలితం ఏ స్థాయిలో ఉంటుందో ప్రజలు ఓటు ద్వారా జగన్ మోహన్ రెడ్డికి మహ బాగా రుచిచూపించారు.